సమీక్ష : హోరా హోరీ – రొటీన్ అండ్ బోరింగ్ ప్రేమకథ.!

సమీక్ష : హోరా హోరీ – రొటీన్ అండ్ బోరింగ్ ప్రేమకథ.!

Published on Sep 12, 2015 5:00 PM IST
hora-hori-movie-review

విడుదల తేదీ : 11 సెప్టెంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : తేజ

నిర్మాత : కె.ఎల్ దామోదర్ ప్రసాద్

సంగీతం : కళ్యాణ్ కోడూరి

నటీనటులు : దిలీప్, దక్ష, అశ్విని..

చిత్రం, జయం, నువ్వు-నేను, నిజం సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు తేజ ఆ తర్వాత ఆ రేంజ్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. కాస్త గ్యాప్ తర్వాత తేజ మరో ప్రేమకథతో చేసిన సినిమా ‘హోరా హోరీ’. ‘ఫైట్ ఫర్ లవ్’ అనేది ఈ సినిమాకి ఉపశీర్షిక. అలా మొదలైంది, అంతక ముందు ఆ తరువాత లాంటి సినిమాలను అందించిన కెఎల్ దామోదర ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి కళ్యాణి కోడూరి మ్యూజిక్ అందించాడు. ఈ సారి కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తాను అనే కాన్ఫిడెంట్ తో ఉన్న తేజ ‘హోరా హోరీ’తో తనకు కావాల్సిన సక్సెస్ ని అందుకున్నాడో లేదో అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

హోరా హోరీ.. ఓపెన్ చేస్తే.. మన సినిమాలో విలన్ బసవేశ్వర్(చస్వ) ఒకతన్ని నడిరోడ్డు మీద నరికి చంపేస్తాడు. ఆ కేసు నుంచి బయటకి రావడం కోసం ఒక ఎసిపికి లంచం ఇస్తూ తన చెల్లెలైన మైథిలి(దక్ష)ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడి తననే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. దాంతో తనకి పెళ్లి కానివ్వకుండా తనని పెళ్లి చేసుకోవాలని వచ్చే వారిని చంపేస్తుంటాడు. దాంతో షాక్ లోకి వెళ్ళిపోయిన మైథిలిని తీసుకొని కర్ణాటకలోని సిమోఘ జిల్లాలోని ఆగుంబె ప్రాంతానికి వెళ్ళిపోతారు. అక్కడ మన హీరో స్కంద(దిలీప్) పరిచయం అవుతాడు. అదే ఊర్లో స్కంద తన భామ అంజలి(సీమ)తో ఉంటూ ఒక ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉంటాడు.

కానీ అదే టైంలో పక్క ఊరిలో ప్రింటింగ్ ప్రెస్ వల్ల స్కంద ఇబ్బందుల్లో పడతాడు. ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాల అని ఆలోచిస్తున్న టైంలో స్కందకి మైథిలితో పరిచయం అవ్వడం, ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడడం జరిగిపోతాయి. కట్ చేస్తే మైథిలి ఎక్కడికి వెళ్ళిందా అని వెతుకుతున్న బసవేశ్వర్ అదే ఊరికి రావడం జరుగుతుంది. అక్కడ బసవేశ్వర్ కి స్కందతో పరిచయం పెరిగి బాగా క్లోజ్ అవుతారు. కట్ చేస్తే కథలో అసలు ట్విస్ట్ ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నాం అనే విషయం తెలియడం. అక్కడి నుంచి కథ ఎలాటి మలుపులు తిరిగింది.? చివరికి మైథిలి ఎవరి వశం అయ్యింది అనే విషయాన్ని మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

మునుపెన్నడూ షూట్ చేయని కర్ణాటకలోని సిమోఘ జిల్లాలోని ఆగుంబె అనే నిత్యం వర్షం కురిసే ప్రాంతంలో ఈ సినిమాని షూట్ చెయాడం వలన విజువల్స్ పరంగా, బ్యాక్ డ్రాప్ పరంగా సినిమాకి ఓ కొత్తదనం వచ్చింది. అక్కడి అందమైన లొకేషన్స్ ని సినిమాటోగ్రాఫర్ ఇంకా అద్భుతంగా బంధించాడు. మునుపెన్నడూ చూడని విజువల్స్ కావడంతో ఆడియన్స్ కి ఆ విజువల్స్ ఓ కొత్త అనుభూతిని కలిగించడమే ఈ సినిమాకి ప్రధాన హైలైట్. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ కి కళ్యాణ్ కోడూరి వినసొంపైన సంగీతం, నేపధ్య సంగీతం తోడవడం సినిమాకి మరో హైలైట్.

ఇక నటీనటుల విషయానికి వస్తే అందరూ కొత్తవారే కావడం వలన మెయిన్ రోల్స్ చేసిన వారి గురించి చెప్పుకుందాం.. హీరోగా పరిచయం అయిన దిలీప్ తన పాత్రకి సరిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. న్ని సీన్స్ లో తేజ అతని నుంచి మంచి నటననే రాబట్టుకున్నాడు. ఇక నటీనటుల్లో కల్లా ది బెస్ట్ పెర్ఫార్మార్ అనిపించుకుంది మాత్రం హీరోయిన్ దక్ష. తన లుక్ తో, క్యూట్ నెస్ తో ప్రేక్షకులను తనవైపు ఆకర్షించుకోవడమే కాకుండా, యువతని తన మత్తులో పడేసుకుంటుంది. కేవలం లుక్స్ పరంగానే కాకుండా తన నటనతో ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ లో తన పెర్ఫార్మన్స్ సూపర్బ్. ఇక సినిమాలో గ్లామర్ డాల్ గా కనిపించిన అశ్విని ఫస్ట్ హాఫ్ లో తన అందచందాలతో ఆకట్టుకుంది. విలన్ గా చేసిన చస్వ మంచి నటనని కనబరిచాడు. హీరోకి నానమ్మగా కనిపించిన సీమ తన పాత్రకి న్యాయం చేసింది. పోలీస్ ఆఫీసర్ గా చేసిన అభిరామ్ కూడా బాగానే చేసాడు.

ఓవరాల్ గా సినిమాకి బాగా హెల్ప్ అయ్యే పాయింట్స్ దగ్గరికి వస్తే.. సినిమా ఫస్ట్ హాఫ్ లో జబర్దస్త్ ఫేం రాకింగ్ రాకేష్ – రాకెట్ రాఘవ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ మరియు వారి సోలో సీన్స్ ఆడియన్స్ ని బాగా నవ్విస్తాయి. అలాగే రచ్చ రవి అడిగే ప్రశ్నలు కూడా బాగుంటాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా పరంగా మిస్టేక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ప్రధానంగా మూడు విషయాలు చెప్పాలి.. కథ – కథనం – నేరేషన్.. కథ- ఈ కథకి దగ్గరగా ఉండే కథలని మనం ఇప్పటికే తేజ తీసిన సినిమాల్లోనే చూసాం. కానీ బ్యాక్ డ్రాప్ మాత్రమే కొత్తగా ఉంటుంది. అంతే తేడా..దానికి తోడు కథనంలో మొదటి 30 నిమిషాల్లోనే కథ ఎలా ఎండ్ అవుతుంది అనే ఐడియాని ఆడియన్స్ కి ఇచ్చేయడం వల్ల మిగతా ట్విస్టులు ఏవీ సినిమాకి వర్కౌట్ అవ్వలేదు. సో కథనం అంతా ఊహాజనితంగా తయారైంది. సరే కథనం ఊహాజనితంగా ఉన్నా సినిమా నేరేషన్ అన్నా స్పీడ్ గా ఉందా అంటే అదీ లేదు. సినిమా మొదటి నుంచి చివరి దాకా స్లోగా సాగుతుంది. దాంతో ఆడియన్స్ బోర్ ఫీలవుతారు.

అలాగే సినిమాకి 159 నిమిషాల రన్ టైం అనేది చూసే ఆడియన్స్ కి చాలా ఎక్కువ అనిపిస్తుంది. మీరు కథని పూర్తిగా చెప్పడంలో తప్పులేదు. కానీ బోరింగ్, సాగిపోతోంది అనిపించుకున్నప్పుడు అన్నా కట్ చేసుండాల్సింది. ఇక సెకండాఫ్ లో హీరోకి తెలియకుండా విలన్, విలన్ కి తెలియకుండా హీరో ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నారు అనే ఫార్మాట్ ని ఇదివరకే చూసాం. దీనితో పాటు సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ కూడా తక్కువ కావడంతో చాలా చోట్ల ఆడియన్స్ కి బోర్ కొడుతుంది. అలాగే తేజ సినిమాల్లో ఒక ఎమోషన్ అన్నా క్యారీ అవుతూ ఉంటుంది, కానీ ఇందులో ఏ ఎమోషన్ కి కంటిన్యుటీ లేదు అన్నీ పార్ట్స్ పార్ట్స్ గా అక్కడక్కడా బాగున్నాయి కానీ అన్నీ అతికిస్తే దేనికవే అన్నట్టు ఉన్నాయి. అలాగే తేజ సినిమాల్లో ఉండే స్ట్రాంగ్ హీరో, విలన్ క్యారెక్టరైజేషన్స్ ఇందులో కనిపించలేదు.

సాంకేతిక విభాగం :

పైన ప్లస్ పాయింట్స్ లో చెప్పినట్టు దీపక్ భగవంత్ సినిమాటోగ్రఫీ సినిమాకి మేజర్ హైలైట్ అయ్యింది.. ఎలాంటి లైటింగ్ ఎఫెక్ట్స్ లేకుండా, రియల్ లైటింగ్ మరియు రెయిన్ ఎఫెక్ట్ లో షూట్ చేసిన ఈ విజువల్స్ సింప్లీ సూపర్బ్. కచ్చితంగా విజువల్స్ ఆడియన్స్ కి ఓ కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఇక కళ్యాణ్ కోడూరి మ్యూజిక్ చాలా పెద్ద హిట్ అయ్యింది. సినిమాలో కూడా పాటలు సందర్భానుసారంగా వచ్చి మంచి ఫీల్ నే ఇచ్చాయి. అవి పక్కన పెడితే కళ్యాణ్ కోడూరి అందించిన నేపధ్య సంగీతం సినిమాకి మరో హైలైట్. జునైద్ ఎడిటింగ్ చెప్పుకునేంత లేదు, ఓవరాల్ గా ఇంకాస్త కేర్ తీసుకొని కొంత కట్ చేసి ఉంటే బాగుండేది. పాంథర్ ఫైట్స్ డీసెంట్ గా ఉన్నాయి.

ఇక ఈ సినిమాకి కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం విభాగాలను డీల్ చేసింది తేజ.. కథ – ఓవరాల్ గా చూసుకుంటే ఎప్పుడూ ఆయనే చెప్పే ప్రేమకథల్లానే ఉంటుంది, కానీ ఈ ప్రేమ కథకి ఆయన ఎంచుకున్న నేపధ్యం కొత్తగా ఉంది. కథనం – మొదటి అర్ధభాగాన్నికాస్తలో కాస్త పరవాలేధనిపించినా సెకండాఫ్ ని మాత్రం సరిగా డీల్ చెయ్యలేదు. మాటలు – బాగున్నాయి, కామెడీ ఎపిసోడ్స్ జస్ట్ ఓకే. దర్శకత్వం అనే విషయానికి వస్తే తేజ ఎంత ఇబ్బంది అన్నా పెట్టి నటీనటుల నుంచి సూపర్బ్ పెర్ఫార్మన్స్ రాబట్టుకుంటాడు. ఆ విషయంలో కొంతమేర సక్సెస్ అయ్యాడు. కానీ అనుకున్న కథని పూర్తి ఎంగేజింగ్ గా ఆడియన్స్ కి చెప్పడంలో మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. కెఎల్ దామోదర ప్రసాద్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాని లో బడ్జెట్ లో, లిమిటెడ్ టైంలో తీసినా ఆ ఫీలింగ్ మాత్రం ఆడియన్స్ కి ఎక్కడ కలగకుండా ఓ మంచి రిచ్ సినిమా చూసాం అనే ఫీలింగ్ ని కలిగించింది.

తీర్పు :

ఎలాగైనా ఈ సారి ఓ మంచి హిట్టాలని తేజ, అలాగే తేజ ఈ సారి మంచి హిట్ సినిమా తీస్తాడని ఎదురు చూసిన ప్రేక్షకులకు ‘హోరా హోరీ’ సినిమా కూడా ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. హోరా హోరీ సినిమా ఎక్కువ భాగం జయం సినిమాకి సిమిలర్ గా ఉందని ఆడియన్స్ ఫీలవ్వడం బాగా మైనస్ అయ్యింది. సినిమాలో అక్కడక్కడా కనిపించే తేజ మార్క్ సీన్స్, లొకేషన్స్, దక్ష పెర్ఫార్మన్స్, మ్యూజిక్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్. నేపధ్యం కొత్తదైనా కథ పాతదవ్వడం, స్లో అండ్ బోరింగ్ గా సాగే కథనం, ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అవ్వడం, బాగా ఎక్కువగా అనిపించే రన్ టైం, చాలా చోట్ల తన పాత సినిమాల్లానే అనిపించే ఫీలింగ్ చెప్పదగిన మైనస్ పాయింట్స్. జయం సినిమాకి సిమిలర్ గా ఉన్న హోరా హోరీ కథని మరింత బోరింగ్ గా చెప్పడం వలన థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు నిరాశ పడతారు.

123తెలుగు రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు