టి.సుబ్బిరామి రెడ్డి ఆత్మీయ సన్మాన సభ విశేషాలు.

టి.సుబ్బిరామి రెడ్డి ఆత్మీయ సన్మాన సభ విశేషాలు.

Published on Sep 26, 2014 6:00 PM IST

Subba-Ramireddy
మంచి వ్యక్తిత్వం, మిత్రుత్వం, దాతృత్వం, దైవత్వం కలిపితే టి.సుబ్బిరామి రెడ్డి. మంచిని గుర్తించడం, మంచిని అభినందించడం, మంచిని అభినందించడం ఆయన లక్షణం. రాజకీయ పరంగా మీమిద్దరం వేర్వేరు పార్టీలలో ఉన్నా మా మధ్య మంచి మిత్రుత్వం ఉంది. ఆధ్యాత్మిక, రాజకీయ, పారిశ్రామిక, కళాత్మక రంగాలలో ఎన్నో ఉన్నత శిఖరాలు సాదించిన వ్యక్తి టి.సుబ్బిరామి రెడ్డి. ఆయన 71 సంవత్సరాలు అర్ధవంతమైన, ఇతరులకు స్పూర్తిదాయకమైన జీవితాన్ని గడిపిన వ్యక్తిని ఆత్మీయంగా సత్కరించాలని నేను చొరవ తీసుకుని ఈ సంధ్యా వేళలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అని అన్నారు కేంద్ర మంత్రివర్యులు వెంకయ్య నాయుడు. కళాబంధు, సాంస్కృతిక రత్న, పార్లమెంట్ సభ్యులు టి.సుబ్బిరామి రెడ్డి 71 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు ప్రముఖులు శుక్రవారం సాయంత్రం ఆయన్ను ఘనంగా సన్మానించారు. ‘టి.సుబ్బిరామి రెడ్డి మీట్ & గ్రీట్’ పేరిట జరిగిన ఈ సన్మాన కార్యక్రమం వెంకయ్య నాయుడి గారి అధ్యక్షతన జరిగింది. హోటల్ పార్క్ హయత్ లో జరిగిన ఈ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు, అపోలో ప్రతాప్ సి రెడ్డి, చిరంజీవి, నాగార్జున, ఏపి మంత్రి గంట శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, మురళీమోహన్, బ్రహ్మానందం, పరుచూరి బ్రదర్స్ లతో పాటు పలువురు ఆధ్యాత్మిక, రాజకీయ, పారిశ్రామిక, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ… సుబ్బిరామి రెడ్డికి అధికారం లేకున్నా మమకారం ఎక్కువ, ఇతరులకు సహకారం అందించాలనే తత్త్వం ఆయనది. రాజకీయంగా మా మధ్య విబేధాలు ఉన్నా వ్యక్తిగతంగా ఎటువంటి విబేధాలు లేవు. ప్రతి రంగంలో ఆయన ఎంతో ప్రగతి సాధించారు. ఎందరికో మార్గదర్శిగా నిలిచారు. నిత్య నూతన యవ్వనం ఆయన సొంతం. 71 వసంతాలు అర్ధవంతమైన జీవితం గడిపిన అటువంటి వ్యక్తిని సన్మానించడం ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఆహ్వానించగానే ఇక్కడకు విచ్చేసిన ప్రముఖులకు చాలా కృతజ్ఞతలు. వయసులో ఆయన కంటే నేను చిన్నవాడిని. అందుకే సుబ్బిరామి రెడ్డి గారు నిండు నూరేళ్ళు జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అని అన్నారు.

చిరంజీవి మాట్లాడుతూ… నాకు టి.సుబ్బిరామి రెడ్డి గారితో 31 సంవత్సరాల పరిచయం. ఈ పరిచయంలో ఆయన ఎందరికో సన్మానించడం చూశాను. కాని, ఈ రోజు మొదటిసారి ఆయనకు సన్మానం జరగడం చూస్తున్నాను. ఇతరులను సన్మానించడం తప్ప ఏనాడు నాకు సన్మానం చేయమని ఆడగని వ్యక్తి సుబ్బిరామి రెడ్డి గారు. 71 సంవత్సరాలు నిండినా ఆయన ముఖం మీద మడత లేదు. వేసుకున్న బట్టలు నలగలేదు. ఆయన అడుగుపెట్టిన ప్రతి రంగంలో విజయం సాదించారు. ఆయన్ను చూస్తే ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. నాకు స్ఫూర్తి ప్రదాత టి.సుబ్బిరామి రెడ్డి అని అన్నారు.

టి.సుబ్బిరామి రెడ్డి మాట్లాడుతూ… నేను 18 ఏళ్ళ వయసులో వ్యాపారం ప్రారంభించాను. అతి తక్కువ సమయంలో కృషి, పట్టుదల, నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలు అధిరోహించాను. ప్రతి రంగంలో అగ్రగామిగా నిలవాలి అనేది నా అభిమతం. ఈతరం యువకులు కూడా అలా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. రాజకీయంగా వేర్వేరు పార్టీలలో ఉన్నా మన తెలుగువాడు, మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు, ఉన్నతమైన వ్యక్తి అని నన్ను సన్మానించిన వెంకయ్య నాయుడికి హాట్స్ ఆఫ్. అధికారం పెరిగిన కొద్ది వెంకయ్యలో ప్రేమ తత్త్వం పెరుగుతుంది. మీ అందరి ప్రేమ, అభిమానం, వాత్సల్యం నా వయసును 10 ఏళ్ళు తగ్గించాయి. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు