Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : ఉందిలే మంచికాలం ముందు ముందునా – మెసేజ్ బాగుంది, కానీ సినిమా మెప్పించలేకపోయింది.!

Undile-Manchi-Kaalam-Mundu- విడుదల తేదీ : 05 డిసెంబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకత్వం : అరుణ్ దాస్యం
నిర్మాత : ఆమ్ టీం
సంగీతం : రామ్ నారాయణ్
నటీనటులు : సుధాకర్, కార్తీక్, అవంతిక మోహన్, నీతు చౌదరి

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో నాగరాజుగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సుధాకర్ హీరోగా చేసిన సినిమా ‘ఉందిలే మంచికాలం ముందు ముందునా’. ఈ సినిమాలో సుధాకర్ తో పాటు కార్తీక్ ఓ కీలక పాత్ర పోషించగా, అవంతిక మోహన్, నీతిక చౌదరి హీరోయిన్స్ గా పరిచయం అయ్యారు. అరుణ్ దాస్యం దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..

కథ :

‘ఉందిలే మంచికాలం ముందు ముందునా’ సినిమా ఇద్దరి యువకుల చుట్టూ తిరుగుతుంది. వైజాగ్ లో నివసించే జాజ్ రాజు(సుధాకర్) – ధన(కార్తీక్) ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. జాజ్ రాజు పగటి పూట ఆటో నడుపుతూ పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు పెళ్ళిళ్ళలో బ్యాండ్ వాయిస్తూ ఉంటాడు. ఎప్పటికైనా మంచి రాక్ బ్యాండ్ ప్లేయర్ కావాలనేది జాజ్ రాజు కల.. అదే టైంలో తన చిన్ననాటి ఉజ్జు(అవంతిక మోహన్)ని చూసి రాజు ప్రేమలో పడతాడు.

ఇకపోతే ధన మంచి హాకీ ప్లేయర్.. ఎప్పటికైనా ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యి ఆడాలనేది అతని కల. దానికోసం పగలంతా ప్రాక్టీస్ చేస్తూ, రాత్రి పూట ఆటో నడుపుతూ ఉంటాడు. అంతే కాకుండా ధన పరి(నీతిక చౌదరి)తో ప్రేమలో ఉంటాడు. ఇలా ఎవరి కల కోసం వారు ప్రయత్నాలు చేస్తున్న టైంలో రాజు, ధనలకి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. తమ లక్ష్య సాధనలో రాజు, ధనలు ఎదుర్కొన్న సమస్యలేమిటి.? వారిద్దరూ కలిసి చివరికి తమ లక్ష్యాలను సాధించగలిగారా.?లేదా.? అలాగే వీరి లక్ష్యంతో పాటు వీరి ప్రేమను కూడా గెలుచుకున్నారా.? లేదా.? అన్నది వెండితెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ప్రతి మనిషికి ఓ లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్య సాధనలో ఎదురయ్యే కష్టాలను సవాల్ చేసే ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను చేరుకుంటారు అనే పాయింట్ ఈ సినిమాకి ప్రధాన కథాంశం. ఈ సినిమా కోసం ఎంచుకున్న ఈ స్టొరీ పాయింట్ బాగుంది. సినిమాలో క్లైమాక్స్ 20 నిమిషాలు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంతే కాకుండా మధ్య మధ్యలో కొన్ని చోట్ల వచ్చే కామెడీ, లవ్ సీన్స్ బాగున్నాయి. అలాగే ఈ సినిమా కోసం ఎన్నుకున్న నటీనటుల పెర్ఫార్మన్స్ కూడా ఈ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది.

సీనియర్ యాక్టర్స్ అయిన రాధిక, నరేష్ లు ఉన్నది కాసేపే అయినా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటారు. నాగరాజుగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన సుధాకర్ ఈ సినిమాలో జాజ్ రాజు పాత్రతో మరోసారి ఆకట్టుకున్నాడు. సుధాకర్ సినిమా అంతా పర్ఫెక్ట్ వైజాగ్ యాసలో మాట్లాడుతూ మెప్పించాడు. ఈ సినిమాతో పరిచయం అయిన కార్తీక్ జస్ట్ ఓకే అనిపించుకున్నాడు. ఇక హీరోయిన్స్ లో మలయాళ బ్యూటీ అయిన అవంతిక మోహన్ లుక్స్ పరంగానే కాకుండా పాత్రకి అవసరమైన మంచి నటనని కనబరిచింది. మరో హీరోయిన్ అయిన నీతిక చౌదరి పెర్ఫార్మన్స్ చాలా ఎనర్జిటిక్ గా ఉంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ బాగా చేసింది. సినిమాలో వచ్చే కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా నిడివి కేవలం 120 నిమిషాలు మాత్రమే.. కానీ సినిమా మొదటి నుంచి చివరి 20 నిమిషాల వరకూ చాలా స్లోగా సాగడంతో ఆడియన్స్ పిచ్చ బోర్ ఫీలవుతారు. సినిమా చూసింది రెండు గంటలే అయినా ఏదో నాలుగు గంటల సినిమా చూపించినట్టు ఫీలవుతారు. కథ కోసం మంచి పాయింట్ ని ఎంచుకున్న డైరెక్టర్ ఆ కథా పాయింట్ ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా రాసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఉదాహరణకి కథలో జాజ్ రాజుకి రాక్ బ్యాండ్ స్టార్ అవ్వాలనేది కల, కానీ తన కల కోసం ఎలాంటి స్టెప్స్ తీసుకోకుండా జాలీగా హీరోయిన్ తో తిరుగుతుంటాడు. ఎలాంటి ప్రాక్టీస్ ఉండదు, ఎలాంటి కోచింగ్ ఉండదు కానీ అలాంటి అతనికి సడన్ గా ఫిల్మ్ఫేర్ లో పెర్ఫార్మన్స్ చేసే ఛాన్స్ వస్తుంది. సినిమా మొత్తం చూసిన వారికి ఇదెలా పాజిబుల్ అనే అనుమానం వస్తుంది.

అలాగే సినిమాలో సీనియర్ యాక్టర్స్ ని పెట్టుకున్న వారిని సరిగా వినియోగించుకోలేదు. రాధిక లాంటి నటి చెయ్యాల్సినంత ప్రాముఖ్యత ఆ పాత్రలో లేదు. సినిమా మొదట్లో తల్లి కొడుకుల రిలేషన్ చూపించినా ఆ తర్వాత ఒక్కసారిగా వీరిద్దరి కాంబినేషన్ ని సరిగా వినియోగించుకోకపోవడమే కాకుండా వారిద్దరి మధ్య ఎమోషన్స్ ని కూడా సరిగా వర్కౌట్ చెయ్యలేదు. ఇలాగే ఈ సినిమాలో జరిగిన మరో మైనస్ పాయింట్ సినిమాలో పాత్రలన్నిటికీ లింక్స్ పెట్టారు కానీ ఏ ఒక్క లింక్ ని ఎమోషనల్ గా ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యలేదు. అందుకే ఆడియన్స్ ఆ పాత్రలతో పెద్దగా కనెక్ట్ అవ్వరు.

ఇకపోతే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే మరో మైనస్.. సినిమాలో పాత్రల పరిచయాలు అయిపోయాక ఎవరెవరి కథ ఎలా సాగుతుంది, ఎలా ముగుస్తుంది అనే విషయాలను మీరు ఊహించేయవచ్చు. మీరు ఊహించినట్టుగానే కథ ముందుకు వెళుతుంది. ఆడియన్స్ ఆ బోరింగ్ మూడ్ లో నుంచి కాస్త తేరుకొని ఇది బాగుందే అనుకునేలా సినిమాలో ఏమీ ఉండదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ ఈశ్వర్ గురించి.. ఈశ్వర్ వైజాగ్ లోని వీధుల్ని, అక్కడ నివసించే సామాన్యుల లైఫ్ స్టైల్ ని సినిమాలో బాగా కాప్చ్యూర్ చేసాడు. విజువల్స్ పరంగా సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్ గా ఉంది. కొన్ని చోట్ల రాసిన మీనింగ్ ఫుల్ డైలాగ్స్ సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. రామ్ నారాయణ్ అందించిన మెలోడీ సాంగ్స్ బాగున్నాయి, అలాగే తను అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి బాగానే హెల్ప్ అయ్యింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది.

ఇక ఈ సినిమాకి కథ – స్క్రీన్ ప్లే – డైరెక్షన్ బాధ్యతలను అరుణ్ దాస్యం తీసుకున్నాడు. అరుణ్ ఈ సినిమా కథ కోసం ఎంచుకున్న పాయింట్, దాని కోసం ఎంచుకున్న నేపధ్యం బాగుంది, కానీ కథను అల్లుకున్న విధానం బాలేదు. స్క్రీన్ ప్లే – వెరీ స్లో అందుకే ఆడియన్స్ బాగా బోర్ ఫీలవుతారు. ఆడియన్స్ ని థ్రిల్ చేసేలా ఏమీ ఉండదు. దర్శకత్వం – నటీనటుల పెర్ఫార్మన్స్ రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు, ఫైనల్ గా అనుకున్న పాయింట్ ని కరెక్ట్ గా చెప్పాడు కానీ పాత్రల ఎమోషన్స్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడంలో మిస్ అయ్యాడు. ఈ సారి కథ కోసం ఎంచుకున్న పాయింట్ తో పాటు, ఆ కథలోని పాత్రలని కూడా ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యగలిగితే మంచి డైరెక్టర్ అవుతాడు. ఇక ఆమ్ టీం ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

నూతన దర్శకుడు అరుణ్ దాస్యం లక్ష్య సాధన కోసం పోరాడే ప్రతి ఒక్కరికి గెలుపు తధ్యం అంటూ తీసిన ‘ఉందిలే మంచికాలం ముందు ముందునా’ సినిమా మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా నిలిచిపోతుంది. డైరెక్టర్ అనుకున్న పాయింట్ ని ముందు నుంచి పాత్రల ద్వారా, ఆ పాత్రల ఎమోషన్స్ ద్వారా చెప్పించడానికి ట్రై చేసి ఉంటే బాగుండేది. స్టొరీ లైన్, క్లైమాక్స్ ఎపిసోడ్, రాధిక, నరేష్, సుధాకర్ పెర్ఫార్మన్స్ లు ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ అయితే స్లో నేరేషన్, పాత్రల ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడం, ఆడియన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ పెద్దగా లేకపోవడం మేజర్ మైనస్ పాయింట్స్. కథ – కథనం – ఎంటర్టైన్మెంట్ ఎలా ఉన్నా ఈ సినిమా ద్వారా ఒక మంచి పాయింట్ ఉన్న సినిమా చూసాం అనే ఫీలింగ్ చాలు అనుకునే ఆడియన్స్ తో పాటు, ఓ మంచి పాయింట్ ఉన్న సినిమా మిస్ అవ్వకూడదు అనుకునే వారు చూడాల్సిన మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ‘ఉందిలే మంచికాలం ముందు ముందునా’.

123తెలుగు. కామ్ రేటింగ్ : 2.25/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW


సంబంధిత సమాచారం :