సమీక్ష : రొమాన్స్ విత్ ఫైనాన్స్ – హోప్ లెస్ రొమాన్స్

సమీక్ష : రొమాన్స్ విత్ ఫైనాన్స్ – హోప్ లెస్ రొమాన్స్

Published on Mar 18, 2016 9:59 PM IST
Drusya kavyam review

విడుదల తేదీ : 18 మార్చ్ 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : రాజు కుంపట్ల

నిర్మాత : జనార్థన్ మండుముల

సంగీతం : జాన్ పొట్ల

నటీనటులు : మెరీన అబ్రహం, సతీష్ బాబు

బాగుందన్న టాక్ వస్తే తక్కువ బడ్జెట్ సినిమాలకు ఆదరణ బాగానే కనిపిస్తోన్న నేపథ్యంలో అదే బాటలో చాలా చిన్న సినిమాలు థియేటర్లకు వచ్చేస్తున్నారు. తాజాగా అలా వచ్చిన మరో చిన్న బడ్జెట్ సినిమాయే ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’. ఈ రోజే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం..

కథ :

ఈ సినిమా కథ విషయానికొస్తే చాలా సాధారణమైన కథ. జై (సతీష్ బాబు) అనే కాలేజీ కుర్రాడు చైత్ర (మెరీన అబ్రహం) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. కాలక్రమంలో చైత్ర కూడా జైను ఇష్టపడుతుంది. అలా వీళ్ళిద్దరూ హాయిగా గడుపుతున్న సమయంలో మంచి టైమ్ చూసుకుని జై చైత్రకు తన ప్రేమను చెబుతాడు. కానీ విచిత్రంగా చైత్ర అతని ప్రేమను కాదంటుంది.

జైను అంతగా ఇష్టపడ్డ చైత్ర అతని ప్రేమనెందుకు కాదంది..? జై తో చైత్రకున్న సమస్యేంటి..? ఆ సమస్యలన్నింటినీ దాటుకుని జై, చైత్ర ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమా మొత్తానికి పెద్ద ప్లస్ పాయింట్ అంటే హీరోయిన్‌గా చేసిన ‘మెరీన అబ్రహం’ అనే చెప్పాలి. డీసెంట్ గా కనిపిస్తూ ఆమె చేసిన నటన బాగుంది. కాలేజ్ లో అమెపై వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను బాగా చూపించారు.

ఇక ఆశ్చర్యంగా ఈ సినిమా సంగీతం కూడా బాగానే ఉంది. ఇంటర్వెల్ సన్నివేశాలకు సంగీత దర్శకుడు అందించిన సంగీతం బాగానే వర్కవుటైంది. హీరో స్నేహితుడి పాత్రలో నటించిన వ్యక్తి తన పాత్రకు న్యాయం చేశాడు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధానమైన కథ లేకపోవడమే ఈ సినిమాలో పెద్ద మైనస్ పాయింట్. హీరో హీరోయిన్‌కు ప్రపోజ్ చేయడం, హీరోయిన్ సిల్లీ కారణం వల్ల అతని ప్రేమను రిజక్ట్ చేయడం, పైగా ఆ సిల్లీ కారణం కూడా బాగా విసుగు పుట్టే సమయంలో రివీల్ చేయడం అనేవి ప్రేక్షకులకు అసహనాన్ని తెప్పిస్తాయి.

సినిమాకి తీసుకున్న అంశం చాలా చిన్నది. ఎంత చిన్నదంటే ఓ షార్ట్ ఫిల్మ్ తీయడానికి కూడా సరిపోనంత చిన్నది. ఆఖరి 10 నిముషాలు మినహాయిస్తే మిగతా సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. హీరో హీరోయిన్ల మధ్య ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా కెమిస్ట్రీ అస్సలు వర్కవుట్ కాలేదు. సినిమా రెండవ భాగంలో హీరోయిన్ పాత్రను ఎందుకు తగ్గించారో అర్థం కాదు. హీరో హీరోయిన్లు నటనలో ఇంకా శిక్షణ తీసుకోవాల్సి ఉంది. హీరో తన పాత్రకు చెప్పుకున్న డబ్బింగ్ కూడా ఘోరంగా ఉంది.

సాంకేతిక విభాగం :

ముందుగా చెప్పినట్టు సంగీతం బాగుంది. అన్ని పాటలనూ బాగానే కంపోజ్ చేశారు సంగీత దర్శకుడు. నిర్మాణ విలువలు ఫరవాలేదనిపించాయి. విజువల్స్ పరంగా చూసుకుంటే కెమెరా పనితనం బాగుంది.

ఇక దర్శకుడు రాజు కుంపట్ల కథ చెప్పిన విధానం భయంకరంగా ఉంది. కథాంశం చిన్నదే అయినప్పటికీ దానికి కాస్త ఎంటర్టైన్మెంట్ జోడించి కథ చెప్పుండాల్సింది. కానీ దర్శకుడు అలా చేయకుండా కథని సాగదీస్తూ పాత్రలను నడిపిన విధానం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది.

తీర్పు :

‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’ అనే ఈ సినిమా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో కెల్లా అర్థం లేని, సాగాదీయబడ్డ సినిమా. హీరోయిన్ మెరీన అబ్రహంను మినహాయిస్తే మిగిలిన కథాంశం, పాత్రలు, కథను చెప్పిన విధానం అన్నీ కలగాపులగంగా ఉండి ప్రేక్షకులను కన్ఫ్యూజన్ లో వదిలేస్తాయి. థియేటర్లకు వెళ్లి కాదు కదా టీవీల్లో వేసినా కూడా ఈ సినిమాను చూడనవసరం లేదు.

123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు