బాలకృష్ణ యూఎస్ టూర్ షెడ్యూల్!
Published on Jan 17, 2017 9:50 am IST

gpsk-us-tour
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జనవరి 12న విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. బాలయ్య హీరోగా నటించిన వందో సినిమా కావడం, విలక్షణ దర్శకుడు క్రిష్ సినిమా కావడంతో శాతకర్ణిపై మొదట్నుంచీ విపరీతమైన అంచనాలు కనిపించాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన సినిమా సూపర్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. తెలుగు సినిమాకు ఈమధ్య కాలంలో పెద్ద మార్కెట్‌గా అవతరించిన యూఎస్‌లోనూ గౌతమిపుత్ర శాతకర్ణి దూసుకుపోతోంది.

సాధారణంగా యూఎస్‌లో బాలయ్య సినిమాలు ఇప్పటివరకూ పెద్దగా సందడి చేసింది లేదు. కాగా గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రం అందుకు భిన్నంగా 1 మిలియన్ డాలర్లు వసూలు చేసి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలన్న ఆలోచనతో బాలకృష్ణ యూఎస్ టూర్‌కు వెళ్ళనున్నారు. గురువారం సాయంత్రం నుంచి ఆయన ఈ టూర్ మొదలుపెట్టనున్నారు. బాలయ్య రానుండడంతో యూఎస్‌లో ఆయన అభిమానులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

బాలకృష్ణ యూఎస్ టూర్ వివరాలు ఇలా ఉన్నాయి :

గురువారం రోజున సాయంత్రం బే ఏరియాలోని థియేటర్లను సందర్శిస్తారు.
శుక్రవారం రోజున సాయంత్రం డల్లాస్‌లోని థియేటర్లను సందర్శిస్తారు.
శనివారం రోజున డెట్రాయిట్‌లోని థియేటర్లను సందర్శిస్తారు.
ఇక చివరిరోజు ఆదివారం న్యూజెర్సీ, ఫిలడెల్ఫియాలోని థియేటర్లను సందర్శిస్తారు.

 
Like us on Facebook