సమీక్ష : సచిన్.. టెండూల్కర్ కాదు – చిన్న పిల్లలకు మాత్రమే.!

సమీక్ష : సచిన్.. టెండూల్కర్ కాదు – చిన్న పిల్లలకు మాత్రమే.!

Published on Mar 13, 2015 1:09 PM IST
Sachin Tendulkar kadu

విడుదల తేదీ : 13 మార్చి 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : యస్. మోహన్

నిర్మాత : తానికొండ వెంకటేశ్వర్లు

సంగీతం : రాజేష్ రామనాధ్

నటీనటులు : సుహాసిని మణిరత్నం, వెంకటేష్ ప్రసాద్, మాస్టర్ స్నేహిత్…

2014 జూలైలో కన్నడలో రిలీజ్ అయ్యి విమర్శకులతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించిన సినిమా ‘సచిన్.! టెండూల్కర్ అల్ల’. ఈ సినిమాని తెలుగులో ‘సచిన్ .. టెండూల్కర్ కాదు’ అనే టైటిల్ తో డబ్బింగ్ చేసారు. ఈ సినిమాలో సుహానిసి మణిరత్నం, మాస్టర్ స్నేహిత్ లు ప్రధాన పాత్రలు పోషించగా, మొదటి సారిగా ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అయిన వెంకటేష్ ప్రసాద్ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సచిన్ మాస్టర్ బ్లాస్టర్ కాకపోయినా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడనేది చూద్దాం..

కథ :

స్వాతి (సుహాసిని) ఒక ఇండస్ట్రియలిస్టు.. తనకి పెళ్లి ఈడు దాటినా పెళ్లి చేసుకోదు.. దానికి కారణం తనకి సచిన్(మాస్టర్ స్నేహిత్) అనే మెంటల్లీ రిటార్టెడ్ తమ్ముడు ఉండడమే. సచిన్ మెంటల్లీ రిటార్టెడ్ అయినా తనకి క్రికెట్ అన్నా, సచిన్ అన్నా చాలా ఇష్టం. తనని చూసుకోవడం కోసమే తనని ప్రేమిస్తున్న క్రికెట్ కోచ్ వెంకటేష్ ప్రసాద్(వెంకటేష్ ప్రసాద్) ని కూడా వెయిట్ చేయిస్తుంది. అలా జరుగుతున్న టైంలో ఓ రోజు సచిన్ కి బ్రెయిన్ ట్యూమర్ అని ఎక్కువ రోజులు బతకడని డాక్టర్స్ చెబుతారు. ఆ టైంలో స్వాతి సచిన్ కి ఏమేమి ఇష్టమో అవన్నీ చూపించాలని అనుకుంటుంది.

కానీ సచిన్ మాత్రం హైదరాబాద్ లో జరిగే స్కూల్ టోర్నమెంట్ క్రికెట్ మ్యాచ్ లో తను ఏదో ఒక టీం తరపున ఆడాలని కోరతాడు. ఏం చేయాలో అర్థం కాని స్వాతి ఆ విషయాన్ని వెంకటేష్ ప్రసాద్ కి చెబుతుంది. అప్పుడే వెంకటేష్ ప్రసాద్ తన జాబుని రిస్క్ లో పెట్టి మరీ తను పనిచేస్తున్న స్కూల్ టీంలో సచిన్ కి చోటు ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది.? సచిన్ వెంకటేష్ ప్రసాద్ ఇచ్చిన ట్రైనింగ్ వల్ల బాగా ఆడగలిగాడా.? లేదా.? సచిన్ వల్ల వెంకటేష్ ప్రసాద్ స్కూల్ టీం మ్యాచ్ లో గెలిచిందా.? లేక ఓడి వెంకటేష్ ప్రసాద్ ఉద్యోగాన్ని పోగొట్టిందా.? అలాగే సచిన్ చివరి కోరిక కోసం వెంకటేష్ ప్రసాద్ ఎందుకు అంత రిస్క్ తీసుకున్నాడు అనేది మీరు వెండితెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

‘మానసిక వైకల్యం’తో బాధపడుతున్న బాలలు కూడా మనలో ఒకరే, వారేమీ అంటరానివారు కాదు, అలాంటి మానసిక వికలాంగులందరినీ మనలో ఒకరిగా కలుపుకు పోవాలని డైరెక్టర్ చెప్పిన స్టొరీ లైన్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. స్టొరీ పాయింట్ ని పక్కన పెడితే ఈ సినిమాలో సెకండాఫ్ లో కొన్ని ఎలిమెంట్స్ ని చాలా బాగా డీల్ చేసాడు. సచిన్ ని క్రికెట్ ప్లేయర్ గా చూపించే సీన్స్, అలాగే చివరి క్రికెట్ మ్యాచ్ లో కొన్ని మోమెంట్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. ఫైనల్ మ్యాచ్ చాలా వరకూ ఆసక్తికరంగా ఉంటుంది. అవసరం అయినప్పుడు అందరూ ఒకటవ్వాలి అనే మెసేజ్ ని పిల్లల ద్వారా బాగా చూపించాడు.

ఇక నటీనటుల విషయానికి వస్తే మానసికంగా ఇబ్బంది పడుతున్న తమ్ముడిని ఒక తల్లిలా చూసుకునే పాత్రలో సీనియర్ సుహాసిని మణిరత్నం మంచి నటనని కనబరిచింది. ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేసింది. క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ బాగానే చేసాడు. తను ఇందులో చేసింది కూడా ఓ క్రికెట్ కోచ్ పాత్రే కావడం వలన యాక్టింగ్ డీసెంట్ గా ఉంటుంది. మాస్టర్ స్నేహిత్ మెంటల్లీ రిటార్టెడ్ బాయ్ గా ఓకే అనిపించాడు. మిగతా నటులంతా కన్నడ నటులు, మన తెలుగు వారికి పరిచయం లేని వారు కానీ వారు. కానీ వారు చేసింది చిన్న పాత్రలే కావడం వలన వారి వారి పాత్రల్లో కనిపించి మెప్పించి వెళ్ళిపోయారు.

మైనస్ పాయింట్స్ :

సినిమా పరంగా చూసుకుంటే.. ఒక్క స్టొరీ లైన్ పరంగా తప్ప మిగతా అన్ని మేజర్ డిపార్ట్ మెంట్స్ లోనూ చాలా తప్పులున్నాయి.ఈ సినిమా కథ మొత్తం ఒక మెంటల్లీ రిటార్టెడ్ కుర్రాడి చుట్టూ అల్లుకున్నారు.. అంటే ఆ పాత్రని సినిమా మొదట్లోనే ఆడియన్ కి కనెక్ట్ చెయ్యాలి, అలా చేస్తేనే ఆడియన్స్ ఆ పాత్రతో ట్రావెల్ అవుతారు. కానీ ఈ సినిమాలో అది మిస్ అయ్యింది. ఈ సినిమా పాయింట్ మెంటల్లీ రిటార్టెడ్ కుర్రాడి లైఫ్ కానీ ఫస్ట్ హాఫ్ లో ఎక్కువగా ఆ పాయింట్ ని చూపించరు. సడన్ గా సెకండాఫ్ లో కథని తన మీదకి డైవర్ట్ చేస్తారు. చెప్పాలంటే ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ సినిమాకి కనెక్ట్ అయ్యే పాయింట్ ఒక్కటి కూడా ఉండదు.

ఇక సెకండాఫ్ మొదట్లో కథని సచిన్ మీదకి తీసుకెళ్ళడంతో బాగానే అనిపించినా ఆ తర్వాత మళ్ళీ కాసేపు సినిమాని అనవసరపు సాంగ్స్ తో సినిమాని స్లో చేసేసాడు. అలాగే సచిన్ కి క్రికెట్ అంటే ఎందుకంత ఇష్టం అనేదానికి రీజన్ ఉండదు. అలాగే సెకండాఫ్ లో కీలకం అయినవి రెండు. సచిన్ ప్రాక్టీస్ మరియు క్లైమాక్స్ మ్యాచ్. వెంకటేష్ ప్రసాద్ లాంటి క్రికెట్ ప్లేయర్ ని పెట్టుకొని చాలా పర్ఫెక్ట్ గా స్క్రీన్ ప్లే ని రాసుకోవచ్చు కానీ ఆయన అది చేయకుండా ఒక పాట పెట్టి మాస్ హీరో కి ఇచ్చిన బిల్డప్ ఇచ్చాడు. అది అవసరం లేదు కథకి, ఇక మ్యాచ్ లో మొదట సీరియస్ నెస్ చూపించిన డైరెక్టర్ చివరికి వచ్చే సరికి సిల్లీగా చేసేసాడు. దాంతో క్లైమాక్స్ తేలిపోయింది. దాంతో ఆడియన్స్ మళ్ళీ నిరుత్సాహానికి గురవుతారు. అలాగే కథలో అవసరం ఉన్నా మ్యాచ్ మధ్యలో ఒక్క మోటివేషనల్ సీన్ ని కూడా పెట్టలేదు. కథకి అవసరం లేనివి చాలా పెట్టిన డైరెక్టర్ కథకి అవసరం అయిన ఇలాంటి సీన్స్ ఎందుకు పెట్టలేదో ఆయనకే తెలియాలి. సినిమాలో పాటలు అవసరం లేదు. అవి సినిమా వేగాన్ని తగ్గించే స్పీడ్ బ్రేకర్స్ లా అనిపిస్తాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల ఎంటర్టైన్మెంట్ ఇందులో అస్సలు ఉండదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ది బెస్ట్ అనిపించుకున్న వారు ఎవరూ లేరు.. ఒక పర్వాలేదనిపించుకున్నవారు మాత్రం ఉన్నారు. ప్రసాద్ బాబు సినిమాటోగ్రఫీ బాగుంది. ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ని మరియు సుహాసిని ఇంట్లో వచ్చే సీన్స్ ని బాగా చూపించాడు. రాజేష్ రామ్ నాథ్ అందించిన పాటలు అంతగా మెప్పించలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం పరవాలేదనిపిస్తుంది. కొన్ని చోట్ల అప్పుడెప్పుడో ఇళయరాజా గారు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లా అనిపిస్తుంది. శివ ఎడిటింగ్ బాలేదు. చాలా బోరింగ్ సీన్స్ ఉన్నాయి. అవన్నీ కట్ చేస్తే సినిమాకి ఇంకాస్త హెల్ప్ అయ్యి ఉండేది. డబ్బింగ్ కోసం రాసిన డైలాగ్స్ జస్ట్ ఓకే, కానీ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ కోసం రాసిన రన్నింగ్ కామెంట్రీ డైలాగ్స్ మాత్రం అస్సలు బాలేవు(అవి విన్నారంటే మీకొచ్చిన క్రికెట్ మర్చిపోతారు).

ఇక కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం ఈ మూడు విభాగాలు డీల్ చేసింది ఎస్. మోహన్. మోహన్ ఎంచుకున్న పాయింట్ బాగుంది, కాని దానిని ఆధ్యంతం ఆకట్టుకునే కథలా రాసుకోలేకపోయాడు. స్క్రీన్ ప్లే – అస్సలు బాలేదు. 10 నిమిషాల తర్వాత సీన్ టు సీన్ మీరేమనుకుంటే అదే జరుగుతుంది. దర్శకత్వం కూడా బాలేదు. నటీనటుల పెర్ఫార్మన్స్ బాగున్నా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. తానికొండ వెంకటేశ్వర్లు నిర్మాణ విలువలు జస్ట్ ఓకే.

తీర్పు :
కన్నడ నుంచి తెలుగులోకి వచ్చిన అనువాద చిత్రం ‘సచిన్.. టెండూల్కర్ కాదు’ అనేది ప్రత్యేకంగా బాలల కోసం రూపొందించిన చిత్రం. అలాగే ఇందులో పెద్దలు తెలుసుకోవాల్సిన ఎన్నో మానవతా విలువలు కూడా ఉన్నాయి. పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు అలాంటి పిల్లలు మానసిక వైకల్యంతో పుడితే వారిని సమాజం నుండి వెలివేయకండి వారిని కూడా మనలో ఒకరిగా కలుపుకోవాలని ఇచ్చిన మెసేజ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. అలాగే సుహాసిని, వెంకటేష్ ప్రసాద్ లు కూడా ఈ సినిమా కంటెంట్ కి బాగా హెల్ప్ అయ్యారు. అనుకున్న అకాన్సేప్ట్ ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చెప్పలేకపోవడం, రెగ్యులర్ కమర్షియల్ సినిమాల ఎంటర్టైన్మెంట్ ఇందులో లేకపోవడం ఈ సినిమాకి మైనస్. ఓవరాల్ గా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు నచ్చే వారికి, పిల్లలకి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు