ఇంటర్వ్యూ : సంతోష్ శ్రీనివాస్ – హిట్, ప్లాపుల గురించి అస్సలు పట్టించుకోను !

ఇంటర్వ్యూ : సంతోష్ శ్రీనివాస్ – హిట్, ప్లాపుల గురించి అస్సలు పట్టించుకోను !

Published on Sep 29, 2016 2:18 PM IST

Santosh-Srinivas
‘కందిరీగ, రభస’ వంటి కమర్షియల్ ఎంటర్టైనర్స్ ను అందించిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తాజాగా రెండవసారి హీరో రామ్ తో జతకట్టి ‘హైపర్’ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం తాలూకు ట్రైలర్లు, పాటలు సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. ఈనెల 30న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్బంగా సంతోష్ శ్రీనివాస్ తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం…

ప్ర) ‘రభస’ తరువాత చాలా గ్యాప్ తీసుకున్నారు కారణం ?
జ) ఈ గ్యాప్ అంతా సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకోవడానికే తీసుకున్నా. మంచి స్క్రిప్ట్ కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చెయ్యాల్సిందే కదా. స్క్రిప్ పెర్ఫెక్ట్ గా వచ్చాకే చేయబోయే సినిమా మీద నమ్మకం కలుగుతుంది. అప్పుడే సిమియాను అనుకున్నట్టు తీయగలం.

ప్ర) రభస తరువాత రామ్ కోసమే స్క్రిప్ట్ రెడీ చేసి ఎదురుచూశారా ?
జ) రభస తరువాత మధ్యలో రెండు మూడు ప్రాజెక్టుల ఓకే అయ్యాయి. అవి ఇంకా డిస్కషన్స్ లోనే ఉన్నాయి. కానీ ఈ స్క్రిప్ట్ మాత్రం పూర్తిగా రామ్ ను, ఆయన బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకునే రెడీ చేశా.

ప్ర) ఫ్లాప్ తరువాత ఇండస్ట్రీలో మిమ్మల్ని ఎలా చూశారు ?
జ) పెద్దగా డిఫరెన్స్ కనిపించలేదు. అసలు నేను హిట్, ప్లాప్ ని పట్టించుకోను. బన్నీ, రవితేజ, ధరమ్ తేజ్ లాంటి హీరోలు నాతో సినిమా చేయడానికి రెడీ అన్నారు. అలాగే ఇండస్ట్రీలో నా స్నేహితులు కూడా ఎప్పటిలాగే నాతో కలిసే ఉన్నారు.

ప్ర) ‘కందిరీగ’లో రామ్ కి ‘హైపర్’ లో రామ్ కి తేడా ఏమిటి ?
జ) ‘కందిరీగ’లో రామ్ ఒక యువకుడిగా దూకుడుగా ఉంటూ తన ప్రేమను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. ఇందులో మాత్రం ఒక బాధ్యతగల కొడుకుగా తండ్రి కోసం కష్టపడతాడు. అప్పటికీ ఇప్పటికీ ఆయన నటనలో చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఆ మార్పు చూసి నాకే చాలా ఆశ్చర్యం వేసింది.

ప్ర) ఈ సినిమాలో రామ్ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఇందులో రామ్ చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. ప్రతి కొడుకుకి తండ్రి మీద ప్రేమ ఉంటుంది. కానీ దాన్ని ఎవరికీ చెప్పరు, బయటకి చూపరు. అదో అందమైన అనుభూతి. కానీ తండ్రికి ఏమైనా జరిగితే ముందుగా రియాక్ట్ అయ్యేది మాత్రం కొడుకే. అలాంటి పాత్రే ఇందులో రామ్ చేశాడు. ట్యాగ్ లైన్ ‘ప్రతి ఇంట్లో ఒకడుంటాడు’ కి తగ్గట్టు ఇది ప్రతి ఇంట్లో ఉన్న ఒక కొడుకుకి కనెక్టవుంతుంది.

ప్ర) ఇందులో ఏదో సోషల్ మెసేజ్ ఉంటుందన్నారు. ఏమిటది ?
జ) సోషల్ మెసేజ్ అయితే తప్పకుండా ఉంటుంది. ఈ మెసేజ్ కొత్తగా ఉండి సొసైటీకి ఉపయోగపడేదిగా ఉంటుంది. కానీ అది ఏమిటడనేది మాత్రం రేపు సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

ప్ర) 14 రీల్స్ నిర్మాతలతో మీ జర్నీ ఎలా జరిగింది ?
జ) 14 రీల్స్ వాళ్లకి సినిమా చాలా ఇష్టం, తపన. డబ్బు గురించి ఏ మాత్రం ఆలోచించారు. ఒక్కోసారి ఉదయం 6 నుండి రాత్రి 12 వరకు షూటింగ్ జరిగేది. అప్పుడు కూడా మాకు ఏం కావాలంటే అది చేసేవారు. నిజంగా ఇది నా మాతృ సంస్థ. వారి సహకారం ఉండబట్టే సినిమాను మూడున్నర నెలల్లో పూర్తి చేయగలిగా.

ప్ర) మీ సొంత కథలే చేస్తారా.. లేకపోతే రీమేక్ సినిమాలు కూడా చేస్తారా ?
జ) నా కథలు నేనే రాసుకుంటాను. రీమేక్ సినిమా మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. మన దగ్గర కూడా చాలా మంచి కథలున్నాయి. తెలుగు సినిమాల్ని వేరే వాళ్ళు రీమేక్ చేసే స్థాయికి మనం వెళ్ళాలి అన్నదే నా అభిప్రాయం.

ప్ర) ఇందులో రాశి ఖన్నా క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది ?
జ) ఇందులో రాశి ఖన్నా చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది. అంతేగాక ఆమె పాత్రలో వైవిధ్యం కూడా ఉంటుంది. పరిస్థితికి తగ్గట్టు మారుతూ కథకి కనెక్ట్ అయ్యుంటుంది. నటించడానికి స్కోప్ ఉన్న పాత్రలో ఆమె చేసింది. అలాగే పాత్రకి న్యాయం కూడా చేసింది.

ప్ర) మీ సినిమా టైటిల్స్ అన్నీ కాస్త మాస్ సౌండింగ్ తో ఉంటాయి ఎందుకు ?
జ) నాకు సినిమాని పెద్దదిగా చూడటం ఇష్టం. అలాగే భారీగా సినిమాలు తీయాలనుకుంటా. అందుకే నా సినిమాలకు అలాంటి పేర్లే పెడుతుంటా. అవి కమర్షియల్ గా కూడా బాగా ఉపయోగపడతాయి.

ప్ర) సినిమాకి ప్లస్ పాయింట్స్ వేరే ఏమన్నా ఉన్నాయా ?
జ) సినిమాకి స్టోరీ, హీరో రామ్ కాకుండా సత్యరాజ్, విలన్ పాత్ర చేసిన రావు రమేష్ లు పెద్ద అసెట్ అని చెప్పొచ్చు. అలాగే మణిశర్మ గారు అందించిన మ్యూజిక్ వినేటప్పటికన్నా సినిమా చూసేప్పుడు చాలా బాగుంటుంది. ఇవి ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్స్.

ప్ర) ఒక డైరెక్టర్ మీద హిట్, ప్లాప్ ప్రభావం ఉంటుందా? ఉంటే ఎంతవరకూ ఉంటుంది ?
జ) ఈ ఫీల్డ్ లో డైరెక్టర్ మీద హిట్, ప్లాప్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఒక సినిమా హిట్ అయితే మనం అనుకున్న పనులన్నీ చకచకా జరిగిపోతాయి. ఒకవేళ ప్లాప్ అయితే ఆలస్యమవుతూ ఉంటాయి. వాటన్నింటికీ సంతోషంగా తట్టుకుని నిలబడాలంతే.

ప్ర) మీ నెక్స్ట్ సినిమా ఎవరితో చేయాలనుకుంటున్నారు ?
జ) ఎవరితో అనేది ఇంకా అనుకోలేదు. అందరితో చేయాలని ఉంది(నవ్వుతూ). కథలు రెడీ చేస్తున్నా. హీరోలు కూడా నాతో చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ అందరికీ ఒకేసారి టైమ్ కుదరాలి కదా.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు