అలా చేయడమే నా బలం…”చేరువైన దూరమైన” చిత్రం హీరో సుజిత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

అలా చేయడమే నా బలం…”చేరువైన దూరమైన” చిత్రం హీరో సుజిత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Published on Aug 19, 2021 6:40 PM IST

వినాయక ఎంటర్టైన్ మెంట్ పతాకంపై చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం చేరువైన దూరమైన. ఇందులో స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మేనల్లుడు సుజిత్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నారు. తరుణి సింగ్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తున్నారు. సుకుమార్ పమ్మి సంగీతం అందించిన ఈ చిత్రం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో సుజిత్ రెడ్డి తన నేపథ్యం మరియు సినిమా విశేషాల గురించి ముచ్చటించారు. ఆ వివరాలు మీకోసం.

 

నేను రవితేజకి డైహార్డ్ ఫ్యాన్ ని..!

100 మీటర్ల పరుగు పందెంలో స్టేట్ గోల్డ్ మెడలిస్ట్ ని అని, అథ్లెటిక్స్ అంటే చాలా ఇష్టమని అన్నారు సుజిత్. అయితే బి.టెక్.లో చేరడం వల్ల ఆ కాలేజీలో అథ్లెటిక్స్ కి పెద్ద ఎంకరేజ్ వుండేది కాదని, దాంతో బి.టెక్.పూర్తయిన తరువాత సినిమాల్లోకి రావాలని ప్రయత్నాలు చేశానని అన్నారు. తను రవితేజకి డైహార్డ్ ఫ్యాన్ ని అని, ఆయన ఎనర్జీ లెవెల్స్ ఎలా వుంటాయో మనందరికీ తెలుసు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఇడియట్ సినిమాను చూసి సినిమాల్లోకి రావాలనుకున్నా అని అన్నారు. తన మావయ్య కమెడియన్ శ్రీనివాసరెడ్డి నీవే స్వతహాగా సినిమాల్లో రాణించాలనేవారు అని చెప్పుకొచ్చే వారు అని తెలిపారు. దాంతో దాదాపు 8 ఏళ్లు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగానని, మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు వచ్చేవని, అయితే తనకు మాత్రం హీరోగానే లాంఛ్ అవ్వాలని వుండేది అంటూ చెప్పుకొచ్చారు. శ్రీనివాసరెడ్డి గారి సినిమా భాగ్యనగర్ వీధుల్లో గమ్మత్తు లో ఓ చిన్న రోల్ తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అని, ఆ తరువాత మళ్లీ అలాంటి పాత్రలు చేయనని చెప్పేశా అంటూ చెప్పుకొచ్చారు.

 

ఎనిమిదేళ్లు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగా..!

హీరోగా నటించాలని ఆఫీసుల చుట్టూ తిరిగేవాణ్ని అని, చాలా మంది ఎందుకు నీవు ఆఫీసుల చుట్టూ తిరగడం, మీ మావయ్య అనుకుంటే, పెద్ద డైరెక్టర్లే ముందుకొస్తారు కదా, ఎందుకంత కష్టపడుతున్నావు అనే వాళ్లు అని అన్నారు. కానీ తానే సొంతంగా రాణించాలి అని, తానే నిర్మాతలని, దర్శకులను మెప్పించి సినిమా చేయాలనే వాణ్ని అని అన్నారు. అలా ప్రయత్నిస్తున్నప్పుడే చంద్రశేఖర్ కానూరి పరిచయం అయ్యారు అని అన్నారు. మీరు హీరో కావాలి అంటే, బాగా స్లిమ్ అవ్వాలి అని అన్నారు అని తెలిపారు. తను బాగా ఫ్యాట్ గా వుండేవాణ్ని అని తెలిపారు. దాంతో పది కిలోలు తగ్గి స్లిమ్ అయ్యా అని, ఫస్ట్ తన మీద ఓ ట్రయల్ షూట్ చేశారని, దాన్ని మామయ్యకు చూపించగానే బాగా చేశావని మెచ్చుకున్నారు అని అన్నారు. ఆ తరువాత ఈ సినిమా కథ విని సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే అన్నారు అంటూ చెప్పుకొచ్చారు. నిర్మాతలకు దర్శకుడే నన్ను పరిచయం చేశారు అని, అయితే వాళ్లు ఓ పెద్ద హీరోతో వెళితే బాగుంటుందనే ఆలోచనలో వుండగా, దర్శకుడు తనైతేనే ఈ సినిమాకి ఫిట్ అవుతాడు అని చెప్పిన విషయాన్ని వెల్లడించారు. దాంతో ఈ ప్రాజెక్టు పట్టాల మీదకు ఎక్కింది అని అన్నారు. వాళ్లు కావాల్సినంత బడ్జెట్టును ఇచ్చేశారు, కొత్తవాణ్ణైనా బడ్జెట్టుకు వెనకాడకుండా కోట్లు ఖర్చుచేశారు, తనకి కెమెరా ముందు నటించడానికి భయమేమీ వేయలేదు అని, దర్శకుడు తనకు కావాల్సిన దాన్ని రాబట్టుకున్నారు అని, మంచి కంఫర్ట్ జోన్ లోనే పని చేసినట్లు తెలిపారు. మావయ్యకు ఈ సినిమాను చూపించామని, తన నటనలో చిన్న చిన్న కరెక్షన్స్ వున్నా, అవన్నీ రాను రాను కరెక్షన్ చేసుకోగలవు అని ప్రోత్సహించారు అంటూ చెప్పుకొచ్చారు.

 

యాక్షన్ సీన్స్ చేయడమే నా బలం..!

తను రోహన్ తనేజా అనే ఓ ముంబాయి బేస్డ్ ఇన్ స్టిట్యూట్ లో నటనపై శిక్షణ తీసుకున్నా అని తెలిపారు. అక్కడ పెద్దగా నేర్చుకుంది ఏమీ లేదని, ఆ తరువాత తానే స్వతహాగా మిర్రర్ లో చూసుకుంటూ, తనకు తానే నటనను మెరుగు పరుచుకున్నా అని, తన మామ శ్రీనివాసరెడ్డి కూడా సినిమాల్లో వుండటంతో బహుశా ఆ బ్లడ్ నాలో కూడా వుండటంతో నటనపై ఆసక్తి ఏర్పడింది అని, తనకు యాక్షన్ సీన్స్ చేయడం అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు. అదే తన బలం అని అన్నారు. ఈ చిత్రంలో క్లైమాక్స్ ప్రధానమని, మొదట్లో చాలా మంది క్లైమాక్స్ సీన్ పై సందేహాలు వచ్చాయని, మొదటి సినిమాలోనే అంత బరువైన క్లైమాక్స్ ఎందుకని అందరూ అన్నారు అని, కానీ దర్శకుడు పట్టుబట్టి చేయించారు, చాలా బాగా వచ్చింది అని అన్నారు. దర్శకుడు చంద్రశేఖర్ కానూరి, ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి శిష్యుడు అని, ఆయన మొదటి సినిమా రథం చేశారు, ఇప్పుడు తనతో చేశారు, ఆయన తనకు నెరేషన్ ఏదైతే చేశారో అదే తెరమీద చూపించారు, మ్యూజిక్ బాగుంది, అన్ని పాటలూ బాగున్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది, నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు, మాకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు, ఫస్ట్ కాపీ చూసి వాళ్లు హ్యాపీగా పీల్ అయ్యారు, ఇందులో క్లైమాక్స్ ఏ సినిమాలో వుండదు అంటూ చెప్పుకొచ్చారు. చాలా యూనిక్ గా వుంటుంది అని, దాన్ని కాకినాడలోని ఉప్పాడ బీచ్ లో తీశామని అన్నారు. చాలా బాగా వచ్చింది, ఇందులో తమిళ నటుడు శశి ప్రతి నాయకుడుగా చాలా బాగా చేశాడు, హీరోయిన్ తరుణితో కలిసి టామ్ అండ్ జెర్రీలాగ పోటీ పడి చేశాం, మిగతా పాత్రల్లో దర్శకుడు దేవీప్రసాద్, రాజేశ్వరీ నాయర్, హీరోయిన్ అమ్మ పాత్రలో మణిచందన, బ్రదర్ పాత్రలో తమిళ నటుడు శశి, సీనియర్ నటుడు బెనర్జీ కూడా చేశారు అని తెలిపారు.

 

టాప్ డైరెక్టర్ల ఆశీర్వాదం మరువలేను..!

ఈ చిత్రం టీజర్ ను మొదట డైరెక్టర్ గోపీ చంద్ మలినేని చేశారు, మంచి స్పందన వచ్చింది, ఆ తరువాత ట్రైలర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చేశామని, దానికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు. వీళ్లిద్దరి ఆశీస్సులు తమకు అందించారని, అది మరువలేం అని అన్నారు. ఈ సినిమా తరువాత ఇంకా ఏ ప్రాజెక్టును ఒప్పుకోలేదు, చాలా సినిమా అవకాశాలైతే వస్తున్నాయి, ఈ సినిమా రిలీజ్ అయిన తరువాతే ఒప్పుకుందాం అనుకున్నా అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు