సమీక్ష : డియర్ కామ్రేడ్ – కొంత స్లోగా ఉన్నా.. బాగానే ఆకట్టుకుంటాడు!

Published on Jul 27, 2019 3:03 am IST
Dear Comrade movie review

విడుదల తేదీ : జూలై 26, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  3.25/5

నటీనటులు : విజయ్ దేవరకొండ, రష్మిక మందన,శృతి రామచంద్రన్

దర్శకత్వం : భరత్ కమ్మ

నిర్మాత‌లు : నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్, మోహన్ చెరుకూరి, యాష్ రంగినేని

సంగీతం : జస్టిన్ ప్రభాకరన్

సినిమాటోగ్రఫర్ : సుజిత్ సారంగ్

ఎడిటర్ : శ్రీజిత్ సారంగ్

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ బ్యూటీ రష్మికా మండన్న రెండవ సారి జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ వారు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. కాగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

చైత‌న్య అలియాస్ బాబీ (విజయ్ దేవరకొండ) నిజాయితీ మరియు నాయకత్వ లక్షణాలతో పాటు ఆవేశంతో రగిలిపోయే స్టూడెంట్ లీడర్ గా ఉంటాడు. ఒక కామ్రేడ్ గా తన ఫ్రెండ్స్ తో కలిసి అన్యాయం పై ఎదురు తిరుగుతూ గొడవలు పడుతుంటాడు. ఈ క్రమంలో స్టేట్ క్రికెట్ ప్లేయర్ అయినటువంటి అపర్ణ దేవి అలియాస్ లిల్లీ (రష్మిక) బాబీ లైఫ్ లోకి వస్తోంది. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం బాబీ గొడవల్లో పూర్తిగా మునిగిపోతాడు. మొత్తానికి అతనికున్న ఆవేశం వల్ల ఇద్దరి విడిపోతారు. అలా మూడేళ్లు గడిచిపోతాయి. ఆ తరువాత లిల్లీని మళ్ళీ బాబీ కలుస్తాడు. కానీ తానూ అనుకున్నట్లు లిల్లీ లైఫ్ ఉండడు. అసలు లిల్లీ లైఫ్ లో ఏమి జరిగింది ? లిల్లీ కోల్పోయిన లైఫ్ ని బాబీ ఎలా తిరిగి ఇచ్చాడు ? ఈ క్రమంలో వచ్చిన సమస్యలను బాబీ ఎలా పరిష్కారించుకున్నాడు ? చివరికి లిల్లీ – బాబీ ఒక్కటయ్యారా ? లేదా ? లాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

నాలుగు దక్షిణాది భాషల్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ యాక్టింగ్, యాటిట్యూడ్‌ అండ్ విజయ్ – రష్మికా మధ్య కెమిస్ట్రీ అలాగే భరత్ కమ్మ దర్శకత్వ పనితనం, కాలేజ్ ఎపిసోడ్లు, సాంగ్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో ఎప్పుడూ ఆవేశంతో రగిలిపోయే చైత‌న్య అలియాస్ బాబీ అనే స్టూడెంట్ పాత్ర‌కు ప్రాణం పోసాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తన మార్క్ నటనతో మరియు మాడ్యులేషన్ అండ్ టైమింగ్‌ తో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేస్తూ సినిమాలోనే విజయ్ దేవరకొండ హైలెట్ గా నిలిచాడు.

ఇక కథానాయకిగా నటించిన రష్మిక, అపర్ణ దేవి అలియాస్ లిల్లీ పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ రష్మిక నటన ఆమె పలికించిన హావభావాలు చాల బాగున్నాయి.

తాతయ్య రోల్ లో కనిపించిన సీనియర్ నటులు చారుహాసన్ గారు తన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే ఉమెన్ క్రికెటర్లును టార్చర్ పెట్టే విలన్ పాత్రలో కనిపించిన నటుడు కూడా తన నటనతో తన ఎక్స్ ప్రెషన్స్ తో.. కీలక సన్నివేశాల్ని చాలా బాగా పండించారు. అలాగే హీరోకి ఫ్రెండ్స్ గా నటించిన నటులు కూడా హీరోకి హెల్ప్ చేసే సపోర్టింగ్ రోల్స్ లో చాల బాగా నటించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

దర్శకుడు భరత్ కమ్మ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అలాగే సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగతీసినట్లు చాల స్లోగా సాగుతాయి. దానికి తోడు విజయ్ దేవరకొండ మార్క్ సీన్స్ అండ్ కామెడీ ఈ సినిమాలో పెద్దగా క‌నిపించ‌వు. సీరియ‌స్ గా ఎమోషనల్ గా సాగే క‌థ కావడంతో బిసి ప్రేక్షకుల ఆశించే ఎలిమెంట్స్, ట్విస్టులు, సర్‌ ప్రైజ్‌లు మిస్ అయ్యాయి.

సినిమాలో మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పెట్టడానికి ఇంకా స్కోప్ ఉన్నప్పటికీ ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో.. కానీ దర్శకుడు మాత్రం తను అనుకున్న ఎమోషనల్ డ్రామాని ఎలివేట్ చెయ్యటానికే ఎక్కువు ఆసక్తి చూపించాడు. పైగా కాస్త స్లోగా, లెంగ్తీగా సాగడం కూడా సినిమాకు మైనస్‌ పాయింట్స్ గా నిలుస్తాయి.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. దర్శకుడు భరత్ మంచి స్టోరీ లైన్ తీసుకున్నా, ఆ స్టోరీ లైన్ కి తగ్గట్లు సరైన కథనాన్ని రాసుకోలేకపోయారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు చాలా బాగున్నాయి. అలాగే ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ల నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ బ్యూటీ రష్మికా మండన్న రెండవ సారి జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కాస్త స్లోగా సాగినప్పటికీ.. మంచి ఫీల్ తో మరియు డీసెంట్ ఎమోషన్ తో బాగానే ఆకట్టుకుంటుంది. ముందుగానే చెప్పుకున్నట్లు దర్శకుడు మంచి పాయింట్ తీసుకున్నా.. ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు.

అయితే విజయ్ దేవరకొండ యాక్టింగ్, యాటిట్యూడ్‌ అండ్ విజయ్ – రష్మికా మధ్య కెమిస్ట్రీ అలాగే భరత్ కమ్మ దర్శకత్వ పనితనం, కాలేజ్ ఎపిసోడ్లు, సాంగ్స్ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లాయి. ముఖ్యంగా విజయ్ – రష్మిక కెమిస్ట్రీ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోంది. మొత్తం మీద యాక్షన్ అండ్ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా వచ్చిన డియర్ కామ్రేడ్ యూత్ తో పాటుగా మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని చెప్పొచ్చు.

123telugu.com Rating :   3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :