త్రివిక్రమ్ కథ రొమాంటిక్ డ్రామాలా ఉంటుందట !

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు సంయుక్తంగా నిర్మిస్తుండటంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇకపోతే ఈ చిత్రానికి కథను అందించింది త్రివిక్రమ్ శ్రీనివాసే.

అయితే మాటల మాంత్రికుడు డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘అజ్ఞాతవాసి’ పరాజయానికి కథ బలంగా లేకపోవడమేనని, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి కథ, కథనాల్ని నిర్లక్ష్యం చేశారనే విమర్శలు వినిపించిన నైపథ్యంలో నితిన్ సినిమా కథపై అందరి దృష్టి పడింది. ఈ కథను త్రివిక్రమ్ ఎలా తయారుచేసుంటాడో తెలుసుకోవాలని అందరూ కుతూహలంగా ఉన్నారు.

చిత్ర సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ఈ చిత్ర కథ పూర్తిస్థాయి రొమాంటిక్ డ్రామాలా, ప్రేక్షకులకు కనెక్టయ్యేలా బలంగా ఉంటుందని తెలుస్తోంది. మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు.