ఇంటర్వ్యూ : పూరి జగన్నాధ్ – రాంబాబు సినిమా స్టొరీ ఫస్ట్ రవితేజకి చెప్పాను

ఇంటర్వ్యూ : పూరి జగన్నాధ్ – రాంబాబు సినిమా స్టొరీ ఫస్ట్ రవితేజకి చెప్పాను

Published on Oct 9, 2012 11:30 PM IST


పన్నెండు సంవత్సరాల క్రితం పూరి జగన్నాధ్ అంటే ఇండస్ట్రీలో ఉన్న కొంత మందికి తప్ప అతనెవరో చాలా మందికి తెలియదు. ఇప్పుడు పూరి జగన్నాధ్ అంటే అంటే తెలియని వారు ఉండరు. 2000 సంవత్సరంలో మొదటి సినిమానే పవన్ కళ్యాణ్ తో బద్రి అనే సినిమా చేసి లక్కీ ఛాన్స్ కొట్టిన పూరి దాదాపు పన్నెండు సంవత్సరాల తరువాత మళ్లీ అదే పవన్ కళ్యాణ్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా చేసాడు. ఈ నెల 18న విడుదలవుతున్న ఈ సినిమా విశేషాలు తెలియజేయడానికి చేసిన విలేఖరుల సమావేశంలో పూరి చెప్పిన ముచ్చట్లు.

1. మీ మొదటి సినిమా పవన్ తో చేసారు. పన్నెండు సంవత్సరాల తరువాత మళ్లీ ఆయనతో సినిమా చేస్తున్నారు. ఈ గ్యాప్ లో ఆయనలో కనిపించిన మార్పులేమిటి?
: బద్రి సినిమాకి ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ లో ఏమీ మార్పు లేదు. పిల్లలు పుట్టారు అంతే (నవ్వుతూ). బద్రి సినిమా ద్వారా అయన నాకు లైఫ్ ఇచ్చారు. ఆయనకి ఎప్పటికీ రుణ పడి ఉంటాను.

2. రాంబాబు కథకి ఇన్స్పిరేషన్ ఏమిటి? ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ని ఎలా ఒప్పించారు?
: ఈ సినిమా కథ నాలుగేళ్ళ క్రితం రాసుకున్నాను. మొదట రవితేజకి వినిపించాను. కథ విన్న వెంటనే అర్జెంట్ గా ఈ సినిమా కళ్యాణ్ గారితో చేస్తే పెద్ద హిట్ అవుతుంది అన్నాడు నేను చాలా రోజులుగా కళ్యాణ్ తో సినిమా చేద్దాం అనుకుంటూ వస్తున్నాను కాని కుదరలేదు. సరే ఈ కథ చెప్పి చూద్దాం అని చెప్పాను. పవన్ కి ఈ సినిమా కథ, కంటెంట్, రాంబాబు పాత్ర చాలా బాగా నచ్చి వెంటనే మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పాడు. ఆయన ఎంత బాగా ఎంజాయ్ చేసాడంటే ఈ సినిమాకి డబ్బింగ్ చెప్తూ అయన తన స్నేహితులకి సీన్స్ చూపిస్తూ మురిసిపోతూ ఎంజాయ్ చేసాడు.

3. ఈ సినిమాలో రాంబాబు పాత్ర ఎలా ఉంటుంది? సినిమా ఎంత వరకు వచ్చింది?
: పేపర్లో, టీవీలో న్యూస్ చూసి స్పందించే కుర్రాడు జర్నలిస్ట్ అయితే ఎలా ఉంటుందో రాంబాబు పాత్ర అలా ఉంటుంది. మన రాష్ట్రంలో వచ్చిన ఒక పెద్ద సమస్యని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది సినిమా కథ. ప్రస్తుతం సినిమా ఫైనల్ మిక్సింగ్లో ఉంది. ఈ వారాంతంలో సెన్సార్ చేసి అక్టోబర్ 18న భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం. మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి నేను ఒక్క కరెక్షన్ చేయలేదు, అంత బాగా ఇచ్చాడు మణిశర్మ.

4. ఈ సినిమాలో మీడియాని పాజిటివ్ గా చూపించారా? నెగటివ్ గా చూపించారా?
: మీడియాని పాజిటివ్ గానే చూపించాము. ఈ సినిమా చూసి మీడియా చాలా గర్వంగా ఫీలవుతారు. మీడియా మీద కూడా కొన్ని జోకులు ఉంటాయి. మీడియా మధ్య ఉన్న కాంపిటీషన్ లాంటివి కూడా ఏమీ చూపించట్లేదు. ఈ సినిమా కళ్యాణ్ కి, నాకు, నిర్మాతలకి మంచి పేరు తెచ్చి పెట్టే సినిమా అవుతుంది.

5. మీడియా మీద సినిమా అంటున్నారు. కమర్షియల్ గా ఎంత వరకు వర్కఅవుట్ అవుతుంది?
: ఇది పక్కా మాస్ సినిమా. మీడియా మీద అంటే ఏదో ఆర్ట్ సినిమా అని కాదు. రాంబాబు అనే జర్నలిస్ట్ రానా బాబు అనే రాజకీయ నాయకుడి తో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది సినిమాలో చూపిస్తున్నాం ఫ్యాన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి.

6. ఈ సినిమాలో కెమెరామెన్ అదే కెమెరా వుమెన్ తమన్నా ఎలా చేసింది?
: నేను తమన్నాతో ఫస్ట్ టైం కలిసి పని చేశాను. కెమెరామన్ గంగగా చాలా బాగా చేసింది. తన పాత్ర టామ్ బాయ్ లాగా ఉంటుంది. అందుకే కెమెరా వుమెన్ అని కాకుండా కెమెరామెన్ అని పెట్టాము. ఈ సినిమాతో మా హీరో, హీరొయిన్ ఇద్దరికీ నంది, ఫిలిం ఫేర్ లాంటి అవార్డ్స్ అన్ని రావాల్సిందే.

7. దూకుడు తరువాత మహేష్, గబ్బర్ సింగ్ తరువాత పవన్ తో, జులాయి తరువాత అల్లు అర్జున్ తో చేస్తున్నారు. ఆ హీరోలు పెద్ద హిట్ కొట్టి ఉన్నారు నెక్స్ట్ సినిమా చేస్తున్నపుడు మీ మీద ఒత్తిడి ఏమీ లేదా?
: నాకు అలాంటి ఒత్తిడి ఏమీ లేదు. ఆ రేంజ్ సినిమా తీస్తానో లేదో అని అందరు అనుకుంటారు కాని నాకు అలాంటి భయాలు ఏమీ లేవు కాబట్టి నా మీద ఆ ఒత్తిడి ఏమీ ఉండదు.

8. మీ పాత సినిమా టైటిల్స్ చూస్తే ఇడియట్, పోకిరి, దేశ ముదురు ఇలా నెగటివ్ గా ఉండేవి ఈ మధ్య పాజిటివ్ టైటిల్స్ పెడుతున్నారు. మీలో ఏమైనా మార్పు వచ్చిందా?
: నేను ఇప్పటికీ అలాగే ఉన్నాను. నేనేమి మంచోడిని కాదు అదే క్రిమినల్ ని (నవ్వుతూ).

9. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోలతో మిగతా దర్శకులు రెండు సంవత్సరాలు తీస్తున్నారు. మీరు సినిమాలు ఇంత ఫాస్ట్ గా ఎలా తీయగలుగుతున్నారు?
: నేనేమి ఫాస్ట్ గా తీయట్లేదు. మిగతా వాళ్ళు స్లోగా చేయడం వల్ల నేను ఫాస్ట్ గా తీస్తున్నట్లు అనిపిస్తుంది అంతే.

12 సంవత్సరాల్లో 25 సినిమాలు పూర్తి చేసిన పూరి జగన్నాధ్ త్వరలోనే 50 సినిమాలు పూర్తి చేయాలని, ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ఇంతటితో ముగిస్తున్నాం.

 

ఇంటర్వ్యూ :  అశోక్ రెడ్డి. ఎమ్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు