మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ దునియాలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారనే వార్త ప్రస్తుతం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఒక గ్రాండ్ సెలబ్రిటీ టాక్ షో కోసం ఆయనతో చర్చలు జరుపుతుండగా, ఈ చర్చలు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అత్యంత ఎంటర్‌టైనింగ్‌గా రూపుదిద్దుకోనున్న ఈ షో కోసం చిరంజీవికి ఏకంగా రూ. 200 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోకి పనిచేసిన బివిఎస్ రవి ఈ షో కాన్సెప్ట్‌ను సిద్ధం చేస్తుండగా, చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఈ డీల్‌ను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ‘కాకా’ సినిమా షూటింగ్‌లో తీరిక లేకుండా ఉన్నారు. నవంబర్ నాటికి టాకీ పార్ట్ పూర్తి చేసుకుని, 2027 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
‘కాకా’ షూటింగ్ పూర్తయిన వెంటనే మెగాస్టార్ ఈ టాక్ షో సెట్స్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందట. మరోవైపు ఆయన నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్ కూడా పూర్తవడంతో, ఈ సినిమా విడుదల తేదీ పై త్వరలోనే క్లారిటీ రానుంది.


