సమీక్ష : తేజ్ ఐ లవ్ యు – స్లోగా ఉండే రొటీన్ ప్రేమ కథ

సమీక్ష : తేజ్ ఐ లవ్ యు – స్లోగా ఉండే రొటీన్ ప్రేమ కథ

Published on Jul 7, 2018 11:10 AM IST
Tej I Love You movie review

విడుదల తేదీ : జులై 06, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌

దర్శకత్వం : ఎ.కరుణాకరన్‌

నిర్మాత : కె.ఎస్‌.రామారావు

సంగీతం : గోపీ సుందర్‌

సినిమాటోగ్రఫర్ : అండ్రూ.ఐ

ఎడిటర్ : ఎస్‌.ఆర్‌.శేఖర్‌

స్క్రీన్ ప్లే : ఎ.కరుణాకరన్‌

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై ఏ.కరుణాకరన్‌ దర్శకత్వంలో కె.ఎస్‌.రామారావు నిర్మంచిన చిత్రం ‘తేజ్‌’. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ఈ రోజే విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ:

తేజ్ (సాయిధ‌ర‌మ్‌ తేజ్‌) ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీలోని అబ్బాయి. కొన్ని కారణాల వల్ల అత‌ని పెద‌నాన్న తేజ్ ను కుటుంబం నుంచి వెలివేస్తాడు. దాంతో హైద‌రాబాద్‌ లోని తన బాబాయ్ (పృథ్వి) ఇంటికి వచ్చి తన ప్రెండ్స్ తో క‌లిసి మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఆ క్రమంలో నందిని (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్‌) చూసి ఇష్టపడతాడు. కానీ ఓ కారణంగా 15 రోజులు అగ్రిమెంట్ వల్ల ఆమె బాయ్ ఫ్రెండ్‌ గా ఆమె చెప్పిందల్లా చేయటానికి ఒప్పుకుంటాడు. మధ్య మధ్యలో న‌ందినిని మాత్రం ఎవరో ఫాలో చేస్తుంటారు. ఈ లోపు తేజు నందినితో ప్రేమలో పడి ఇద్దరు ఒక్కటయ్యే క్ర‌మంలో నందినికి యాక్సిడెంట్ అవ్వటం ఆమె గతంతో పాటు తేజుని కూడా మర్చిపోవటం జరుగుతుంది. తిరిగి నందినికి గతం గుర్తుకు వస్తుందా ? తన ప్రేమను బతికించుకోవడానికి తేజ్ ఏం చేశాడు ? అసలు న‌ందినిని ఫాలో చేస్తున్న వాళ్ళు ఎవ‌రు? చివరకి తేజ్ నందిని ఒకటయ్యారా ?.
లాంటి విష‌యాలు తెలుసుకోవాలంటే ‘తేజ్‌’. ఐ లవ్‌ యు చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

హీరో సాయి ధరమ్ తేజ్ ఎప్పటి లాగే తన ఎనర్జిటిక్ పెర్‌ఫార్మెన్స్ ఆకట్టుకున్నాడు. అతని లుక్స్ కూడా బాగున్నాయి. ఇక హీరోయిన్ గా చేసిన అనుపమ పరమేశ్వరన్‌ కూడా ప్రతి ఫ్రేమ్ లోను అందంగా కనిపిస్తూ అలరించింది.

ముఖ్యంగా హీరోని టార్చర్ చేసే సన్నివేశాల్లో తన క్యూట్ హావా భావాలతో ఆమె ఆకట్టుకుంటుంది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. హీరోకి పెద్దమ్మగా చేసిన పవిత్రా లోకేశ్‌ పాత్ర బాగుంది.

మొదటి అర్ధభాగం కొంత సరదాగా నడవడానికి హీరోకి ఫ్రెండ్ గా చేసిన వైవా హర్ష సినిమాకి బాగానే ఉపయోగ పడ్డాడు. సినిమా బోర్ కొడుతుందన్నప్పుడల్లా హార్ష తన కామెడీ టైమింగ్ తో కొంత వరికి రిలీఫ్ ఇవ్వగలిగాడు. సాయి ధరమ్ తేజ్ తన ఈజ్ తో సినిమాని నిలపెట్టడానికి ఎంత ప్రయత్నించిన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

మైనస్ పాయింట్స్ :

గతం మర్చిపోయిన ప్రియురాలు తన ప్రియుడుని మళ్ళీ ఎలా కలుసుకుంది లాంటి మంచి పాయింట్ ఉన్నా, దర్శకుడు కరుణాకరన్‌ సరిగ్గా ఆ పాయింట్ ను వాడుకోలేకపోయాడు. కొంతవరకు ఆయన చెప్పాలనుకున్న ప్రేమకథ బాగున్నా దాన్ని స్క్రీన్ మీద ప్రేక్షకుడ్ని పూర్తిస్థాయిలో సంతృప్తిపరిచే విధంగా తెరకెక్కించలేకపోయారు. మొదటి అర్ధభాగాన్ని పాత్రలను, వాటి స్వభావాల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, హీరోహీరోయిన్లు కలుసుకోవటానికే ఖర్చు పెట్టేసిన దర్శకుడు సన్నివేశాల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు.

ఈ ప్రేమ కథలో హీరో హీరోయిన్ల మధ్యన బలమైన ప్రేమ ఉన్నా, ప్రేక్షకుడి మనసుకు మాత్రం అంత బలంగా ఆ ప్రేమ తాకలేకపోయింది. గతం మర్చిపోయే హీరోయిన్ పాత్ర వల్ల కథకు కావాల్సినంత కాన్ ఫిల్ట్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బలంగా సీన్లు మాత్రం ఉండవు. హీరో పాత్రను కూడా ఫేక్ ఎమోషన్ తో నింపేసి దర్శకుడు కథను బాగా సాగతీశాడు. ఇక ముగింపు సన్నివేశాలు కూడా సహజత్వానికి దూరంగా చాలా నాటకీయంగా రొటీన్ గా అనిపిస్తాయి.
ప్రతి సన్నివేశం నామమాత్రంగానే ఉంది. ఆరంభం నుండి చివరి వరకు కథనం నిదానంగానే సాగింది తప్ప వేగం అందుకోలేదు. పైగా అక్కడక్కడ కన్విన్సింగ్ గా లేని సన్నివేశాలతో లాజిక్ మిస్ అయిన క్యారెక్టరైజేషన్‌లతో దర్శకుడు నిరుత్సాహ పరుస్తాడు.

సాంకేతిక విభాగం :

సినిమాలో మంచి బరువైన భావోద్వేగాల్ని పలికించే సందర్భాలు ఉన్నప్పటికీ, ముందు చెప్పుకున్నట్లు దర్శకుడు ఎ.కరుణాకరన్‌ ఆ అవకాశాన్ని పూర్తిగా వదిలేసుకున్నాడు. డార్లింగ్‌ స్వామి రాసిన డైలాగ్స్ గొప్పగా లేకపోయినా అక్కడక్కడ కొన్ని పేలాయి. సంగీత దర్శకుడు గోపి సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆయన క్లాసిక్ టచ్ ను గుర్తుచేవకపోయిన పర్వాలేదనిపిస్తుంది. పాట‌లు మాత్రం ఆకట్టుకోవు.

చిత్రంలోని వెంకట్ కంపోజ్ చేసిన స్టంట్స్ బాగున్నాయి. ఎస్‌.ఆర్‌.శేఖర్‌ ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. అండ్రూ.ఐ కెమెరా పనితనం చాలా బాగుంది. ఆయిన విజువల్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సాహి సురేశ్ ఆర్ట్‌ డైరెక్ష‌న్‌ మెచ్చుకునే విధంగా ఉంది. నిర్మాత కె.ఎస్‌.రామారావు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

దర్శకుడు ఎ.కరుణాకరన్‌ తన శైలిలో అందమైన, ఆహ్లాదకరమైన ప్రేమ కథను తెరకెక్కించబోయి విఫలమయ్యారు. ప్రేమ జంట మధ్య ప్రేమ రొమాన్స్ లోపించడం, వాటికి తోడు నెమ్మదిగా సాగే కథా కథనాలు, చాలా సన్నివేశాలు మరీ నాటకీయంగా ఉండటంతో ఈ సినిమా సగటు ప్రేక్షకుడ్ని కూడా ఆకట్టుకోదు. మొత్తం మీద ‘తేజ్‌’. ఐ లవ్‌ యు చిత్రం సంతృప్తి కరంగా లేదనే చెప్పాలి.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు