ఇంటర్వ్యూ : నారా రోహిత్ – ఆ తప్పు మళ్ళీ చేయను!

ఇంటర్వ్యూ : నారా రోహిత్ – ఆ తప్పు మళ్ళీ చేయను!

Published on Jan 4, 2017 12:55 PM IST

nara-rohith
విలక్షణ సినిమాలను ఎంచుకుంటూ హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న నారా రోహిత్, తాజాగా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అంటూ మరో డిఫరెంట్ సినిమాతో వచ్చేశారు. డిసెంబర్ 30న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర్నుంచి ప్రశంసలందుకుంటూ దూసుకుపోతోంది. ఈ సందర్భంగా సినిమాలో నటించడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరించిన నారా రోహిత్‌తో జరిపిన ఇంటర్వ్యూ..

ప్రశ్న) ‘అప్పట్లో ఒకడుండేవాడు’కు ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?

స) చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నిజానికి నేను కూడా ఈ స్థాయి ఆదరణ చూపిస్తారని అనుకోలేదు. అన్నిచోట్ల నుంచీ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ వీకెండ్ వస్తే సినిమా లాభాల బాట పడుతుంది. హీరోగా, నిర్మాతగా ఈ సినిమా నాకొక కొత్త ఎక్స్‌పీరియన్స్.

ప్రశ్న) సినిమాలో తక్కువ నిడివి ఉన్న పాత్రను ఎంచుకున్నారు. ఎందుకని?

స) నేను పాత్ర నిడివి ఎంత ఉందనేది చూసుకోను. ఆ పాత్ర ప్రభావం సినిమాపై ఎంత ఉంటుందన్నదే ముఖ్యం. ఇబ్రహీం అలీ పాత్ర నాకు విపరీతంగా నచ్చింది. మెయిన్ లీడ్ కాకపోయినా, ఈ రోల్ సినిమాపై చూపే ప్రభావం తెలుసు కాబట్టే ఈ సినిమా చేశా. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వంగా కూడా ఉంది.

ప్రశ్న) శ్రీ విష్ణు కోసమే మీరు ఈ సినిమాను నిర్మించారని వినిపిస్తోంది. ఏమంటారు?

స) శ్రీ విష్ణు నాకు చాలా కాలంగా మంచి ఫ్రెండ్. అతడికి ఆ స్థాయి టాలెంట్ లేకపోతే నేను సినిమా నిర్మించేవాడిని కాదు. ఫ్రెండ్‌షిప్ కోసమే ఈ సినిమా చేశాననుకున్నా, ఆ విషయాన్ని కూడా సంతోషంగా తీసుకుంటా.

ప్రశ్న) అప్పట్లో ఒకడుండేవాడు జర్నీ గురించి చెప్పండి?

స) రెండేళ్ళ క్రితం నుంచే ఈ కథపై పనిచేస్తూ వస్తున్నాం. స్క్రిప్ట్‌లో అనుకున్న మార్పులన్నీ చేశాక, పక్కాగా ప్రొడక్షన్‌కి దిగాం. రిలీజ్ మాత్రం జ్యో అచ్యుతానంద వల్ల ఒక రెండు నెలలు, ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ చివరికి ఇప్పటికి అయింది.

ప్రశ్న) 2016 ఎలా గడిచింది?

స) 2016 మిక్స్‌డ్ ఫీలింగ్ తెచ్చిపెట్టింది. ఫెయిలూర్స్ కాస్త ఇబ్బంది పెట్టాయి. ఒకేసారి చాలా సినిమాలు చేస్తూ, ఏది ఏ సినిమానో కూడా పోల్చుకునేలా లేకుండా చేసి ప్రేక్షకులను కన్‌ఫ్యూజ్ చేశా. ఇకపై ఇలాంటి తప్పు చేయకుండా, జాగ్రత్తగా ఎక్కువ సినిమాలు ఒకేసారి చేయకుండా ప్లాన్ చేస్తున్నా.

ప్రశ్న) 2017కి ఏదైనా బలమైన నిర్ణయం తీసుకున్నారా?

స) సన్నబడాలని ఫిక్స్ అయ్యా. ఇప్పటికే ఇందుకోసం ట్రైనింగ్ కూడా మొదలైంది. ఫిబ్రవరిలో కొత్త సినిమా మొదలయ్యే వరకు ఫిట్‌గా అయ్యేలా డైట్, వర్కవుట్ చేస్తున్నా.

ప్రశ్న) భవిష్యత్‌లోనూ సినిమాలు నిర్మిస్తూనే ఉంటారా?

స) తప్పకుండా! ఇప్పటికే శ్రీ విష్ణు హీరోగా ఒక సినిమా నిర్మించా. మంచి కథలొస్తే సినిమాలు నిర్మిస్తూనే ఉంటా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు