సమీక్ష : సావిత్రి – ‘సావిత్రి పెళ్ళి కథ’ ఓకే!

విడుదల తేదీ : ఏప్రిల్ 1 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : పవన్ సాదినేని

నిర్మాత : వి.బి. రాజేంద్ర ప్రసాద్

సంగీతం : శ్రవణ్

నటీనటులు : నారా రోహిత్, నందిత..

‘సావిత్రి’.. వరుస సినిమాలతో తెలుగులో ఏ హీరో కూడా లేనంత బిజీగా ఉన్న నారా రోహిత్, ‘ప్రేమ ఇష్క్ కాదల్‌’తో పరిచయమై మెప్పించిన దర్శకుడు పవన్ సాదినేనిల కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రచారం పొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

తన మేనత్త పెళ్ళి వేడుకలో పుట్టిన సావిత్రి (నందిత)కి చిన్నప్పట్నుంచే పెళ్ళి అంటే విపరీతమైన ఇష్టం. పెళ్ళి చేసుకోవాలన్నది ఆమె జీవితాశయం. తన అక్క గాయత్రి (ధన్యా బాలకృష్ణన్) పెళ్ళి అయిపోతే తానూ పెళ్ళి చేసుకోవచ్చని కలలు గనే సావిత్రి, అక్కకు ఇష్టం లేకున్నా ఆమె పెళ్ళి జరిగేందుకు తోడ్పడుతుంది. అంతగా పెళ్ళిని ఇష్టపడే సావిత్రికి ఓ మొక్కుపై షిర్డీకి వెళ్ళే క్రమంలో రైలులో రిషి (నారా రోహిత్) అనే ఓ డాక్టర్ పరిచయమవుతాడు.

వీరిద్దరూ షిర్డీకి వెళ్ళే ఈ ప్రయాణంలోనే కొన్ని అనుకోని పరిస్థితుల్లో దగ్గరవుతారు. అయితే సావిత్రి మాత్రం రిషిపై ఉన్న ప్రేమను బయటపెట్టకపోగా, తనకు పెళ్ళి ఫిక్స్ అయిపోయిందని చెప్తుంది. ఆ తర్వాత వీరి ప్రయాణం ఎటువైపు సాగింది? పెళ్ళి అంటే విపరీతమైన ఇష్టం ఉన్న సావిత్రి, రిషి ప్రేమను అర్థం చేసుకుందా? వీరిద్దరికి ఏయే పరిస్థితులు అడ్డొచ్చాయి? లాంటి ప్రశ్నలకు సమాధానమే సావిత్రి మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

‘సావిత్రి’కి మేజర్ హైలైట్ అంటే హీరోయిన్ క్యారెక్టర్‌ ఆలోచనతోనే నడిచే ప్రధాన గురించి చెప్పుకోవాలి. పెళ్ళి అంటే విపరీతమైన ఇష్టముండే ఓ కొత్తదనమున్న పాత్రకు ఓ ప్రేమకథను జోడించి చెప్పిన కథ బాగుంది. హీరోయిన్ క్యారక్టరైజేషన్‌లో మొదట్నుంచీ, చివరివరకూ వచ్చే మార్పులను చాలా బాగా చూపించారు. ఇక ఆ పాత్రలో నటించిన నందిత కూడా సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకరుగా చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్ అంతా సరదాగా కనిపిస్తూ, క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్‍లో కట్టిపడేసే నటనతో నందిత చాలా బాగా నటించింది.

నారా రోహిత్ ఎప్పట్లానే తనదైన డైలాగ్ డెలివరీతో బాగా నటించాడు. ఓవైపు కామెడీ పండిస్తూనే క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్‌తో కట్టిపడేశాడు. ఇక మురళీ శర్మ, అజయ్, ధన్యా బాలకృష్ణన్, రవిబాబు, మధు.. ఇలా నటీనటులంతా తమ పాత్ర పరిధిమేర బాగా నటించారు. సినిమా పరంగా చూస్తే, మొదటి పదిహేను నిమిషాల ఇంటడక్షన్ సీన్, ఇంటర్వెల్ ట్విస్ట్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పార్ట్‌లను మేజర్ హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే సెకండాఫ్‌లో వచ్చే ప్రధాన ట్విస్ట్ మినహాయిస్తే, ప్రీ క్లైమాక్స్ వరకూ ఆకట్టుకునే సన్నివేశాలేవీ పెద్దగా లేకపోవడం గురించి చెప్పుకోవాలి. ఈ సమయంలో సినిమా చాలా నెమ్మదిగా నడిచినట్లు కనిపించడంతో పాటు బోరింగ్‌గా కూడా తయారైంది. ఫస్టాఫ్‌లో వచ్చే పోసాని కృష్ణమురళి ట్రాక్ కొద్దిసేపు నవ్వించినట్లు కనిపించినా, ఓవరాల్‌గా చూస్తే అర్థం పర్థం లేని ట్రాక్‌గా కనిపిస్తుంది. రవిబాబు ట్రాక్ కూడా అర్థం లేనిదిగానే కనిపిస్తుంది. ఇక కమర్షియాలిటీకి పోయి ఇంట్రడక్షన్ సాంగ్, కొన్ని అనవసరమైన లెంగ్తీ ఫైట్స్, అర్థం లేని కామెడీ లాంటివి సినిమా ఫ్లోను చాలాచోట్ల దెబ్బతీశాయి.

ఇక హీరో, హీరోయిన్ల ట్రాక్ కూడా కొన్నిచోట్ల క్లారిటీ లోపించింది. సత్యం రాజేష్, వెన్నెల కిషోర్ పాత్రలు తెలుగు సినిమాల్లో మాత్రమే కనిపించే కామిక్ పాత్రలుగా తయారుచేయడం పెద్దగా ఆకట్టుకోలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, మొదట దర్శకుడు పవన్ సాదినేని గురించి చెప్పుకుందాం. పవన్ ఒక కొత్త ఆలోచనతో, ఓ కమర్షియల్ కథను చెప్పడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ప్రధాన కథలో మంచి ఫన్ ఉంది. అయితే దాన్ని కమర్షియల్ అంశాలకు జోడించడంలో అక్కడక్కడా తేలిపోయాడు. దర్శకుడిగా మాత్రం చాలా చోట్ల పవన్ ప్రతిభను చూడొచ్చు. కృష్ణ చైతన్య అందించిన సంభాషణలు, పవన్ నెరేషన్‌కు ప్రధాన బలంగా నిలిచాయని చెప్పుకోవచ్చు. ఈ స్థాయిలో డైలాగ్స్ లేకపోయి ఉంటే సినిమా నీరసంగా కనిపించేది.

ఏ. వసంత్ అందించిన సినిమాటోగ్రఫీ కథ మూడ్‌కి తగ్గట్టుగా చాలా బాగుంది. ముఖ్యంగా మొదటి ఇరవై నిమిషాలు, చివరి ఇరవై నిమిషాల్లో గ్రామీణ నేపథ్యానికి, పెళ్ళి కళను కలపడమనే తెలుగు సినిమాకు మాత్రమే పరిచయమైన అందాన్ని కెమెరాలో బాగా బంధించారు. శ్రవణ్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. ఒకట్రెండు పాటలు రొటీన్ అనిపించినా, మిగతావి బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ బాగానే ఉంది. సెకండాఫ్‌లో కథ మరింత వేగంగా నడవాల్సింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్, ఆర్ట్ వర్క్ బాగున్నాయి.

తీర్పు :

తెలుగు సినిమాకు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటే ఒక ఫార్ములా ఉంది. సావిత్రి కూడా ఆ ఫార్ములాను నమ్మిన సినిమాయే! అయితే ఇందులో కొత్తదనం ఏంటంటే హీరోయిన్ పాత్రకుండే ఓ విచిత్రమైన ఆలోచనా విధానంతో ఆ కథ చెప్పడం. ఈ విషయాన్నే మేజర్ హైలైట్‌గా చేసుకున్న ఈ సినిమాలో నటీనటుల ప్రతిభ, క్లైమాక్స్‌లో వచ్చే మంచి ఎమోషనల్ సీన్ హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు. ఇకపోతే సెకండాఫ్‌లో కథ వేగం నెమ్మదించడం, ఈ సమయంలో వచ్చే కొన్ని బోరింగ్ ట్రాక్స్, అనవసర ఫైట్స్, సన్నివేశాలను మైనస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఫార్ములా సినిమానే అయినా ‘సావిత్రి పెళ్ళి పిచ్చి’ అన్న కొత్తదనమున్న ఆలోచన కోసం ఈ సినిమాను ఓ సారి చూడొచ్చు.

123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :

More