పైరసీపై బాహుబలి టీమ్ పోరాటం..!

పైరసీపై బాహుబలి టీమ్ పోరాటం..!

Published on Jul 7, 2015 1:38 PM IST

baahubali-pressmeet
దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘బాహుబలి’. మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో ఒకేసారి జూలై 10న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్లు సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలను విపరీతంగా పెంచేశాయి. ఇక ప్రస్తుతం ప్రతి సినిమానూ వేధిస్తున్న పైరసీ దెబ్బను ఎదుర్కునేందుకు బాహుబలి టీమ్ తీసుకుంటున్న చర్యలను వివరించడానికి ఈ ఉదయం ఓ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో నిర్మాతల మండలి తరపున ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పాల్గొని పైరసీ కోసం చేపట్టిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “బాహుబలి సినిమా గురించి ప్రత్యేకించి నేను చెప్పాల్సింది ఏమీ లేదు. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ సినిమాగా నిలవనున్న బాహుబలిని కూడా పైరసీ బాగా భయపెడుతోంది. ఈ విషయంలో ముందస్తుగానే ఆన్‌లైన్ పైరసీకి సంబంధించిన ఓ ముఠాను ఇప్పటికే బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు అంతటా డిజిటల్ ప్రింట్లు పెరిగిపోయిన విషయం తెలిసిందే! ప్రస్తుతమున్న టెక్నాలజీతో ఒక పైరసీ ప్రింట్ ఆన్‌లైన్లో కనిపిస్తే.. అది ఎక్కణ్ణుంచి, ఏ సమయానికి వచ్చిందనేది ఫోరెన్సిక్ ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ద్వారా కనిపెట్టొచ్చు. నేను థియేటర్ల యాజమాన్యాలను చెప్పేది ఒక్కటే.. పైరసీకి సహకరించినట్లు రిపోర్ట్‌లలో తేలితే వారిపై సంవత్సరం నిషేధం విధిస్తాం. ఇది అభ్యర్థన అనుకున్నా, హెచ్చరిక అనుకున్నా ఫర్వాలేదు. సినిమా అనేది బతకాలంతే!” అంటూ పైరసీపై తమ చర్యలను వివరించారు.

బాహుబలి దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. “సినిమా అనే దానిపైనే ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎగ్జిబిటర్ ఇలా అందరూ బతుకుతున్నారు. సినిమా బతకాలంటే పైరసీని అరికట్టాల్సి ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీతో ఈజీగా పైరసీ ఎక్కణ్ణుంచి జరిగిందనేది చెప్పేయొచ్చు. మేము రెండునరేళ్ళు కష్టపడి చేసిన సినిమా పైరసీకి గురి కావద్దనేది మా అభిమతం. మా కష్టాన్ని వెండితెరపైనే చూడండి” అని అన్నారు. ఇక బాహుబలి సినిమాలో విలన్‌గా నటించిన రానా మాట్లాడుతూ.. “సినిమా అనేది ఓ కళ. కళను దొంగిలించడం పెద్ద నేరం. దయచేసి మేం కష్టపడి చేసిన సినిమాను థియేటర్లలోనే చూడండి” అన్నారు. ఈ సమావేశంలో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డతో పాటు తెలుగు సినిమా ఆంటీ పైరసీ సెల్ సభ్యులు పలువురు పాల్గొన్నారు.

తాజా వార్తలు