సమీక్ష : రాజా ది గ్రేట్ – కథ తక్కువైనా ఎంటర్టైన్మెంట్ బాగుంది

సమీక్ష : రాజా ది గ్రేట్ – కథ తక్కువైనా ఎంటర్టైన్మెంట్ బాగుంది

Published on Oct 19, 2017 4:35 PM IST
Raja the Great movie review

విడుదల తేదీ : అక్టోబర్ 18, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : అనిల్ రావిపూడి

నిర్మాత : దిల్ రాజు

సంగీతం : సాయి కార్తీక్

నటీనటులు : రవితేజ, మెహ్రీన్ కౌర్

దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత రవితేజ నుండి వస్తున్న చిత్ర్రం ‘రాజా ది గ్రేట్’. ఈ సినిమాతో మాస్ మహారాజ ఎలాంటి కమ్ బ్యాక్ ఇస్తాడో చూడాలని అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి ఉంది. మరి ఇన్ని అంచనాల నడుమ ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

సిన్సియర్ పోలీసాఫీసర్ (ప్రకాష్ రాజ్) కూతురే లక్కీ. ప్రకాష్ రాజ్ ఒక కేసు విషయమై విలన్ దేవ తమ్ముడిని చంపేస్తాడు. ప్రాణంగా చూసుకునే తమ్ముడిని చంపడంతో పగ పెంచుకున్న దేవ ప్రకాష్ రాజ్ ను చంపేసి, అతని కూతురు లక్కీని కూడా చంపాలని ట్రై చేస్తుంటాడు. కానీ లక్కీ మాత్రం అతన్ని నుండి తప్పించుకుని దూరంగా వెళ్ళిపోతుంది.

అదే సమయంలో చూపులేని రాజా (రవితేజ) పోలీస్ అవ్వాలనే యాంబిషన్ తో పోలీసులతో కలిసి ఆమెను కాపాడే మిషన్ లో దిగుతాడు. ఇక అక్కడి నుండి రవి తేజ చూపు లేకపోయినా ఆమెను ఎలా కాపాడాడు, దేవాను ఎలా ఎదిరించాడు అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ కథలో హీరో రవితేజకు చూపలేకపోవడమే. ఇప్పటి వరకు హీరో సినిమా మొత్తం చూపులేకుండానే ఉండటమనేది కొత్త ప్రయోగమనే చెప్పాలి. ఆ ప్రయోగాన్ని చాలా వరకు పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. హీరో రవి తేజ కూడా చూపులేని వ్యక్తిగా చాలా ఖచ్చితత్వంతో నటించాడు. ఏ సన్నివేశంలోనూ, ఫ్రేమ్ లోను తేడా జరక్కుండా హీరోకు నిజంగానే చూపులేదు అనే భావన కలిగించేశాడు. ఇక ఎప్పటిలాగే ఎనర్జిటిక్ బాడీ లాంగ్వేజ్ తో, మాసీ మ్యానరిజంతో స్క్రీన్ మీద అల్లరల్లరి చేసేశాడు.

దర్శకుడు అనిల్ మొదటి నుండి నమ్ముకున్న ఎంటర్టైన్మెంట్ నే ఈ సినిమాలో కూడా చూపించి చాలా చోట్ల హాయిగా నవ్వుకునేలా చేశాడు. పుట్టుకతోనే అంధుడైన వ్యక్తి పట్టుదలతో అన్నింటిలోనూ శిక్షణ తీసుకుని పెరిగి పెద్దైతే ఎంత పవర్ ఫుల్ గా ఉంటాడో చూపించాడు. హీరో పాత్రలో కాన్ఫిడెన్స్ తప్ప బాధ అనేదే కనబడలేదు. ఇక కథనం విషయానికొస్తే ఫస్టాఫ్ మొత్తాన్ని తీసుకున్న కొద్దిగా కథతో, హీరో పాత్రతో, దాని చుట్టూ ఎంటర్టైన్మెంట్ తో నడిపి ఆహ్లాదాన్ని కలిగించిన అనిల్ రావిపూడి సెకండాఫ్లో సైతం దాన్నే కొనసాగించడానికి ట్రై చేశాడు.

ముఖ్యంగా హీరోకి మంచి ఎలివేషన్ సీన్స్, ఫైట్స్ పెట్టి మాస్ జనాల్ని సంతృప్తిపరచాడు. పైగా మథర్ సెంటిమెంట్ ను కూడా బాగానే పండించి ఫ్యామిలీ ఆడియన్సుకి నచ్చేలా చేశాడు. విలన్ పాత్ర, అందులో వివన్ నటన మెచ్చుకోదగ్గవిగా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో కొద్దిగా మాత్రమే కథ ఉండటం అది కూడా రొటీన్ కథే అయ్యుండటం నిరుత్సాహాన్ని కలిగించింది. సినిమా మొదటి అరగంటలోనే కథ మొత్తం రివీల్ అయిపోవడంతో ఎప్పుడు, ఎక్కడ, ఏం జరుగుతుందో సులభంగా ఊహించేయొచ్చు. దీంతో ఎంటర్టైన్మెంట్ తప్ప ఎగ్జైట్మెంట్ ఎక్కడా దొరకలేదు. ఇక ఫస్టాఫ్ బాగానే అనిపించగా సెకండాఫ్ మాత్రం లాగినట్లు తోచింది.

కొన్ని సన్నివేశాలైతే రిపీటైనట్టు, లాజిక్ లేనట్లు అనిపించాయి. ఫన్నీ సీన్స్ లో తప్ప మిగతా చోట్ల కథనం కొంత బరువుగానే నడిచింది . ఇక 2 గంటల 29 నిముషాల రన్ టైమ్ కూడా కొద్దిగా భారంగానే ఉంది. నిజానికి అంత రన్ అవసరం లేదు కూడా. కావాలనే కొన్ని సన్నివేశాలని పెట్టి క్లైమాక్స్ ను పొడిగించారు. పాటలు కూడా ఏమంత గొప్పగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా చివిరి పాటైతే చిరాకు పెట్టింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు అనిల్ రావిపూడి ఒక మాదిరి కథను మాత్రమే తీసుకుని దానికి ఎంటర్టైనింగా, కొత్తగా అనిపించే హీరో పాత్రను జోడించి, ఆ పాత్రకు మంచి చాయిస్ అయిన రవితేజను ఎంచుకుని సినిమాను లాగించేశాడు. దీంతో కథ, కథనాలు పరంగా కాస్త అసంతృత్తి దొర్లినా ఎంటర్టైన్మెంట్, హీరో పాత్ర ద్వారా సంతృప్తి కలిగింది. కానీ ఎక్కడో కథను ఇంకొంత కొత్తగా, బలంగా రాసుకుని ఉంటే ఇంకా బాగుండేది కదా అనే భావన కలిగింది.

ఇక సంగీతీ దర్శకుడు సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా పాటలు సంగీతం అంతగా మెప్పించలేదు. మోహన్ కృష్ణ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ద్వారా సెకండాఫ్ చివరను కాస్త ట్రిమ్ చేసుండాల్సింది. ఎప్పటిలాగే నిర్మాత దిల్ రాజు తన నిర్మాణ విలువల్ని చాటుకున్నారు. అంధుడైన హీరో పాత్రకు లాజికల్ గా కంపోజ్ చేసిన ఫైట్స్ బాగున్నాయి.

తీర్పు :

‘రాజా ది గ్రేట్’ చిత్రం రవితేజకు మంచి కామ్ బ్యాక్ అని చెప్పాలి. మాస్ ప్రేక్షకుల్ని, ఫ్యామిలీ ఆడియన్సుని ఆకట్టుకునేలా ఉన్న కథానాయకుడి పాత్ర, రవితేజ నటన, మథర్ సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో మెప్పించే అంశాలు కాగా కొత్తదైన కథ లేకపోవడం, కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు ఉండటం, అనవసరమైన సన్నివేశాలతో సెకండాఫ్ ను సాగదీయడం నిరుత్సాహపరిచే అంశాలుగా ఉన్నాయి. మొత్తం మీద కథ తక్కువైనా మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న ఈ చిత్రం మాస్, ఫ్యామిలీ ఆడియన్సుకి నచ్చుతుంది.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు