సమీక్ష : S/O సత్యమూర్తి – విలువలే ఆస్తని చెప్పే కుటుంబ కథా చిత్రమ్.!

Son of Satyamurthy

విడుదల తేదీ : 09 ఏప్రిల్ 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్

నిర్మాత : ఎస్. రాధాకృష్ణ

సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్

నటీనటులు : అల్లు అర్జున్, సమంత, నిత్యా మీనన్, ఆద శర్మ, ఉపేంద్ర…

తన స్టైల్, డాన్సులతో ప్రేక్షకులను మెప్పించే స్టైలిష్ స్టార్ – మాటలతో మేజిక్ చేసే త్రివిక్రమ్ శ్రీనివాస్ – యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా ‘S/O సత్యమూర్తి’. ‘జులాయి’ లాంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత వీరి ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘S/O సత్యమూర్తి’ భారీ అంచనాల నడుమ ఈ రోజు విడుదలైంది. ‘అత్తారింటకి దారేది’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ మరియు ‘రేసు గుర్రం’తో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ లు కలిసి ఈ సారి అభిమానుల అంచనాలను అందుకొని హిట్ అందుకున్నారా.? లేదా.? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :

సత్యమూర్తి(ప్రకాష్ రాజ్) ఇండియాలో ఓ పెద్ద బిజినెస్ మెన్. 300 కోట్లకి ఆస్తి పరుడు. కానీ డబ్బు కంటే విలువలనే ఆస్తిగా ప్రేమించే వ్యక్తి.. అలాంటి వ్యక్తి చనిపోవడంతో ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుంది. అప్పటి వరకూ జాలీగా జీవితాన్ని గడిపే సత్యమూర్తి కుమారుడు విరాజ్ ఆనంద్(అల్లు అర్జున్) ఆ ఇబ్బందులన్నీ క్లియర్ చేయడం కోసం ఉన్న ఆస్తినంతా ఇచ్చేసి ఓ వెడ్డింగ్ ప్లానర్ గా మారతాడు. అందులో మొదటగా పల్లవి (ఆద శర్మ)కి పెళ్లి చేస్తాడు. ఇదే టైంలో విరాజ్ ఆనంద్ సుబ్బలక్ష్మీ అలియాస్ సమీర(సమంత)ని చూసి ప్రేమలో పడతాడు. సమీర ఫాదర్ అయిన సాంబశివరావు(రాజేంద్ర ప్రసాద్)కి ముందు నుంచి విరాజ్ ఆనంద్ అంటే పడదు. అందుకే తన ప్రేమ పెళ్ళిగా మారాలంటే వాళ్ళ నాన్న చేసిన మోసాన్ని తనే సరిదిద్దాలని ఓ సమస్యని ముందు పెడతాడు. ఆ సమస్య పేరు దేవరాజ్ నాయుడు (ఉపేంద్ర).

తన ప్రేమ కోసం విరాజ్ ఆనంద్ దేవరాజ్ నాయుడుని వెతుక్కుంటూ రాయలసీమ – తమిళనాడు బార్డర్ కి వెళ్తాడు. అక్కడ మన విరాజ్ ఆనంద్ చేసిన ఓ మిస్టేక్ వల్ల ఉపేంద్ర దగ్గర ఇరుక్కుంటాడు. ఓ రోజు శత్రువులు దేవరాజ్ ని చంపబోతుంటే విరాజ్ ఆనంద్ కాపాడతాడు. అది చూసిన దేవరాజ్ విరాజ్ ఆనంద్ కి తన చెల్లెలు వళ్ళిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. తన పెళ్లి కోసం వచ్చి వేరే పెళ్లి చేసుకోవాల్సి రావడంతో విరాజ్ ఆనంద్ పెద్ద సంకటంలో పడతాడు. ఒక సమస్యను పరిష్కరించడానికి వచ్చి ఇంకో సమస్యలో ఇరుక్కున్న విరాజ్ ఆనంద్ ఎలా బయట పడ్డాడు.? చివరికి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు.? రాయలసీమ ఫ్యాక్షనిస్టు అయిన ఉపేంద్ర నుండి విరాజ్ ఆనంద్ ఎలా తప్పించుకొని తను అనుకున్నది నేరవేర్చగలిగాడు.? అసలు విరాజ్ ఆనంద్ కి సాంబశివరావు ఇచ్చిన టార్గెట్ ఏమిటనేది.? మీరు వెండితెరపై చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

‘S/O సత్యమూర్తి’ ఫస్ట్ ప్లస్ పాయింట్ ట్యాగ్ లైన్ ‘విలువలే ఆస్తి’.. ఆ ట్యాగ్ లైన్ లోని భావాన్ని ప్రతిబింబించేలా త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను చెప్పడం ఫ్యామిలీ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో త్రివిక్రమ్ నాన్న యొక్క ప్రాముఖ్యతని చెప్పిన విధానం ఎంతో అభినందనీయం, నేటి తరానికి ఎంతో అవసరం కూడా. త్రివిక్రమ్ మానవ సంబంద బాంధవ్యాల మీద రాసిన మీనింగ్ ఫుల్ డైలాగ్స్ సినిమాకి పెద్ద హైలైట్ అయ్యాయి.

ఇక చెప్పాల్సింది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి.. ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించడం బన్ని స్పెషాలిటీ.. అదే స్పెషాలిటీని ఈ సినిమా లోనూ కంటిన్యూ చేసి యువతని ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఎప్పటిలానే డాన్సులు, ఫైట్స్, డైలాగ్ డెలివరీ ఇలా అన్నీ బాగా చేసాడు.. ఈ సినిమాలో బన్ని ప్రత్యేకంగా చేసింది ఏమిటీ అంటే.. ఎక్కువ ఎమోషనల్, సెంటిమెంట్ టచ్ ఉన్న పాత్ర ఇందులో చేసాడు. బన్ని ప్రతి ఎమోషన్ ని చాలా సెటిల్ గా చేసి, చూసే ప్రతి ఆడియన్ తనే విరాజ్ ఆనంద్ అని ఫీలయ్యేలా చేసాడు. ఇక ఈ సినిమాకి గ్లామర్ అట్రాక్షన్ ముగ్గురు భామలు.. సమంత – ఆన్ స్క్రీన్ స్టైలిష్ అండ్ గ్లామరస్ గా కనిపిస్తూ రొమాంటిక్ సన్నివేశాల్లో కుర్రకారుని ఆకర్షించింది. పాత్ర పరంగా చెప్పుకునేంత లేకపోయినా ఉన్నంతలో తన పాత్రకి న్యాయం చేసి వెళ్ళిపోయింది. నిత్యా మీనన్ – నిత్య మీనన్ చేసింది చాలా చిన్న పాత్రే కానీ సినిమాకి మాత్రం చాలా ముఖ్యమైన పాత్ర, ఆ పాత్రని ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. కొన్ని సీన్స్ లో అల్లు అర్జున్ కి ఈక్వల్ గా తన ఎనర్జీ లెవల్స్ చూపించింది. ఇక ఆద శర్మ – ఆద శర్మ బబ్లీ అండ్ క్యూట్ గర్ల్ గా అలా కనిపించి ఇలా వెళ్ళిపోతుంది. అల్లు అర్జున్ – సమంత – నిత్యా మీనన్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఆడియన్స్ ని బాగా నవ్విస్తాయి.

కన్నడ స్టార్ ఉపేంద్ర నెగటివ్ షేడ్స్ లో రాయలసీమ యాసలో అదరగొట్టాడు. పాత్ర లెంగ్త్ ఎక్కువ లేకపోయినా ఉన్నంతలో ది బెస్ట్ ఇచ్చాడు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తన స్టైల్ సెటైర్స్ తో ఆకట్టుకున్నాడు. సంపత్ రాజ్ చేసింది చాలా చిన్న పాత్ర కానీ సినిమాని మలుపు తిప్పే పాత్రలో బెస్ట్ నటనని కనబరిచి వెళ్ళిపోయాడు. ఇక అలీ అక్కడక్కడా నవ్వించగా, బ్రహ్మానందం ఎపిసోడ్ మాత్రం ఆడియన్స్ ని బాగా నవ్విస్తుంది. వెన్నెల కిషోర్, స్నేహ, ప్రకాష్ రాజ్, పవిత్ర లోకేష్, సింధు తులానీలు తమ పాత్రలకు న్యాయం చేసారు. ఇక సినిమా పరంగా చూసుకుంటే.. సెకండాఫ్ లో కామెడీని బాగా పండించడమే కాకుండా ఎమోషనల్ సీన్స్ ని కూడా బాగా చెప్పాడు. పాటల్లో విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

‘S/O సత్యమూర్తి’ సినిమాకి మొదటి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఫస్ట్ హాఫ్.. కథ మొదలైన మొదటి 10 నిమిషాలు చాలా ఫాస్ట్ గా వెళ్తుంది.. అక్కడి నుంచి కథ అస్సలు ముందుకు వెళ్ళదు. ఇంటర్వల్ తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఈ మధ్యలో చాలా బోరింగ్ గా ఉంటూ చాలా నెమ్మదిగా కథనం ముందుకు వెళ్తుంది. ఇంటర్వల్ బ్లాక్ లో అందరూ ఏదో ఒక హై రేంజ్ ఎలిమెంట్ ని కోరుకుంటారు, అలా కాకుండా చాలా చప్పగా ఇంటర్వల్ ఇవ్వడం ఆడియన్స్ ని పెద్దగా మెప్పించలేదు.

దీని తర్వాత సినిమాకి మరో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్.. ఎంటర్టైన్మెంట్.. త్రివిక్రమ్ సినిమా అంటే అందులో ఏమున్నా లేకపోయినా పొట్ట చెక్కలయ్యే కామెడీ, క్యాచ్ చేయలేనన్ని పంచ్ డైలాగ్స్ వస్తుంటాయి. కానీ ఇందులో కామెడీ లెవల్స్ చాలా చాలా తక్కువ, అలానే ప్రేక్షకుల నోళ్ళలో పడే పడే వచ్చే పంచ్ డైలాగ్స్ కూడా లేవు. చెప్పాలంటే చాలా సీన్స్ మరియు డైలాగ్స్ లో త్రివిక్రమ్ మార్క్ మిస్ అవుతుంది. అలాగే ఈ సినిమాకి రన్ టైం కూడా ఓ మైనస్.

ఇక ఈ సినిమాలో తను చెప్పాలనుకున్నది తల్లి తండ్రుల నుంచి వచ్చే విలువలే ఆస్తి అన్న పాయింట్ చెప్పాలనుకున్నాడు.. దాన్ని ఒక బలమైన సందర్భంలో సూటిగా చెప్తే సరిపొయ్యేది. కానీ మొదటి నుంచి అదే పాయింట్ ని పలు సందర్భాల్లో ప్రూవ్ చెయ్యాలని చూడడం తప్ప పెద్ద కథంటూ ఏమీ లేదు. ఈ పాయింట్ ని కన్విన్సింగ్ గా చెప్పడం కోసం కొన్ని సన్నివేశాలను బలంగా రాసుకున్నాడు, కానీ అంత బలంగా కథని రాసుకోలేకపోయాడు. కథ సరిగా లేకపోవడంతో కథనం తేలిపోయింది. దాంతో సినిమా అక్కడక్కడా బాగున్నా అక్కడక్కడా బోర్ కొడుతుంది. అలాగే కథలో పెద్ద ప్రాముఖ్యత లేకున్నా చాలా మంది సీనియర్ ఆరిస్ట్ లు ఎక్కువవవ్వడం కూడా ఓ మైనస్.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ది బెస్ట్ అనిపించుకున్నవి చాలానే ఉన్నాయి.. ముందుగా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ఇంత క్లాస్ గా చూపించిన సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ళకి హ్యాట్సాఫ్ చెప్పాలి. ప్రతి లొకేషన్ ని తను చూపిన విధానం, నటీనటుల హావ భావాలను పర్ఫెక్ట్ గా కాప్చ్యూర్ చెయ్యడం, అలాగే ప్రతి ఫ్రేంని ఎంతో కలర్ఫుల్ గా చూపడం తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. ముఖ్యంగా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా ఏ ఒక్కరినీ తక్కువ కాకుండా, ఏ ఇద్దరినీ ఒకేలా ఉండకుండా చాలా బాగా చూపించాడు. తరువాత దేవీశ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ జస్ట్ హిట్ అయితే, ఆన్ స్క్రీన్ విజువల్స్ పరంగా సూపర్ హిట్ అయ్యాయి. ఇక దేవీశ్రీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి బాగా సెట్ అయ్యింది. క్లైమాక్స్ సీన్స్ లో రీ రికార్డింగ్ చాలా బాగుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. చాలా చోట్ల డ్రాగ్ అనిపించిన సీన్స్ ని కట్ చేసి ఉంటే బాగుండేది.

రవీందర్ ఆర్ట్ వర్క్ బాగుంది. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. ఇక కథ – కథనం – మాటలు – దర్శకత్వం డీల్ చేసింది త్రివిక్రమ్. కథ – త్రివిక్రమ్ మనకు మంచి కుటుంబ విలువలున్న సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతో ఓ బలమైన పాయింట్ ని ఎంచుకున్నాడు, కానీ కథని అంత స్ట్రాంగ్ గా రాసుకోలేదు. కథనం – మొదటి నుంచి స్లోగా సాగే కథనం చాలా చోట్ల బోరింగ్ అనిపిస్తుంది..అలాగే ఆడియన్స్ కి థ్రిల్లింగ్ గా అనిపించే అంశాలు ఏమీ లేవు. త్రివిక్రమ్ బ్రాండ్ మార్క్ అయిన కంటిన్యూ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వడం ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మాటలు – ఎమోషనల్ సీన్స్ లో చూసే ప్రతి ఒక్కరినీ ఆలోజింపజేసేలా డైలాగ్స్ రాసుకున్నాడు, కానీ పంచ్ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చెయ్యడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. కొంతమంది త్రివిక్రమ్ పంచ్ పవర్, కలం పవర్ తగ్గిందా అనే భావాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. దర్శకత్వం – బాగుంది. కానీ పూర్తిగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యలేకపోయాడు. ఓవరాల్ గా ఇలాంటి పాయింట్ చెప్పినందుకు త్రివిక్రమ్ ని అభినందించాలి. నిర్మాత ఎస్ రాధాకృష్ణ పెట్టిన ప్రతి రూపాయి చాలా గ్రాండ్ గా స్క్రీన్ పై కనిపిస్తుంది.

తీర్పు :

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘S/O సత్యమూర్తి’ ఈ వేడి వేడి వేసవిలో వచ్చిన ఓ చల్లని ఫ్యామిలీ ఎంటర్టైనర్. యువత మెచ్చే కొన్ని అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే అంశం ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తుంది. అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్, ముగ్గురు భామల(సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్) గ్లామరస్ ట్రీట్ స్పెషల్ అట్రాక్షన్ మరియు సూపర్బ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్, ఎంటర్టైన్మెంట్ లేకపోవడం, బోరింగ్ కథనం, స్ట్రాంగ్ కథ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సమ్మర్లో వచ్చిన కూల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘S/O సత్యమూర్తి’.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఏసిలో కూర్చొని చూడదగిన సినిమా ‘S/O సత్యమూర్తి’..

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

 
Like us on Facebook