అక్కినేని వంశం నుంచి మూడో తరంలో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన అఖిల్, ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ మొదటి సినిమా టైటిల్ కూడా ‘అఖిల్’ కావడంతో ఈ పేరు అంతటా మారుమోగిపోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మిగిలి ఉన్న ఒకే ఒక్క పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో నాగార్జున-నాగచైతన్యలు కూడా కనిపించనున్నారు. ఇక తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమా తమిళ వర్షన్‌కు ఓ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
తమిళంలో అఖిల్ సినిమాకు సూర్య కవచం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రముఖ నిర్మాత సీ కళ్యాణ్ అఖిల్ సినిమాను తమిళంలో విడుదల చేస్తున్నారు. ఇక త్వరలోనే తమిళ వర్షన్ ఆడియోను చెన్నైలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆడియో ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. హీరో నితిన్ భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 22న దసరా కానుకగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.


