సమీక్ష : రైల్ – అదుపుతప్పిన ‘లవ్ రైల్’!!

సమీక్ష : రైల్ – అదుపుతప్పిన ‘లవ్ రైల్’!!

Published on Sep 23, 2016 7:18 PM IST
Rail review

విడుదల తేదీ : సెప్టెంబర్ 22, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : ప్రభు సాల్మన్

నిర్మాత : ఆది రెడ్డి, ఆదిత్య రెడ్డి

సంగీతం : డి. ఇమాన్

నటీనటులు : ధనుష్, కీర్తి సురేష్..

తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో హీరో ధనుష్‌కు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తమిళంలో స్టార్ హీరోల్లో ఒకరుగా చలామణీ అవుతూ వస్తోన్న ధనుష్, తెలుగులోనూ డబ్బింగ్ సినిమాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. ఇక తాజాగా ఆయన హీరోగా నటించిన ‘తొడరి’ అనే సినిమా తెలుగులో ‘రైల్’ అన్న టైటిల్‌తో డబ్ అయి ఒకేసారి తమిళ వర్షన్‌తో పాటే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ రైల్ ఎలా ఉందో చూద్దాం..

కథ :

బల్లి శివాజీ (ధనుష్) రైల్వేలోని పాంట్రీలో టీ, టిఫిన్ సప్లయర్‌గా పనిచేస్తూంటాడు. తన ఉద్యోగ రీత్యానే ఢిల్లీ నుంచి చెన్నై వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌లో శివాజీ, సరోజ (కీర్తి సురేష్)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. సరోజకు ఉన్న ఇష్టాలను తెలుసుకొని, ఆమెకు కొన్ని అబద్ధాలను చెప్పి దగ్గరవుతాడు. తర్వాత శివాజీ చెప్పిన అబద్ధాలు తెలుసుకొని సరోజ అతడికి దూరమవుతుంది. కాగా, ఇదే సమయంలో కొన్ని అనుకోని పరిస్థితుల్లో రైలు అదుపుతప్పి ఎవరూ ఆపలేని పరిస్థితులకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏమైంది? రైలు ఏ ప్రమాదానికీ గురి కాకుండా ఎవరు కాపాడారు? శివాజీ, సరోజల ప్రేమకథ ఏమైందీ? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ అంటే అంతా రైలులోనే జరిగే కథతో ఓ ప్రేమకథ చెప్పాలన్న ప్రయత్నం అనొచ్చు. కథకు సంబంధించిన అసలైన ఎమోషన్ చివరివరకూ బాగానే క్యారీ అయింది. ఫస్టాఫ్‌లో పాంట్రీ నేపథ్యంలో వచ్చే కామెడీ, ధనుష్ అండ్ గ్యాంగ్ చేసే కామెడీ చాలా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తంబి రామయ్య కామెడీ చాలాచోట్ల సినిమాను నిలబెట్టింది. చిన్న చిన్న సన్నివేశాలతోనే బాగా నవ్వించే చాలా సన్నివేశాలను ఫస్టాఫ్‌లో చూడొచ్చు. రైలులో ఓ మినిస్టర్ క్యారెక్టర్‌ను పెట్టడం, మీడియా హడావుడిపై సెటైర్స్, కథను మలుపు తిప్పే సన్నివేశాల్లో ఎమోషన్ ఇవన్నీ చాలా బాగా ఆకట్టుకున్నాయి.

ధనుష్ ఎప్పట్లానే తన ఎనర్జీతో సినిమాను నడిపించాడు. ముఖ్యంగా పాత్ర అవసరాన్ని మించకుండా, లుక్స్, యాక్టింగ్ విషయంలో ఆయన మరోసారి తన స్థాయికి తగ్గ నటన ప్రదర్శించాడు. కీర్తి సురేష్ డీ గ్లామర్ రోల్‌లో చాలా బాగా ఆకట్టుకుంది. ఇక గణేష్ వెంకట్రామన్, తంబిరామయ్య లాంటి మిగతా నటీనటులంతా తమ పరిధిమేర బాగా చేశారు. ఇంటర్వెల్ బ్యాంగ్‌ను మేజర్ హైలైట్స్‌లో ఒకటిగా చెప్పొచ్చు.

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్‌లో కథంతా దారితప్పడమే ఈ సినిమాకు మైనస్ పాయింట్. ఒక రైలు అదుపుతప్పి వందల ప్రాణాలు పోయే పరిస్థితుల్లో, ఆయా సన్నివేశాల ఎమోషన్‌ను కాకుండా వేరేదో కామెడీ ఇరికించడానికి చేసిన ప్రయత్నం బాగోలేదు. ఇక సెకండాఫ్ అంతా లాజిక్ అన్నదే లేకుండా సాగిపోతుంది. రైలు ప్రమాదానికి గురయ్యే సమయానికి తీసుకునే చర్యలు, హీరోచిత ఫైట్లు అన్నీ ఓవర్ అనిపించాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అంతా రైలు పై భాగంలోనే నడుస్తూ ఉంటుంది. అక్కడ వచ్చే సన్నివేశాలు కూడా లాజిక్‌ను పక్కనపడేశాయి. ఇక హీరో, హీరోయిన్ల లవ్‌ కూడా క్లారిటీగా లేదు.

సెకండాఫ్‌లో ఓ కమాండర్ పగ తీర్చుకోవడం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా ఓవర్ అనిపించాయి. రెండున్నర గంటలకు పైనే ఉన్న రన్‌టైం కూడా ఓ మైనస్‌గానే చెప్పాలి. కథ అవసరానికి మించి పాటలు, కామెడీ పెట్టి అనవసరంగా ఎక్కువ లెంగ్త్‌కు సినిమాను తీసుకెళ్ళారు. దీంతో చాలాచోట్ల సినిమా బోరింగ్‌గా తయారైంది. విజువల్ ఎఫెక్ట్స్ స్థాయి ఏమాత్రం బాగోలేదు. ఇండియన్ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా వండర్స్ చేస్తోన్న ఈ కాలంలో ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేవనిపించింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే ముందుగా దర్శకుడు ప్రభుసాల్మన్ తనకు బాగా అలవాటైన ప్రేమకథని చెప్పడం కోసం ఎంచుకున్న నేపథ్యం చాలా కొత్తది. దానికి తగ్గ ఎమోషన్‌తో ఒక మంచి అసలు కథను కూడా సిద్ధం చేసుకున్నా, సెకండాఫ్‌లో ఆ కథను పూర్తిగా పక్కదారి పట్టించి విఫలమయ్యాడు. దర్శకుడిగా ప్రభుసాల్మన్ మేకింగ్ కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది. ఇదే కథను ఇంకొంచం జాగ్రత్తగా రాసుకొని ఉంటే సినిమా వేరేలా ఉండేదేమో!

డి.ఇమ్మాన్ అందించిన పాటలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ సన్నివేశాల్లో మాత్రం సినిమాటోగ్రఫీ లోపం కూడా కనిపించింది. ముందే చెప్పినట్టు విజువల్ ఎఫెక్ట్స్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. తెలుగు డబ్బింగ్ పనులు బాగానే ఉన్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్‌ బాగున్నాయి. ఎడిటింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.

తీర్పు :

ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుంటారు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఒకరికొకరు దూరమవుతారు. అప్పుడే ఒక పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. ఆ తర్వాత ఈ ప్రేమకథ చాలా మలుపులు తిరుగుతుంది. ఇలాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చి ఉంటాయి. ‘రైల్‌’లో ఉన్న కొత్తదనం ఏంటంటే కథంతా ఒక రైలు ప్రయాణంలోనే జరగడం. కథలోని అసలైన ఎమోషన్, అక్కడక్కడా నవ్వించే సన్నివేశాలు, ధనుష్, కీర్తి సురేష‌ల నటన లాంటి ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమాలో సెకండాఫ్‌ దారితప్పడమన్నది అసలైన మైనస్. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ లవ్ ‘రైల్’ కొద్దిదూరం బాగానే ప్రయాణించి, ఆ తర్వాత పూర్తిగా అదుపుతప్పింది!

123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు