రికార్డులపై రాజమౌళి స్ట్రాంగ్ కామెంట్స్!

రికార్డులపై రాజమౌళి స్ట్రాంగ్ కామెంట్స్!

Published on Aug 27, 2015 5:38 PM IST

rajmouli

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘బాహుబలి’ సినిమా దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై 10న పెద్ద ఎత్తున విడుదలై అన్నిచోట్లా సంచలనాలు నమోదు చేసింది. ఒక ప్రాంతీయ సినిమా ఈ స్థాయి విజువల్స్‌తో, ఇంత పెద్ద మార్కెట్‌‌ను సొంతం చేసుకుంటుందా? అని ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తూ బాహుబలి దూసుకుపోయింది. మరో రెండు రోజుల్లో సినిమా 50 రోజులు పూర్తి చేసుకోనుంది.

ఇప్పటికే రికార్డుల మోత మోగించిన ‘బాహుబలి’, తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి కూడా తీసుకెళ్ళి ఘనత చాటింది. అయితే ఇప్పటికీ బాహుబలి సినిమా ఎన్ని థియేటర్లలో 50 రోజులను పూర్తి చేసుకుంటుందీ? అనే ప్రశ్నలు అక్కడక్కడా వినిపిస్తోన్న నేపథ్యంలో రాజమౌళి ఈ విషయంపై సూటిగా స్పష్టంగా సమాధానమిచ్చారు. “ఒకప్పటిలా 50, 100, 150 రోజుల వేడుకలు జరిగే కాలం కాదిదీ. సినిమాను వేల థియేటర్లలో విడుదల చేసినప్పుడు 3-4వారాల వరకే ఆ సినిమా లైఫ్‌టైమ్. ఈ సమయానికల్లా దాదాపుగా సినిమా లాంగ్‌రన్ అనేది పూర్తయిపోతుంది. ఇక్కడే అభిమానులు కొందరు తమ సొంత డబ్బులతో రికార్డుల కోసం పరిగెడతారు. అది చాలా తప్పు. ఇలాంటి రికార్డులతో మనకు ఏమొస్తుంది?” అన్నారు.

ఇదే విషయమై ఇంకా చెబుతూ.. “అభిమానులు, ప్రేక్షకులు జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనంత పెద్ద విజయాన్ని తెచ్చి పెట్టారు. ఇంతకన్నా కావాల్సింది ఇంకేం ఉంటుంది. ఏయే థియేటర్లలో బాహుబలి ఇంకా రెవెన్యూ తెస్తోందో ఆయా థియేటర్లలో సినిమా ఇంకా నడుస్తుంది. ఇక మిగతా థియేటర్లన్నీ కొత్త సినిమాల కోసం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. ఫేక్ రికార్డుల కోసం థియేటర్లను బ్లాక్ చేసే ఆలోచన అస్సలు లేదు” అంటూ రాజమౌళి రికార్డుల విషయమై తన అభిప్రాయాలను ట్విట్టర్‌ను వేదికగా చేసుకొని స్పష్టంగా తేల్చిచెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు