ఇంటర్వ్యూ : సాయి ధరమ్ తేజ్ – మా మెగా హీరోలకి ఇదొక పరీక్ష లాంటిది !

మెగా హీరో సాయి ధరమ్ తేజ్, స్టార్ డైరెక్టర్ వివి.వినాయక్ కలిసి చేసిన చిత్రం ‘ఇంటిలిజెంట్’. ఈ చిత్రం రేపు 9వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా తేజ్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) సినిమా కాన్సెప్ట్ ఏంటి ?
జ) జీవితంలో మనం ఎదగడానికి కొందరు చాలా సహాయం చేస్తారు. అలాంటి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి మనం కూడా సహాయం చేయాలి. ఆ సాయం చేయడానికి ఎంతదూరమైనా వెళ్ళాలి. అనేదే ఈ సినిమా కాన్సెప్ట్.

ప్ర) ఇందులో మీ క్యారెక్టర్ ?
జ) ఇందులో నేనొక సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనిపిస్తాను. ఒక అనుకూల వాతావరణంలో ఉండే కుర్రాడు కొన్ని కారణాల వలన వాటిని వదిలి బయటికొచ్చి తన వాళ్ళ కోసం ఎలా పోరాడతాడు, కష్టాలను ఎలా తప్పించుకుంటాడు అనేదే నా పాత్ర చిత్రీకరణ.

ప్ర) వినాయక్ గారితో సినిమా చేయడం ఎలా ఉంది ?
జ) నిజంగా వినాయక్ గారిటి సినిమా చేస్తానని అస్సలు ఊహించలేదు. వరుస ఫ్లాపుల్లో ఉన్న నన్ను ‘ఖైదీ నెం 150’ లాంటి భారీ హిట్ అందుకున్న తర్వాత పిలిచి మరీ సినిమా చేయడమనేది ఆయన గొప్పతనం. ఆయనతో వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఫీలవుతున్నాను.

ప్ర) ఈ సినిమాని వినాయక్ గారు చేయమన్నారని చేశారా.. కథ నచ్చి చేశారా ?
జ) నేనీ సినిమా చేయడానికి మొదటి కారణమైతే వినాయక్ గారే. అలాగే కథ నచ్చడం రెండో కారణం. దర్శకుడు ఎవరైనా కథనేది ఉండాల్సిందే.

ప్ర) మీ వరుస పరాజయాలకు కారణం ?
జ) అంటే మేము తీసిన సినిమాలు జనాలకు సరిగా కనెక్ట్ కాకపోవడమే. పైగా మేము అనుకున్నది అనుకున్నట్టు స్క్రీన్ పై రాకపోవడంతో అవి ప్రేక్షకులకి నచ్చలేదు.

ప్ర) మీరు యాక్షన్, కమర్షియల్ చట్రం నుండి బయటకు రాలేకపోతున్నారెందుకు ?
జ) నాకు భిన్నమైన సబ్జెక్ట్స్ చేయాలనే ఉంది. కానీ నా దగ్గరకు వచ్చే వాళ్ళు కమర్షియల్ సినిమాలతోనే వస్తున్నారు. అందుకే అవే చేస్తున్నాను. అవకాశాం వస్తే తప్పకుండా భిన్నమైన సినిమాలు చేస్తాను.

ప్ర) చిరంజీవిగారి పాటలన్నిటినీ మీరే రీమిక్స్ చేస్తున్నట్టున్నారు ?
జ) అలా ఏం లేదండి. నాతో సినిమాలు చేసే దర్శకుల డిమాండ్ వల్లనే మావయ్య పాటల్ని రీమిక్స్ చేయాల్సి వస్తోంది.

ప్ర) మెగా హీరోలు పెరిగిపోతున్నారు. మరి విడుదల సమయంలో క్లాషెస్ ఎక్కువవుతాయి కదా ?
జ) నిజమే. ఇప్పుడు వరుణ్ సినిమాకి, నా సినిమాకి వచ్చినట్టే రిలీజ్ సమయంలో ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటినీ ఎలాగోలా అడ్జెస్ట్ చేసుకుని చేయాలి. ఒక రకంగా మాకిది పరీక్ష లాంటిదనొచ్చు.

ప్ర) చివరగా మెగా అభిమానులకు ఏం చెప్తారు ?
జ) నా సినిమా రేపు 9న, వరుణ్ సినిమా 10న రిలీజవుతున్నాయి. మెగా అభిమానులంతా రెండు సినిమాల్ని థియేటర్లలోనే చూడండి. పైరసీని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు.