సమీక్ష : స‌మ్మోహ‌నం – ఫన్, ఎమోషన్ల సమ్మేళనం

సమీక్ష : స‌మ్మోహ‌నం – ఫన్, ఎమోషన్ల సమ్మేళనం

Published on Jun 16, 2018 12:01 PM IST
 Sammohanam movie review

విడుదల తేదీ : జూన్ 15, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : సుధీర్ బాబు, అదితి రావ్ హైదరి

దర్శకత్వం : మోహన్ కృష్ణ ఇంద్రగంటి

నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్

సంగీతం : వివేక్ సాగర్

సినిమాటోగ్రఫర్ : పి.జి.విందా

ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

స్క్రీన్ ప్లే : మోహన్ కృష్ణ ఇంద్రగంటి

దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సమ్మోహనం’. సుధీర్ బాబు, అదితి రావ్ హైదరిలు జంటగా నటించిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ:

చిన్నపిల్లల కథలకు సంబంధించి బొమ్మలు గీసే విజయ్ (సుధీర్ బాబు)కు మొదటి నుండి సినిమాలన్నా, సినిమా వాళ్ళన్నా పెద్దగా ఆసక్తి ఉండదు. సినిమాలంటే తెగ ఇష్టపడే వాళ్ళ నాన్నతో కూడ ఎప్పుడూ విభేదిస్తూనే ఉంటాడు. అలాంటి విజయ్ జీవితంలోకి సమీరా (అదితి రావ్ హైదరి) అనే స్టార్ హీరోయిన్ ప్రవేశిస్తుంది.

విజయ్ ఆమెను ప్రేమిస్తాడు. కానీ వాళ్ళ ప్రేమకు మొదట్లోనే అడ్డంకులు ఏర్పడతాయి. విజయ్ సమీరా నుండి దూరంగా వెళ్ళిపోతాడు ఒకానొక దశలో ఆమెను ద్వేషిస్తాడు. అలా దూరమైన ఆ ఇద్దరూ మళ్ళీ ఎలా కలుసుకున్నారు, మొదట్లో ఎందుకు విడిపోయారు, పెద్ద స్టార్ అయిన సమీరా జీవితం ఎలాంటిది అనేదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి రాసుకున్న సున్నితమైన కథే ఈ సినిమాకు ప్రధాన బలం. బలమైన పాత్రలతో, సన్నివేశాలతో, భావోద్వేగాలతో నిండిన ఈ కథ ప్రేక్షకుడ్ని సినిమాతో పాటే ప్రయాణించేలా చేసింది. ఇంద్రగంటి టేకింగ్ సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని అందించడంతో కథ మన చుట్టూ జరుగుతున్నట్లే అనిపిస్తుంది. కథనంలో ఫ్లో తగ్గుతుంది అనుకునే సమయానికి ఒక ఎమోషనల్ సీన్ లేదా ఫన్ సీన్ వస్తూ సినిమాను గాడిలో పెడుతుంటాయి. నిజ జీవితంలో స్టార్స్ ఎలా ఉంటారు, వాళ్ళ జీవితాలు ఏంటి అనే సున్నితమైన అంశాన్ని ఎంతో కన్విన్సింగా డీల్ చేశారు ఇంద్రగంటి.

ఇక హీరో తండ్రి పాత్ర సినిమాకు మరొక హైలెట్. బోలెడంత హ్యూమర్ దట్టించి ఆ పాత్రను రాశారు ఇంద్రగంటి. ఆ పాత్రపై వచ్చే ప్రతి సీన్ బాగా నవ్వించింది. పాత్ర ఒక ఎత్తైతే అందులో నరేష్ గారి నటన మరొక ఎత్తు. ప్రతి 10 నిముషాలకొకసారి కనిపించే ఆయన ఏ సందర్భంలో కూడ బోర్ కొట్టలేదు. మొదటి అర్ధభాగాన్ని సరదాగా, కొంచెం ఎమోషనల్ గా నడిపిన ఇంద్రగంటి సెకండాఫ్ లో కూడ భావోద్వేగాల్ని బాగానే పలికించారు.

ఇక హీరో సుధీర్ బాబు తన పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ కనబర్చి తనలోని నటుడ్ని చాలా వరకు బయటపెట్టి తాను కేవలం మాస్ సినిమాలకే పరిమితం కాదు ఎలాంటి కథనైనా, పాత్రలనైనా మోయగలను అని నిరూపించుకున్నారు. ఇక హీరోయిన్ అదితి రావ్ హైదరి అందంగా కనిపిస్తూ, తన ఇన్నోసెంట్ పెర్ఫార్మన్స్ తో కట్టిపడేశారు. తన పాత్ర చుట్టూ ఉన్న స్టార్ హీరోయిన్ అనే ఇమేజ్ ను చివరి వరకు అలాగే క్యారీ చేయగలిగారామె. ఆమెను చూస్తున్నంతసేపు నిజంగా ఒక స్టార్ ను చూస్తున్న ఫిలింగ్ కలిగింది.

మైనస్ పాయింట్స్ :

కథ, పాత్రల పరంగా ఎలాంటి వంకా పెట్టలేని పనితీరుని కనబర్చిన దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి కథనంలో మాత్రం కొన్ని చోట్ల నెమ్మదిగా కనిపించారు. ఫస్టాఫ్ ను అన్ని విధాలా బాగానే నడిపిన ఆయన కీలకమైన చోట్ల సన్నివేశాలను సాగదీశారు ముఖ్యంగా క్లైమాక్స్ ను అవసరం లేనంత పొడవుగా రాశారు.

సినిమా చూసేటప్పుడు హీరో హీరోయిన్ల మధ్యన ప్రేమ ఉంది, అది కొన్ని సమస్యల కారణంగా ఘర్షణలో నలిగిపోతోంది అని తెలుస్తుంటుంది కానీ ప్రేక్షకుడి మనసుని కదిలించలేకపోయింది. సినిమాలో బరువైన భావోద్వేగాల్ని పలికించే సందర్భాల్ని ఏర్పాటు చేయగల స్కోప్ ఉన్నా ఇంద్రగంటిగారు ఎందుకో వాటి జోలికి పోకుండా నరేషన్ ను కొంత తేలిగ్గానే నడిపేశారు అనే ఫీలింగ్ కలిగింది. ఇక కొన్ని సెక్షన్ల ప్రేక్షకులు విధిగా కోరుకునే మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పెద్దగా దొరకవు.

సాంకేతిక విభాగం :

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకుడిగా సినిమాకు దాదాపుగా పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దరాయన. ఫన్, ఎమోషన్ వంటి అంశాలని సమపాళ్లలో ఉంచి సగటు ప్రేక్షకుడిని అలరించే సినిమాను తయారుచేశారు. వీటన్నిటితో పాటే సన్నివేశాల సాగదీతను తగ్గించి లవ్ ట్రాక్ ను ఇంకాస్త బరువుగా రాసుకుని ఉంటే ఇంకా బాగుండేది.

సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. పాటలన్నీ బాగున్నాయి. పి.జి.విందా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సన్నివేశాలన్నీ అందంగా కనబడ్డాయి. మార్తాండ్ కె వెంకటేష్ గారి ఎడిటింగ్ బాగానే ఉంది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారు మరోసారి మంచి సినిమాను అందించి నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్నారు.

తీర్పు :

దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈసారి కూడ తనదైన శైలిలో అందమైన, ఆహ్లాదకరమైన సినిమానే అందించారు. మంచి కథ, ఆసక్తికరమైన పాత్రలు, ఫన్, ఎమోషన్లు సమపాళ్లలో ఉండటం, హీరో హీరోయిన్ల పెర్ఫార్మెన్స్ , నటుడు నరేష్ గారి నటన, మంచి సంగీతం వంటి ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ కలిగిన ఈ సినిమాలో కొద్దిగా నెమ్మదించిన ద్వితీయార్థం, లెంగ్త్ ఎక్కువైన క్లైమాక్స్, లవ్ ట్రాక్లో కొంత బరువు తగ్గడం వంటివి ప్రతికూలాంశాలుగా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. సరదాగా కుటుంబంతో కలిసి సినిమా చూడాలనుకునే వాళ్లకి ఈ సినిమా మంచి ఛాయిస్.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు