సమీక్ష : గృహం – భయపడటం ఖాయం

Gruham movie review

విడుదల తేదీ : నవంబర్ 17, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : మిలింద్ రావ్

నిర్మాత : ఈటాకీ ఎంటర్టైన్మెంట్స్

సంగీతం : గిరీష్.జి

నటీనటులు : సిద్దార్థ్, ఆండ్రియా, అనీషా ఏంజెలిన

హీరో సిద్దార్థ్ నటించిన తాజా చిత్రం ‘అవల్’ తెలుగులో ‘గృహం’ పేరుతో ఈరోజే విడుదలైంది. తమిళనాట మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా మరి తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేరకు బయపెట్టిందో చూద్దాం..

కథ :

డాక్టర్ క్రిష్ (సిద్దార్థ్) తన భార్య లక్ష్మి (ఆండ్రియా)తో కలిసి హిమాచల్ ప్రదేశ్ లో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అదే సమయంలో వాళ్ళ పాక్కింట్లోకి ఒక ఫ్యామిలీ వచ్చి చేరుతుంది. అలా వాళ్ళు చేరిన కొన్ని రోజులకే ఆ ఇంట్లో విచిత్రకరమైన సంఘటనలు జరుగుతుంటాయి.

ఆ ఇంట్లోని అమ్మాయి జెన్నీ (అనీషా ఏంజెలిన)ని ఒక దెయ్యం ఆవహిస్తుంది. ఆ దెయ్యం ఎవరు, దాని కథేమిటి, అది జెన్నీనే ఎందుకు ఆవహించింది, దాని బారి నుండి ఆ కుటుంబం ఎలా బయటపడింది ? అనేదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని ప్రధాన ప్లస్ పాయింట్ అంటే హర్రర్ కంటెంట్. ప్రతి 10 నిముషాలకు ఒక హర్రర్ మూమెంట్ వస్తూ భయపెడుతుంది. దానికి తోడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హడలెత్తించే విధంగా ఉండటంతో హార్రర్ సన్నివేశాలు మరింతగా ప్రభావం చూపాయి. దర్శకుడు మిలింద్ రావ్ ఒక భయపెట్టే హర్రర్ సినిమాను మాత్రమే చేయాలనే గట్టి నిర్ణయంతో తీసిన ఈ సినిమాలో కేవలం హర్రర్ తప్ప ప్రేక్షకుడ్ని పక్కదారి పట్టింటే కామెడీ, లవ్, సెంటిమెంట్ ట్రాక్స్ వంటివి ఏమీ ఉండవు. దాంతో ఒక దెయ్యపు సినిమాని పరిపూర్ణంగా ఎంజాయ్ చేసే అవకాశం దొరికింది.

పైగా తెలుగులో ఇప్పటి దాకా హర్రర్ కు కామెడీని జోడించి తీసిన సినిమాలే వస్తూ వచ్చాయి కాబట్టి ఈ సినిమా ప్రేక్షకులకి మంచి చేంజ్ అని చెప్పోచ్చు. ఇక హాలీవుడ్ హర్రర్ సినిమాల్లో కనిపించే డార్క్ కాన్వాస్ ఈ సినిమా కనిపిస్తుంది. దాంతో సినిమా నడుస్తున్నంతసేపు హర్రర్ మూడ్ క్యారీ అయింది. గిరీష్.జి చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకున్న ప్రధాన బలాల్లో ఒకటి.

ఇక జెన్నీ పాత్రలో నటించిన అనీషా ఏంజెలిన మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చి ఆకట్టుకుంది. ఫస్టాఫ్ అంతా హర్రర్ మూమెంట్స్ తో నడిపి ఇంటర్వెల్ సమయంలో భయానకమైన సన్నివేశంతో మెప్పించిన దర్శకుడు క్లైమాక్స్ లో మంచి ట్విస్ట్ తో పాటు హర్రర్ సీక్వెన్స్ ను పెట్టి ఆకట్టుకున్నాడు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలోని లోపమంటే కథ రొటీన్ గాన్ ఉండటం. ఒక ఇంట్లో ఒక కుటుంబం, వాళ్ళు అనివార్య కారణాల వలన చనిపోయి ఆత్మలుగా మారి కొన్నేళ్ల తర్వాత ఆ ఇంట్లోకి వచ్చిన కొత్త వాళ్ళని కష్టపెడుతుంటారు. ఆ ఇంట్లోని వాళ్ళు చివరికి ఎలాగోలా ఆ దెయ్యాల బారి నుండి బయటపడటం. ఇది చాలా సినిమాల్లో వాడిన కథాంశమే కాబట్టి క్లైమాక్స్ లోని ట్విస్ట్ మినహా ఆరంభం నుండి చివరి వరకు ఎక్కడ ఏం జరుగుతుందో సులభంగానే ఊహించవచ్చు. దీంతో భయపడినా థ్రిల్ ఫీలయ్యే ఛాన్స్ దొరకలేదు.

అలాగే కొన్ని సన్నివేశాలు, పాత్రలు పాత హాలీవుడ్ సినిమాల్లో చూసినట్టుగానే ఉంటాయి. వాటి ప్రవర్తన, సన్నివేశాలు నడిచే తీరు కాపీ కొట్టినట్టే ఉంది. అలాగే చివర్లో వచ్చే కీలకమైన ట్విస్ట్ బాగున్నా దాన్ని అందించడానికి తగిన కారణాలేవీ ఆ ముందు స్క్రీన్ ప్లేలో కనబడవు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు మిలింద్ రావ్ హర్రర్ సినిమాను ఎలా చూపించాలో అలాగే చూపించారు. ఎక్కడా అనవసరమైన పాత్రలు, కామెడీ అంటూ పక్కదారి పట్టకుండా నేరుగా హర్రర్ పాయింట్ మీదే భయపెట్టే సన్నివేశాలతో సినిమాను నడిపి ఆకట్టుకున్నాడు. కానీ కథ విషయంలో ఆయన ఇంకాస్త కొత్తదనం పాటించి ఉండే బాగుండేది.

గిరీష్.జి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. హర్రర్ సన్నివేశాల్లో మంచి ప్రభావం చూపింది. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హర్రర్ సినిమాకు కావల్సిన హర్రర్ మూడ్ ను సినిమా మొత్తం క్యారీ చేసేలా కెమెరా వర్క్ చేశారాయన. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

తీర్పు :

సిద్దార్థ్ నటించిన ఈ ‘గృహం’ సినిమా చాలా రోజుల తర్వాత ఒక పూర్తిస్థాయి హర్రర్ సినిమాను చూసిన అనుభూతిని కలిగించింది. సినిమా మొత్తాన్ని దర్శకుడు హర్రర్ అనే ఒకే ఒక్క ఎజెండాతో నడపడం, భయపడే మూమెంట్స్ దండిగా ఉండటం, సౌండ్, కెమెరా వర్క్ ఎఫెక్టివ్ గా ఉండటం, నటీ నటుల పెర్ఫార్మెన్స్ బాగుండటం ఇందులో మెప్పించే అంశాలు కాగా కొద్దిగా రొటీన్ గా తోచే కథ, ఊహించదగిన కొన్ని సన్నివేశాలు కొంత నిరుత్సాహపరిచే విషయాలు. మొత్తం మీద ఈ చిత్రం స్వచ్ఛమైన హర్రర్ జానర్ సినిమాల్ని ఇష్టపడేవారికి తప్పక నచ్చుతుంది.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :