సమీక్ష : వినయ విధేయ రామ – చరణ్ ఆకట్టుకున్నా.. సినిమా ఆకట్టుకోదు !

విడుదల తేదీ : జనవరి 11, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : రామ్ చరణ్, కియార అద్వానీ, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ

దర్శకత్వం : బోయపాటి శ్రీను

నిర్మాత : డివివి దానయ్య

సంగీతం : దేవీశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫర్ : రిషి పంజాబీ – ఆర్థర్ ఏ విల్సన్

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు

‘ధృవ’, ‘రంగస్థలం’ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొట్ట మొదటి సారి ఊర మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన మాస్ ఎంటర్టైనర్ ‘వినయ విధేయ రామ’. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించిన ఈ సినిమాలో ‘జీన్స్’ ఫెమ్ ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేష్ లాంటి ఎందరో పేరున్న నటీనటులు నటించారు. టీజర్, ట్రైలర్స్ తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసిన ‘వినయ విధేయ రామ’ సంక్రాంతి కానుకగా నేడు(జనవరి 11న) విడుదలైంది. మరి ఈ వినయ విధేయ రాముడు ఏ మేరకు మాస్ ప్రేక్షకులను మెప్పించాడో ఇప్పుడు చూద్దాం.

కథ :

పుట్టుకతో అనాధలైన ఓ నలుగురు అన్నదమ్ముల భయానికి.. ఒక ధైర్యంలా ఆపదలో ఉన్న ఓ చిన్న పిల్లాడు దొరుకుతాడు. అతనే రామ్(రామ్ చరణ్). ఆపదలో ఉన్న రామని కాపాడే క్రమంలో ఆ ఐదుగురూ అన్నదమ్ములవుతారు. బలహీనులైన ఆ నలుగురు అన్నలకి ధైర్యంగా నిలబడిన రామ కథే ఈ ‘వినయ విధేయ రామ’. అన్నయ్యలకి చిన్న ఆపద వచ్చినా ఎదుటి వాడు ఎంతటి వాడైనా అవతలి వాళ్ళని ఢీ కొడతాడు రామ.

కాగా రామ పెద్దన్నయ్య భువన్ కుమార్(ప్రశాంత్) ఒక ఎలక్షన్ కమీషన్ ఆఫీసర్. భువన్ కుమార్ సిన్సియారిటీకి మెచ్చి బీహార్ లో ఎలక్షన్స్ జరగకుండా ఆపుతున్న రాజా భాయ్ మున్నా అరాచకాల్ని ఆపి, ఎలక్షన్స్ సజావుగా సాగడానికి ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా భువన్ కుమార్ ని వేస్తారు. బీహార్ లో సిన్సియారిటీ వల్ల భువన్ కుమార్ స్టాఫ్ ఆపదల్లో పడతారు. ఆ ఆపద నుంచి రామ ఎలా తన అన్నయ్యని, స్టాఫ్ ని కాపాడాడు? ఈ కాపాడే క్రమంలో జరిగిన అనర్థాలేమిటి? వాటన్నిటినీ రామ ఎలా పరిష్కరించాడు? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ మధ్య కొత్తదనం ఉన్న సినిమాలతో మెప్పిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పక్కా మాస్ మసాలా మూవీ చేయలేదు అని ఫీలవుతున్న అభిమానుల కోరికని ‘వినయ విధేయ రామ’తో రామ్ చరణ్ తీర్చేసాడు. ఇక రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే, రామ్.. రామ్ కొ ణి దె ల పాత్రలో అదరగొట్టేసాడు. గతంలో రామ్ చరణ్ మాస్ పాత్రలు చేసినప్పటికీ ఇంత పవర్ఫుల్ పాత్రలో కనిపించడం ఇదే మొదటిసారైతే, అంతకు మించి తన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్, మాస్ డైలాగ్స్ తోనే కాకుండా సున్నితమైన ఎమోషనల్ సీన్స్ లోనూ మంచి నటనని కనబరిచాడు. ముఖ్యంగా చరణ్ సిక్స్ ప్యాక్ అండ్ టాటూ లుక్ కి అందరూ ఫిదా అవుతారు. పాటలు యావరేజ్ అయినప్పటికీ చరణ్ డాన్సులు ఇరగదీయడంతో స్క్రీన్ పై బాగా అనిపిస్తాయి.

కియార అద్వానీ అందంతో పాటు అమాయకత్వం, అల్లరి కలగలిపిన పిల్ల పాత్రలో మరోసారి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. చరణ్ – కియార కెమిస్ట్రీ బాగుంది. ముఖ్యంగా పాటల్లో చరణ్ గ్రేస్ కి ఏ మాత్రం తగ్గకుండా పోటీ పడి డాన్స్ చేసి మెప్పించింది. ఇక హీరోని ఢీ కొట్టే విలన్ పాత్రలో వివేక్ ఒబెరాయ్ హీరోకి నటనలో గట్టిపోటీనే ఇచ్చాడు. వివేక్ ఒబెరాయ్ పెర్ఫార్మన్స్ కూడా తారాస్థాయిలో ఉండడం వల్ల రామ్ చరణ్ – వివేక్ ఒబెరాయ్ మధ్య సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి, థియేటర్స్ లో ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టిస్తున్నాయ్. ఇక చాలా రోజులకి తెలుగు తెరపై కనిపించిన ప్రశాంత్ తన పాత్రకి న్యాయం చేశారు. అలాగే అన్న దమ్ములుగా నటించిన ఆర్యన్ రాజేష్, రవి వర్మ, మధు, ముఖేష్ ఋషి, ప్రియదర్శన్ లు వారి వారి పాత్రల్లో మెప్పించారు. సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రలో బాగా చేసింది. అలాగే రామ్ చరణ్ – కియరా పెళ్లి చూపుల సీన్ లో హేమ కామెడీ బాగుంది.

సినిమా పరంగా చెప్పుకుంటే.. డైరెక్టర్ బోయపాటి శ్రీను హీరో ఎలివేషన్స్ పరంగా ప్రేక్షకులని అప్పుడప్పుడు హై వోల్టేజ్ ఫీల్ లోకి తీసుకెళ్తారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి ప్రధాన బలం. ముఖ్యంగా ఇంటర్వల్ ముందు ముస్లీమ్ సోదరుల బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఫైట్, అజర్భాయ్జాన్ లో సిక్స్ ప్యాక్ బాడీతో షూట్ చేసిన ఫైట్ అంతకుమించి అనేలా ఉంటాయి. మాస్ ఆడియన్స్ కి అవి బాగా నచ్చుతాయి.ట్రైలర్ లో చూపిన పందెం పరశురామ్ సీన్ కూడా అదిరిపోయింది. అలాగే రామ్ చరణ్ చిన్న తనం సీన్స్, అవి ఎలివేట్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ప్రతి యాక్షన్ ఎపిసోడ్ కి దేవీశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బలాన్ని ఇచ్చింది.

మైనస్ పాయింట్స్ :

ప్రతి సినిమాకి మొదటి హీరో కథ. కానీ ఈ సినిమాలో కథే చాలా వీక్ గా ఉంటుంది. ఈ కథని మనం ఇప్పటికి చాలా అంటే చాలా సార్లు చూసేసాం. అందులో కొన్ని రికార్డ్స్ బ్రేక్ చేశాయి కూడా, అందుకే కథా పరంగా చూసుకుంటే పాత కథకి కొత్త ముఖాలు, కొత్త యాక్షన్ సీన్స్ మిక్స్ చేసి చెప్పినట్టుంటుంది. కథ చాలా సింపుల్ అవ్వడం వల్ల కథనంతో మేనేజ్ చేద్దాం అనుకున్నారు. కానీ అది కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. అసలు కథ చెప్పకుండా ఎదో జుజుబీ కథతో ఫస్ట్ హాఫ్ అంతా చెప్పడం వల్ల ఇదంతా లేకుండా సెకండాఫ్ మాత్రమే చెప్పచ్చు కదా అని కొందరు అనుకుంటే, సెకండాఫ్ లో ఏం కథ ఉందని చెప్పడానికి అని కొందరు పెదవి విరుస్తున్నారు. అలాగే ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే కాస్త గజిబిజిగా కూడా ఉంటుంది. అలాగే చాలా సీన్స్ చూస్తున్నప్పుడు ఇలాంటి సేమ్ టు సేమ్ సీన్స్ బోయపాటి గారి సినిమాలోనే చూసినట్టున్నాం అనే డెజావు ఫీలింగ్ వస్తుంది.

అలాగే ఎవరైనా ఓ భారీ ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాం అంటే అందులో హీరోనే తోపు అయ్యుండాలి అనుకుంటాం కానీ ఇక్కడ విలన్ కి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం వాళ్ళ చాలా వరకు హీరో లేడేంటా అని అనుకుంటాం. హీరో రాగానే రెండు ఫైట్స్ వెంట వెంటనే వచ్చి సినిమా అయిపోతుంది. చెప్పాలంటే ఒక ఫైట్ తోనే ఫినిష్ చేయచ్చు కానీ ఏదో సినిమా నిడివి కోసం, స్నేహ చేత రొటీన్ డైలాగ్స్ కొన్ని చెప్పించాలని ఇంకో క్లైమాక్స్ ఫైట్ పెట్టినట్టుంటుంది. సెకండాఫ్ లో ఒక ఫైట్ ఆకట్టుకున్నా మిగతా అంతా చాలా రొటీన్ గా ఉండడం వాళ్ళ థియేటర్ నుంచి బయటకి వచ్చేటప్పుడు ఏదో వెలితిగా బయటకి వస్తారు. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా సరిగా కట్ చేయలేదు, అందువల్ల చూసే ఆడియన్స్ కి ఊపొచ్చేలోపు ఫైట్ అయిపోతుంది.

సాంకేతిక విభాగం :

ముందుగా కెప్టెన్ ఆఫ్ ద మూవీ అయిన బోయపాటి శ్రీనుకి ఏ హీరోని ఎలా చూపించాలో బాగా తెలుసు. అందుకే రామ్ చరణ్ ని ఇది వరకూ చూడని ఒక కొత్త తహాలో, పవర్ఫుల్ పాత్రని డిజైన్ చేసాడు. కానీ ఆ పాత్రకి, తన ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కథని తయారు చేయడంలో మాత్రం విఫలమయినట్టు క్లియర్ గా తెలుస్తోంది. 4 ఏళ్ళు ఈ కథని రాశారు అన్నారు కానీ అంత చెప్పుకునేలా లేదు. తను డిజైన్ చేసిన పాత్రకి రామ్ చరణ్ న్యాయం చేసాడు కథ, కథనంలోనే అంత పవర్ లేదు. ఎప్పటిలానే యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా తీసాడు కానీ కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ మీదే కాకుండా కథ- కథనం మీద కూడా ఇంకా దృష్టి పెట్టాల్సింది. ఓవరాల్ గా కొన్ని కొన్ని సీన్స్ లో రామ్ చరణ్ ని చూపిన విధానం, తన తో చెప్పించిన డైలాగ్స్, చేయించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఇంతకు ముందు చూడలేదనే చెప్పాలి. ఎప్పటిలానే బోయపాటి కథకి ఎం రత్నం రాసిన మాటలు మరింత బలాన్ని చేకూర్చాయి.

బోయపాటి ఆలోచనలకి రిషి పంజాబీ – ఆర్థర్ ఏ విల్సన్ ఇచ్చిన దృశ్య రూపం చాలా బాగుంది. అలాగే ఆ విజువల్స్ ఎలివేషన్ కి దేవీశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద ప్లస్ అని చెప్పాలి. దేవీశ్రీ ఇచ్చిన పాటల విషయంలో ఆడియన్స్ ని కొంత నిరుత్సాహపడినప్పటికీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో సంతృప్తి పరిచాడనే చెప్పాలి. వివేక్ ఒబెరాయ్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ ట్యూన్ అదుర్స్. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అంతంత మాత్రం అని చెప్పాలి, ఎందుకంటే బోయపాటి సినిమాలకి బలం ఫైట్సే, కానీ కారణం ఏదైనప్పటికీ ప్రతి ఫైట్ ధనాధన్ అయిపోద్ది. కనల్ కణ్ణన్ యాక్షన్ డిజైనింగ్ బాగుంది కానీ తాను తీసిన ఫుల్ ఫైట్ ఉండి ఉంటే ఇంకా బాగుండేదేమో. అలాగే ఎఎస్ ప్రకాష్ సెట్స్ కూడా అదిరిపోయాయి. ముఖ్యంగా పాటలకి వేసిన సెట్స్ చాలా గ్రాండియర్ గా ఉన్నాయి.

డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రీ రిలీజ్ వేడుకలో అభిమానులు గుండెల మీద చెయ్యేసుకుని చూడండి అనే స్టేట్మెంట్ ఇచ్చారు. అన్నట్టుగా మా చరణ్ తో అదిరిపోయే సినిమా తీశారు అంటూ ప్రేక్షకులు కాలర్ ఎగరేసుకొని మరీ సినిమా నుంచి బయటకి వస్తారు.

తీర్పు :

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘వినయ విధేయ రామ’ చిత్రం ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమయింది. మాస్ ప్రేక్షకుల చేత పర్వాలేదనిపించుకునేలా ఉందే తప్ప.. పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. అయితే రామ్ చరణ్ ని ప్రెజంట్ చేయడంలో, తనలోని హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో, బలమైన యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆకట్టుకోవడంలో బోయపాటి శ్రీను సక్సెస్ అయినప్పటికీ.. కథ – కథనం విషయంలో మరీ పాత మూస పద్దతిని పాటించడంతో సినిమా ఫలితం దెబ్బతింది.

దాంతో సినిమా ఆధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పాటల పిక్చరైజేషన్, కియరా గ్లామర్ టచ్ కూడా కొంత వరకూ సినిమాకి హెల్ప్ అయ్యాయి. ఇక మాస్ ఊర మాస్ కావాలని కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ బాగా ఆకట్టుకుంటాయి. కానీ ఓవరాల్ గా ఈ సినిమా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం మెప్పించదు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :

More