
ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న భామ, అదే ఇండస్ట్రీలో తన తోటి హీరోయిన్ కి తల్లి పాత్ర చేయడం ఎంతో రిస్క్ తో కూడుకున్న పని. అలాంటి పాత్ర చేయడానికి ఎవ్వరూ ధైర్యం చేయరు. కానీ యోగ బ్యూటీ అనుష్క అలాంటి రిస్క్ చేసింది. అనుష్క టైటిల్ రోల్ పోషించిన సినిమా ‘రుద్రమదేవి’. ఈ సినిమాలో రుద్రమదేవి – చాళుక్య వీరభద్రుడి కుమార్తె ముమ్మిదమ్మ పాత్రలో నిత్యా మీనన్ కనిపించనుంది. అనగా అనుష్క – రానా కుమార్తెగా నిత్యా మీనన్ కనిపించి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయనుంది. తెలుగు ప్రేక్షకులకు ఇదొక సరికొత్త అనుభూతిని ఇచ్చే కాంబినేషన్ అని చెప్పవచ్చు.
ఓరుగల్లు ఘనతను భారతదేశ దశదిశలా చాటి చెప్పిన కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చారిత్రాత్మక సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా ఆడియో ని ఉగాది కానుకగా రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నారు. మార్చి 21న వైజాగ్ లో మూడు పాటలను రిలీజ్ చేసి, మార్చి 22న వరంగల్ ఫోర్ట్ లో మరో మూడు పాటలను రిలీజ్ చేయనున్నారు. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా గుణశేఖర్ స్టీరియో స్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న హిస్టారికల్ 3డి మూవీ ‘రుద్రమదేవి’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ మూవీకి మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించగా, తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.

