అప్పుడు బాలకృష్ణ.. ఇప్పుడు నాని..!

అప్పుడు బాలకృష్ణ.. ఇప్పుడు నాని..!

Published on Mar 19, 2015 1:00 PM IST

Nani1
సినిమా అనేది కళాకారుల సమూహమంతా కలిసి నిర్మించుకునే ఒక కళారూపం. ఆ కళారూపాన్ని సమూహంలోని కథానాయకుడు, దర్శకుడు ముందుండి నడిపిస్తారనడంలో అతిశయోక్తి లేదు. మరి ఓ కథానాయకుడు ఎంతో శ్రమించి నటించే ఈ కళారూపాల్లో.. రెండు ఒకేసారి విడుదలైతే ? ప్రేక్షకుడు దేని వైపు మొగ్గు చూపాలి ? ప్రేక్షకుడి సంగతి పక్కనబెడితే ఆ నటుడు ఏ సినిమా వైపు మొగ్గు చూపాలి ? అన్నది ప్రశ్న. ఇప్పుడు ప్రస్తుతం నానిది అదే పరిస్థితి. ఆయన ఎంతగానో ప్రేమించి చేసిన ‘జెండాపై కపిరాజు’ ఎప్పట్నుంచో విడుదలకు నోచుకోకుండా ఉంది. ఎట్టకేలకు ఇప్పటికి ఆ సినిమా విడుదలకు అవకాశం చిక్కింది. ఈనెల 21న ఉగాది రోజున ఈ సినిమా విడుదల కానుంది. ఇక విచిత్రంగా నాని నటించిన ప్రయోగాత్మక చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’ కూడా 21నే విడుదల కానుంది.

ఇలా ఒక హీరోకి సంబంధించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవ్వడం కొత్తేమీ కాకున్నా, ఎంత సూపర్ హిట్ సినిమా అయినా మూడు వారాలకు మించి నడిచే పరిస్థితి లేని ఈ రోజుల్లో ఇది సాహసమనే చెప్పాలి. గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా 1993లో రెండు సినిమాలు ఒకేరోజు విడుదలయ్యాయి. నిప్పురవ్వ, బంగారు బుల్లోడు పేర్లతో తెరకెక్కిన రెండు సినిమాలు ఒకేరోజున విడుదలయ్యాయి. అనూహ్యంగా ఆ రెండు సినిమాలూ మంచి విజయం సాధించాయి. మళ్ళీ ఇన్నాళ్ళకు ఒక హీరో ఒకేరోజు రెండు సినిమాలతో మన ముందుకు రానున్నాడు. మరి.. నాని కూడా బాలయ్యలా రెండు సినిమాలనూ విజయాల బాట పట్టిస్తాడా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు