చిరు 151వ సినిమాకి భారీ డీల్.. నిజమేనా ?
Published on Oct 22, 2017 5:03 pm IST


మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ పై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో ఎంతటి అంచనాలున్నాయి తెలిసిన సంగతే. ‘బాహుబలి-2’ తర్వాత ఆ స్థాయి అంచనాలతో వస్తున్న చిత్రం కావడంతో నిర్మాత రామ్ చరణ్ కూడా ఎక్కడా తగ్గకుండా ప్రాజెక్ట్ కోసం భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. కథ దగ్గర్నుండి, మేకింగ్ వరకు అన్ని అంశాలల్లోను చిత్రం జాతీయ స్థాయిలో ఉండేలా జాగ్రత్తపడుతున్నారు. దీంతో సినిమా ఔట్ ఫుట్ ఖచ్చితంగా గొప్పగా ఉంటుందనే నమ్మకం ఏర్పపడిపోయి ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత ఎక్కువైంది.

ఈ క్రేజ్ వల్లనే సినిమా రెగ్యులర్ షూట్ కు వెళ్లకుండానే భారీ ఆఫర్లు చరణ్ తలుపు తడుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు అమెజాన్ సంస్థ డిజిటల్ రైట్స్ కోసం రూ.30 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ చరణ్ మాత్రం అప్పుడే బిజినెస్ విషయాల జోలికి పోకుండా ముందు సినిమాను అనుకున్నట్టు గొప్పగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ వార్తలో ఎంబితమేరకు నిజముందో తెలీదు కానీ సినిమా పూర్తయ్యే నాటికి అన్ని రకాల హక్కులు భారీ మొత్తంలో అమ్ముడవడం మాత్రం ఖాయమని చెప్పొచ్చు.

సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు తమిళ సంచలనం విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ హీరో సుదీప్, లేడీ సూపర్ స్టార్ నయనతార వంటి వారు నటిస్తుండగా ఆస్కార్ విజేత ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందివ్వనున్నారు.

 
Like us on Facebook