ఇంటర్వ్యూ : విశాల్ – సగం కోపం, సగం ఆశతో సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాను

ఇంటర్వ్యూ : విశాల్ – సగం కోపం, సగం ఆశతో సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాను

Published on Oct 30, 2013 5:51 PM IST

vishal-Interview

‘పందెం కోడి’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన హీరో విశాల్. కెరీర్ మొదట్లో వరుస హిట్స్ అందుకున్నప్పటికీ ఈ మధ్య కాలంలో సక్సెస్ విషయంలో కాస్త వెనుకబడ్డాడు. ‘నా పేరు శివ’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన డైరెక్టర్ సుసీంధ్రన్ డైరెక్షన్ లో విశాల్ హీరోగా మరియు నిర్మాతగా చేసిన సినిమా ‘పల్నాడు’. తెలుగు, తమిళంలో దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విశాల్ మీడియా మిత్రులతో కాసేపు ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ‘పల్నాడు’ సినిమా ఎలా మొదలైంది?

స) నేను చేసిన ‘వాడు – వీడు’ సినిమా చూసి సుసీంధ్రన్ ఈ సినిమా నేనే చెయ్యాలని నా దగ్గరికి వచ్చి ఈ కథ చెప్పాడు. కథ నాకు బాగా నచ్చింది, కానీ నాతో పాటు చాలా మందికి ఈ పాత్ర విశాల్ చెయ్యగలడా? అన్న అనుమానం వచ్చింది. ఎందుకు చెయ్యలేం అని చాలెంజ్ గా తీసుకొని ట్రై చేద్దాం అని ఈ సినిమా చేసాను.

ప్రశ్న) ‘పల్నాడు’ లో మీ పాత్ర గురించి చెప్పండి?

స) పల్నాడులో నా పాత్ర ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పటి వరకు విశాల్ అంటే 5 లేదా 10 మందిని చాలా ఈజీగా కొట్టేయగలడు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో నాది గొడవలకి దూరంగా ఉండే భయస్తుడి పాత్ర. అలాగే సినిమాలో నాకు ఆనందం వేసినా, బాధ వేసినా నత్తి వస్తుంటుంది. ఆ ట్రాక్ ఫస్ట్ హాఫ్ లో చాలా ఫన్నీగా ఉంటుంది. అలాగే నా పాత్ర మీ పక్కింటి అబ్బాయిలా ఉంటుంది.

ప్రశ్న) ఇప్పటి వరకు మీ అన్ని సినిమాలు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చాయి. ఈ సినిమాకి మాత్రం ఎందుకని పల్నాడుని ఎంచుకున్నారు?

స) బ్యాక్ డ్రాప్ అనేది ఎప్పుడు ప్లాన్ చెయ్యలేదు. డబ్బింగ్ సినిమా అంటే సినిమా అంతా అయ్యాక ఆంధ్రలో ఏ బ్యాక్ డ్రాప్ సరిపోతుందా అనేది చూసి పెట్టేస్తాము. ఒకవేల ద్విబాషా చిత్రం అయితే ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే బ్యాక్ గ్రౌండ్ ఏంటనేది ఎంచుకుంటాం. నా మొదటి సినిమా నుండి డైలాగ్స్ రాసే శశాంక్ వెన్నెలకంటి ఈ సినిమా చూసి పల్నాడు బ్యాక్ డ్రాప్ పెడితే బాగుంటుంది అని చెప్పారు. ఆ తర్వాత అది ఫైనలైజ్ చేసాము.

ప్రశ్న) ‘వాడు – వీడు’ సినిమాలో మీ నటనకి విమర్శకుల నుండి ప్రశంశలు అందుకున్నారు. అయినా సరే మీరెందుకు యాక్షన్ జోనర్ లోనే సినిమాలు చేస్తున్నారు?

స) యాక్షన్ జోనర్ అనేది నేను ఎంచుకున్నది కాదు. డైరెక్టర్స్ నన్ను ఎలా చూపించాలనుకుంటారో దాన్ని బట్టి కథలు సిద్దం చేసుకొని నా దగ్గరికి వస్తారు. చెప్పాలంటే వాడు – వీడు సినిమా లేకపోతే ఈ సినిమా చేసేవాన్ని కాదు. సుసీంధ్రన్ ఆ సినిమా చూసాకే నేను పల్నాడు సినిమా చేయగలననే నమ్మకంతో నాకు కథ చెప్పాడు. నా అన్ని సినిమాల్లోనూ యాక్షన్ ఉంటుంది కానీ దానికో కారణం ఉంటుంది. నేను అది నమ్ముతాను.

ప్రశ్న) వాడు – వీడు సినిమా విషయంలో మీరు విమర్శకుల ప్రశంశలు అందుకున్నప్పటికీ, అవార్డ్స్ మాత్రం రాలేదు. ఈ విషయంలో మీరేమన్నా బాధ పడ్డారా?

స) నేను అవార్డ్స్ ని పెద్దగా నమ్మను. ఎందుకంటే ఎవరో నలుగురు కూర్చొని సినిమా చూసి వారికి నచ్చిన దాన్ని బట్టి అవార్డ్స్ ఇస్తారు. అది కరెక్ట్ కాదు. అందుకే నాకు అవార్డ్స్ అన్నా, అవార్డ్స్ ఫంక్షన్స్ అన్నా పెద్దగా ఇష్టం ఉండదు. ఒకవేళ ప్రజల ద్వారా ఎన్నుకుంటే అలాంటి అవార్డ్స్ ని నమ్ముతాను.

ప్రశ్న) వాడు – వీడు చూసి మిమ్మల్ని హీరోగా తీసుకున్నారు అంటున్నారు. అలా అయితే ఇది పర్ఫెక్ట్ డైరెక్టర్స్ మూవీ అని చెప్పొచ్చా?

స) అవును, 100% ఇది డైరెక్టర్స్ మూవీ. ఒక నటుడిగా డైరెక్టర్స్ సినిమా ద్వారా నటుడిగా మనకు మంచి పెరోస్తుందని నేను నమ్ముతాను. ఈ మూవీలో క్లైమాక్స్ చూస్తే అది మీకు తెలుస్తుంది.

ప్రశ్న) మీ సొంత అన్నయ్య ప్రొడక్షన్ ఉండి కూడా మీరు మళ్ళీ ఎందుకు సొంత బ్యానర్ ని ప్రారంభించారు?

స) అన్నయ్య ప్రస్తుతం నాన్నగారి బిజినెస్ చూసుకుంటున్నారు. అందుకే కొద్ది రోజులు సినిమాలు చెయ్యరు. నేను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీని సగం కోపంతో, సగం ఆశతో ప్రారంభించాను. ఆశ ఏమిటంటే – నేను ముందుగా డైరెక్టర్ గా పరిచయమయ్యి ఆ తర్వాత నిర్మాతగా మారి ఓ బ్యానర్ మొదలు పెట్టాలనుకున్నాను. కానీ నా గత సినిమాల అనుభవం వల్ల ముందే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాల్సివచ్చింది. అది నాకు ఆనందమే. ఎందుకంటే ఈ ప్రొడక్షన్ ద్వారా చాలా మంది టాలెంట్ ఉన్నవారికి అవకాశం ఇవ్వొచ్చు. ఇక కోపం అంటే – నేను పనిచేసిన నా పాత ప్రొడక్షన్స్ పెట్టిన ఇబ్బందుల వల్ల సొంత ప్రొడక్షన్ హౌస్ మొదలు పెట్టాను. హీరోగా నేను డేట్స్ ఇవ్వకపోతే సమస్య ఉంటుంది కానీ నేను డేట్స్ ఇచ్చి సినిమా పూర్తి చేసిన తర్వాత సినిమా సరిగా రిలీజ్ కాకపోవడం, లేదా రిలీజ్ లేట్ అవ్వడం వల్ల నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. అందుకే ప్రొడక్షన్ హౌస్ పెట్టాను. ముందుగా పల్నాడు కూడా వేరే బ్యానర్ లో చెయ్యాలి ఎందుకో సరిగ్గా అనిపించక నా బ్యానర్ లోనే చేసాను.

ప్రశ్న) ఈ సినిమాకి తెలుగులో పెద్ద కాంపిటీషన్ లేకపోయినప్పటికీ తమిళంలో మంచి పోటీ ఉంది. నిర్మాతగా చేసిన సినిమా విషయంలో ఇలాంటి సాహసం ఎందుకు చేసారు?

స) ఈ సినిమాని దీపావళికి రిలీజ్ చేయాలని నెలక్రితం తీసుకున్న నిర్ణయం కాదు. సినిమా మొదలు పెట్టిన రోజే ఈ సినిమాని దీపావళికి రిలీజ్ చేయాలని చెప్పాను. అనుకున్నట్లు గానే నా టీం సినిమాని పూర్తి చేసింది. ఇక నుంచి విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో చేసే ప్రతి సినిమా రిలీజ్ డేట్ ని ముందే అనౌన్స్ చేస్తాము. అలాగే కాంపిటీషన్ అంటే నాకిష్టం.

ప్రశ్న) డైరెక్టర్ కావాలనుకుంటున్నారు. ఎప్పుడు డైరెక్టర్ గా మారుతున్నారు? ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు?

స) ఇప్పుడు కూడా నన్ను డైరెక్టర్ అవ్వమంటే అయిపోతాను. కానీ నాకు కొన్ని కమిట్ మెంట్స్ ఉన్నాయి. అవన్నీ పూర్తయిన తర్వాత ఒక 6 నెలలు ఏమీ పని లేదు అంటే అప్పుడు కథ రాసుకొని డైరెక్టర్ అవుతాను. ఎలాంటి సినిమా చేయాలని ఏమీ అనుకోలేదు. అప్పుడు ఏమనిపిస్తే అది చేస్తాను.

ప్రశ్న) తెలుగులో డైరెక్ట్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు?

స) ముందుగా తెలుగులో ఓ సినిమా చేసి ఈ దసరాకి రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ వేరే కొన్ని కారణాల వల్ల, అలాగే ఈ పల్నాడు స్టొరీ రావడంతో దాన్ని కాస్త పక్కన పెట్టాము. వచ్చే సంవత్సరంలో తెలుగు సినిమా సెట్స్ పైకి వెళుతుంది. చెప్పాలంటే శశి కుమార్ ఒక సంవత్సరం నుంచి కథతో నాకోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే దసరాకి ఆ సినిమా ఉండొచ్చు.

ప్రశ్న) మీకు పెళ్లి అనే వార్తలు వస్తున్నాయి. దీనిపై మీ కామెంట్ ఏమిటి?

స) పల్నాడు నవంబర్ 2న రిలీజ్ అవుతోంది. నా నెక్స్ట్ సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ అవుతోంది. కానీ నా పెళ్ళి ఎప్పుడో నాకు తెలియదు(నవ్వుతూ). చెప్పాలంటే ప్రస్తుతం నేను పెళ్లి అనేదానికి రెడీగా లేను.

ప్రశ్న) బాలీవుడ్ లో ఏమన్నా సినిమాలు చేయాలనుకుంటున్నారా?

స) అలా ఏమీ లేదండి. నేను ఏమీ ప్లాన్ చేసి చెయ్యను. నాకు వాడు – వీడు లో ఆడ వేషం వస్తుందని అనుకోలేదు కానీ వచ్చింది. అదే విధంగా త్వరలో ఫుల్ లెంగ్త్ నెగటివ్ షేడ్స్ ఉన్న ఓ పాత్ర చేయబోతున్నాను. దాని గురించి త్వరలో పూర్తి వివరాలు చెబుతాను. ఒకవేళ బాలీవుడ్ లో ఆఫర్ వస్తే చేస్తాను.

ప్రశ్న) మీరు చేయనున్న తదుపరి సినిమాలేమిటి?

స) ప్రస్తుతం యుటివి తో కలిసి ఓ సినిమా చేస్తున్నాను. ఆ సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత కొత్త వారితో ఓ సినిమా చేద్దామని అనుకుంటున్నాను.

ప్రశ్న) పల్నాడు సినిమాలో హైలైట్స్ ఏమిటి?

స) ఈ సినిమాలో నా పాత్ర కంటే నాకు తండ్రి పాత్ర చేసిన సీనియర్ డైరెక్టర్ భాగ్యరాజ్ పాత్ర హైలైట్ అవుతుంది. ఆ పాత్ర ఏంటి, ఎలా ఉంటుంది అనేది సస్పెన్స్. అలాగే సినిమా క్లైమాక్స్ 20 నిమిషాలు పెద్ద హైలైట్ అవుతుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ ఆడియన్స్ లో ఏం జరుగుతుందా అనే ఆసక్తిని పెచేస్తుంది. అలాగే క్లైమాక్స్ లో మీరు ఊహించినది మాత్రం జరగదు.

అంతటితో విశాల్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూ ని ముగించాం. దీపావళి కానుకగా రానున్న ‘పల్నాడు’ సినిమా విశాల్ కి మంచి విజయాన్ని అందించాలని కోరుకుందాం.

రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు