చిట్‌చాట్ : సూర్య – చరణ్ కోసమే ‘సింగం 3’ వాయిదా వేశాం!

చిట్‌చాట్ : సూర్య – చరణ్ కోసమే ‘సింగం 3’ వాయిదా వేశాం!

Published on Dec 4, 2016 7:48 PM IST

singam-3

తమిళంలో సూర్యకు ఉన్న ఫాలోయింగ్ ఏస్థాయిదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగులోనూ హీరోగా తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకున్న ఆయన నటించిన ‘సింగం 3’ ఈనెల 23న భారీ ఎత్తున విడుదలవుతోంది. మొదట డిసెంబర్ 16నే సినిమాను విడుదల చేయాలని భావించినా, తాజాగా రామ్ చరణ్ నటించిన ధృవకు రెండు వారాల గ్యాప్ తర్వాత రావాలన్న ఆలోచనతో డిసెంబర్ 23కు వాయిదా వేశారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా హైద్రాబాద్ వచ్చిన సూర్య, సినిమా గురించి పంచుకున్న విశేషాలు..

ప్రశ్న) ‘సింగం 3’ని డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 23కు వాయిదా వేశారు. కారణం?

స) రామ్ చరణ్ ధృవ డిసెంబర్ 9న వస్తోంది. వారం గ్యాప్‌లో మా సినిమా వస్తే రెండు సినిమాలకూ మంచిది కాదనే, ఒకవారం కావాలనే వాయిదా వేశాం. గజిని సినిమాతో నన్ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన అల్లు అరవింద్ గారికి నేనెప్పటికీ ఋణపడి ఉంటా. చరణ్, ఆయన కలిసి చేసిన ధృవ బ్లాక్‌బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.

ప్రశ్న) ‘సింగం 3’ మొదట్నుంచీ తమిళంతో పాటు తెలుగులోనూ భారీ క్రేజ్ తెచ్చుకుంది. సినిమా ఎలా ఉండబోతోంది?

స) యముడు, యముడు 2 ( తమిళంలో సింగం, సింగం 2) ఎలా ఉంటాయో సరిగ్గా అలాగే ఉండి అలరించే సినిమా ఈ మూడో భాగం. సింగం సిరీస్ చేయడం ఎప్పుడూ ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. నరసింహం అనే పాత్ర ఫ్లేవర్ పోకుండానే ఈ మూడో భాగంలో కొత్తదనం చూపాం. పూర్తి స్థాయి మాస్ సినిమా ఇది. తప్పకుండా అన్నివర్గాల ప్రేక్షకులూ కనెక్ట్ అయ్యేలా కూడా ఉంటుంది.

ప్రశ్న) ఒకే పాత్రను మూడు భాగాల్లో చేయడం ఎలా అనిపించింది?

స) నరసింహం అనే పాత్ర లైఫ్‌లోని ఒక్కో ఫేజ్‌ను ఒక్కో సినిమాగా చెబుతూ వస్తున్నాం కాబట్టి నేనైతే ఎప్పుడూ సింగం సిరీస్‌ని ఎంజాయ్ చేశా. చెప్పాలంటే ఈ సిరీస్ మాకొక మతం లాంటిది. అన్నీ ఫార్మాట్ ప్రకారంగా నరసింహం పాత్ర ఎలా ఉండాలో ప్రతి ఒక్కరికీ తెలుసు. అందరూ అదో నియమంలా పాటిస్తూ ఉండడం ఈ సినిమా విషయంలోనే జరిగేది.

ప్రశ్న) దర్శకుడు హరి గురించి చెప్పండి?

స) హరితో నాకిది ఐదో సినిమా. నాకోసమే ఒక పాత్ర డిజైన్ అవుతుందనే రోజు వస్తుందని కెరీర్ మొదట్లో అస్సలు అనుకోలేదు. ఇప్పుడు సింగం సిరీస్‌తో అది నిజమైంది. అలాంటి సిరీస్‌ను నాకోసం రాసిన హరి సార్ అంటే గౌరవం. ఆయనతో మరిన్ని సినిమాలు చేస్తూనే ఉంటా.

ప్రశ్న) తెలుగు వర్షన్ బిజినెస్ ఎలా జరిగింది?

స) మల్కాపురం శివకుమార్ పెద్ద మొత్తానికి తెలుగు వర్షన్ హక్కులను సొంతం చేసుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ వైజ్ కూడా ఇక్కడ మంచి బిజినెస్ జరుగుతోందని తెలిసింది. నన్నడిగితే నాకు తెలుగు, తమిళ ప్రేక్షకులు అన్న తేడా లేదు. అక్కడ ఎంత బాగా ఆదరిస్తున్నారో, ఇక్కడా అంతే బాగా ఆదరిస్తున్నారు. నా లాస్ట్ సినిమా 24 అయితే ఇక్కడే ఇంకా బాగా ఆడింది. తెలుగు ప్రేక్షకుల ప్రేమను, సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. డిసెంబర్ 11న ఆడియో లాంచ్ రోజు హైద్రాబాద్‌లో తెలుగు అభిమానులను పలకరించడానికి మళ్ళీ వస్తున్నా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు