సమీక్ష : శ్రీమన్నారాయణ – రైతుల కోసం పోరాడే శ్రీమన్నారాయణ

సమీక్ష : శ్రీమన్నారాయణ – రైతుల కోసం పోరాడే శ్రీమన్నారాయణ

Published on Aug 31, 2012 8:10 AM IST
విడుదల తేదీ: 30 ఆగష్టు 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకుడు : రవికుమార్  చావలి
నిర్మాత : రమేష్ పుప్పాల
సంగీతం: చక్రి
నటీనటులు : బాలకృష్ణ, పార్వతి మెల్టన్, ఇషా చావ్లా

సింహా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బాలకృష్ణకి మళ్లీ ఆ రేంజ్ హిట్ లేదు. శ్రీ రామరాజ్యం మినహాయిస్తే భారీ హిట్ కోసం అయన విక్రమార్కుడి లాగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చిన మరో సినిమా ‘శ్రీమన్నారాయణ’. బాలయ్య సరసన ఇషా చావ్లా, పార్వతి మెల్టన్ హీరోయిన్లుగా నటించగా రవికుమార్  చావలి డైరెక్షన్లో ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల నిర్మించిన ఈ సినిమా ఈ రోజే విడుదలైంది.

కథ :

రైతుల కోసం పోరాడే కల్కి నారాయణ మూర్తి (విజయ్ కుమార్) రైతుల సంక్షేమం కోసం జై కిసాన్ అనే నిధి ఏర్పాటు చేసి నిధులు సేకరిస్తాడు. ఆ రైతు సంక్షేమ నిధికి బ్యాంకు మేనేజర్ అయిన రాజన్ ముదలియార్ (కోట) 5 లక్షలు విరాళం ఇచ్చి ఆ నిధికి వచ్చిన 5 వేల కోట్ల రూపాయల్ని డబ్బుని తమ బ్యాంకులో జమ చేయించుకుంటాడు. ఆ డబ్బు ప్రభుత్వానికి అందచేసే సమయానికి నారాయణ మూర్తిని శత్రువులు చంపి ఆ ఐదు వేల కోట్లని తమ ఎకౌంటులోకి మార్చుకొని, ఆ నేరాన్ని నారాయణ మూర్తి కొడుకు శ్రీమన్నారాయణ (బాలకృష్ణ) మీద మోపి అతన్ని జైలుకి పంపిస్తారు. చేయని తప్పుకి జైలుకి వెళ్ళిన శ్రీమన్నారాయణ జైలులో ఉండి శత్రువుల ఆట ఎలా కట్టించాడు అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

బాలకృష్ణ ఈ సినిమాలో తన గెటప్ మీద కొంచెం కేర్ తీసుకున్నట్లు తెలిసిపోతుంది. ఆయన ఈ సినిమాలో వయసుని భారీగా తగ్గించుకునే ప్రయత్నం చేసారు. ఆ విషయంలో ఆయన బాగానే సక్సెస్ అయ్యారు. ఈ సారి డైలాగ్ డెలివరీ కూడా బావుంది. ఈసారి విగ్, డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగా కుదిరింది. ఫైట్స్ కూడా బాగా చేసారు. డాన్సుల విషయంలో మునపటి ఎనర్జీ లేకపోయినా తన వంతు ప్రయత్నం అయితే చేసారు. ఇషా చావ్లా, పార్వతి మెల్టన్ ఇద్దరినీ కేవలం సాంగ్స్ కోసం వాడుకున్నారు. బాలకృష్ణ, ఇషా, పార్వతి మెల్టన్ దువ్వాసి మోహన్ మధ్య కామెడీ సీన్స్ బాగా పండాయి. దువ్వాసి మోహన్ వేసిన పంచ్ డైలాగ్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. రాజన్ ముదలియార్ గా కోట శ్రీనివాస్ రావు, హర్షద్ కొఠారి సురేష్, బైల్ రెడ్డిగా జయప్రకాశ్ రెడ్డి, పులి కేశవ రెడ్డిగా సుప్రీత్, శ్రీకర్ ప్రసాద్ గా నాగినీడు, మార్తాండ్ గా రావు రమేష్ ఇలా అర డజను మంది విలన్స్ ఉన్నారు. అందరు కొత్తగా చేసిందేమి లేకపోయినా పాత్ర పరిధి మేరకు చేసుకుంటూ వెళ్లారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో బాలయ్య గెటప్ బావుంది కదా అని సంతోషించే లోపే మధ్యలో తనకు నప్పని రెండు విచిత్రమైన గెటప్స్ వేసి షాక్ ఇచ్చాడు. ఇద్దరు హీరోయిన్స్ తో చేసిన రొమాన్స్ ఎబ్బెట్టుగా ఉంది. సి.బి.ఐ ఆఫీసర్ జ్ఞానేశ్వర్ (వినోద్ కుమార్) ఎంక్వయిరీ విషయానికి వస్తే జై కిసాన్ రైతు నిధి ఎకౌంటు నుండి ఐదు వేల కోట్లు ఏ అకౌంటుకి జమ అయ్యాయి అనే విషయం వదిలేసి, శ్రీమన్నారాయణ చుట్టూ తిరగడం లాంటి చిన్న లాజిక్ వదిలేయడం ఏంటో దర్శకుడికే తెలియాలి. ఇప్పటికే సన్నగా ఉన్న పార్వతి మెల్టన్ జీరో సైజ్ కోసం ట్రై చేసిందో ఏమో తెలియదు కాని అస్సలు బాలేదు. ఫస్టాఫ్ వరకు పర్వాలేదు బాగానే ఉంది అనిపించినప్పటికీ సెకండాఫ్ నీరసించి క్లైమాక్స్ భయపెట్టింది. కృష్ణ భగవాన్, ఎమ్. ఎస్ నారాయణ ముతక కామెడీ చివరి దాకా సాగింది.

సాంకేతిక విభాగం :

చక్రి మ్యూజిక్ ఏ మాత్రం ఆకట్టుకొకపోగా బాడ్ టైమింగ్ వల్ల సాంగ్స్ అవగానే ప్రేక్షకులు ఒక్కొక్కరు ఎలిమినేట్ అయ్యారు. నేపధ్య సంగీతం విషయానికి వస్తే ఇటీవలే వచ్చిన ది దర్క్ నైట్ రైసెస్ వంటి చాలా సినిమాల నుండి డైరెక్ట్ ట్యూన్స్ అలాగే పెట్టేసారు. పోలుర్ ఘటికాచలం డైలాగ్స్ బావున్నాయి. గౌతం రాజు గారు ఎడిటింగ్ విషయంలో మొహమాట పడ్డారు. సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బావుంది.

తీర్పు :

రవికుమార్  చావలి రైతుల కోసం పోరాడే మంచి కథ ఎంచుకున్నాడు కానీ ఆ కథని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడంలో సగం మాత్రమే సక్సెస్ అయ్యాడు. తను కథను మాత్రమే నమ్ముకోకుండా మధ్యలో అనవసరమైన సిల్లీ సీన్స్ ఇరికించి సైడ్ ట్రాక్లో వెళ్ళాడు. దువ్వాసి మోహన్ కామెడీ బావున్నప్పటికీ హీరోయిన్స్ తో రొమాంటిక్ మరియు సెకండాఫ్ బాగాలేకపోవడం మైనస్ గా మారాయి. శ్రీమన్నారాయణ ఓవరాల్ గా బాలయ్య గత సినిమాల కంటె పర్వాలేదనిపించింది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

అశోక్ రెడ్డి. ఎమ్

Click Here For ‘Srimannarayana’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు