సమీక్ష : యుద్ధ‌భూమి- ప్రేక్షకుల మనసు గెలవలేదు

Yudha Bhoomi movie review

విడుదల తేదీ : జూన్ 29, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : మోహన్ లాల్, అల్లు శిరీష్

దర్శకత్వం : మేజర్ రవి

నిర్మాత : ఏ.ఎన్.బాలాజీ

సంగీతం : సిద్ధార్థ్ విపిన్ – నాజిమ్ అర్షద్-రాహుల్ సుబ్రమణియం

సినిమాటోగ్రఫర్ : సుజిత్ వాసుదేవ్

ఎడిటర్ : సాంజిత్

మలయాళ స్టార్ మోహన్ లాల్, అల్లు శిరీష్ కలిసి నటించిన తెలుగు అనువాద చిత్రం “యుద్ధ భూమి”. బోర్డర్ వార్ నేపధ్యంలో సాగే ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.

కథ :

కల్నల్ సహదేవన్ (మోహన్ లాల్) శత్రుదేశపు సైనికులను కూడా స్నేహపూర్వకంగా చూసే మహోన్నతమైన వ్యక్తి. సహదేవన్ 1971 ప్రాంతంలో ఇండియా-పాకిస్తాన్ బోర్డర్ లో మేజర్ గా విధులు నిర్వహిస్తుంటాడు. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య వార్ మొదలవుతుంది. అప్పుడు ఇండియన్ ఆర్మీకి సహాయ ట్యాంకర్ పైలట్ గా చిన్మయ్ (అల్లు శిరీష్) వస్తాడు. అసలు ఇరు దేశాల సైనికులకు యుద్ధం చేయాలన్న ఆలోచన ఉండదు. కానీ కుట్ర పూరితమైన పాకిస్తాన్ మేజర్ యుద్ధానికి ప్రేరేపిస్తుంటాడు.

ఆ యుద్ధంలో సోల్జర్ చిన్మయ్ తో పాటు.. పాకిస్తాన్ మేజర్ కూడా మరణిస్తారు. అప్పుడు సహదేవ్ యుద్ధ వాతావరణం మార్చటానికి ఓ నిర్ణయం తీసుకుంటారు. సహదేవ్ తీసుకొన్న ఆ నిర్ణయం ఏమిటి ? చివరికి యుద్ధం ఎలా ముగిసింది ? అనేదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

మోహన్ లాల్ తన పరిపక్వతమైన అనుభవంతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని సన్నివేశాల్లో తీవ్రమైన భావోద్వేగాలను పండించారు. ఇక ఈ చిత్రంలో మోహన్ లాల్ ద్విపాత్రాభినయంలో నటించారు. ఒక పాత్రకి మరో పాత్రకు మధ్య మంచి వైవిధ్యాన్ని చూపించారు.

ఇక అల్లు శిరీష్ చాలా చిన్న పాత్రలో కనిపించారు. ఉన్నంతసేపు ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. ఒక్క పాటలో మాత్రమే కనిపించిన శ్రుతి దాంగే తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్నే ప్రయత్నం చేసింది. మిగిలిన నటీనటులు కూడా బాగానే చేశారు.

ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రలు పరిచయంతో బాగానే సాగింది. పాకిస్థాన్ మేజర్ గా నటించిన నటుడు కూడా బాగా చేశాడు. దర్శకుడు మేజర్ రవి ఆర్మీలో పని చేసిన ఎక్స్ పీరియన్స్ ఉండడంతో యుద్ధ వాతావరణం, ట్యాంకర్స్, గన్స్ & యూనిఫార్మ్స్ విషయంలో చాలా కేర్ తీసుకొని వాస్తవానికి దగ్గరగా చిత్రీకరించారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు మేజర్ రవి ఆర్ట్ వర్క్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ కథనం మీద పెట్టలేదనిపిస్తుంది. సినిమా మొత్తం చాలా సీరియస్ గా సాగుతూ ఉండటం వల్ల ప్రేక్షకులు కొంత బోర్ గా ఫీల్ అవుతారు. కథనం చివరికి వెళ్లేసరికి అల్లకల్లోలంగా ఉంటుంది.

దర్శకుడు సందేశం ఇవ్వాలని ప్రయత్నించడంతో సెకండాఫ్ కథనం పూర్తిగా సైడ్ ట్రాక్ లోకి మారిపొయింది.
సన్నివేశాలను అనవసరంగా లాగడం వల్ల ఆ సాగతీతను చూడలేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. టైట్ స్క్రీన్ ప్లే మరియు ఎంగేజింగ్ ఎలిమెంట్స్ లేని ఈ చిత్రం ప్రేక్షకుడ్ని కుర్చీలో కదలకుండా కూర్చోపెట్టదు. సినిమా చివర్లో వచ్చే కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ చాలా బలహీనంగా ఉంది.

సాంకేతిక విభాగం :

సిద్ధార్థ్ విపిన్ – నాజిమ్ అర్షద్-రాహుల్ సుబ్రమణియం అందించిన సంగీతం బాగున్నప్పటికీ.. తెలుగు సాహిత్యానికి అంతగా సింక్ అవ్వలేదు. కానీ వీళ్ళు సమకూర్చిన నేపధ్య సంగీతం బాగుంది. దర్శకుడు మలయాళ ప్రేక్షకుల కోసం రాసిన నెమ్మదైన కథనం తెలుగు ప్రేక్షకులకు అంతగా సరిపడలేదు.

సినిమాటోగ్రాఫర్ సుజీత్ వాసుదేవన్ తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించారు. ముఖ్యంగా వార్ సంబంధించిన సన్నివేశాల్లో ఆ ఫీల్ ను తన కెమెరా యాంగిల్స్ తో కళ్ళకు కట్టినట్టు చూపించాడు. చోటా.కె.ప్రసాద్ ఎడిటింగ్ గజిబిజి లేకుండా చక్కగా ఉంది.

తీర్పు:

అనువాద చిత్రం కావడంతో అందులోనూ కమర్షియల్ చిత్రం కాకపోవడంతో ఎంటరైన్మెంట్ కోరుకునే ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ చిత్రం చూడ్డానికి అంతగా ఆసక్తి చూపకపోవచ్చు. సినిమాలో మెసేజ్, ఎమోషనల్ కంటెంట్ ఉన్నా బలమైన కథనం లేకపోవడం నిరుత్సాహానికి గురిచేసింది. మొత్తం మీద ఉత్కంఠభరితంగా, రసవత్తరంగా సాగని ఈ చిత్రం ఈ వారంతంలో తెలుగు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోవడం కష్టమనే చెప్పాలి.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

  • 16
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook