ఇంటర్వ్యూ : లక్ష్మి సౌజన్య – ‘వరుడు కావలెను’ ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు !

ఇంటర్వ్యూ : లక్ష్మి సౌజన్య – ‘వరుడు కావలెను’ ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు !

Published on Oct 25, 2021 3:02 PM IST

లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య – రీతూవర్మ హీరోహీరోయిన్లుగా రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ ‘వరుడు కావలెను’. కాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబరు 29న థియేటర్‌ లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకురాలు లక్ష్మి సౌజన్య ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ఈ సినిమా పై లక్ష్మి సౌజన్య చెప్పిన విషయాలు మీ కోసం..

 

ఈ సినిమా ఎలా మొదలైంది ?

నేను చాలా కాలంగా ఎన్నో సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేశాను. అలాగే యాడ్స్ కూడా చేశాను. అయితే, సినిమా చేయాలనే ఆలోచనతో 2017లో నిర్మాత చినబాబు గారికి ఈ కథ చెప్పాను. ఆయనకు కథ బాగా నచ్చి సినిమాకు ఓకే చెప్పారు. కానీ కరోనా కారణంగా మా సినిమా రెండేళ్లు ఆలస్యమైంది.

 

గతంలో పెళ్లిళ్ల పై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. మరి ‘వరుడు కావలెను’ సినిమాలో కొత్తదనం ఏముంది ?

చాలా సినిమాల్లో కథలు ఒకేలా ఉంటాయి, అయితే పాత్రలు నేపథ్యం వేరుగా ఉంటాయి. నా సినిమాలో పాత్రలు, బ్యాక్‌ డ్రాప్‌ కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్లు ప్రవర్తించే విధానం, వారి మధ్య వచ్చే సంఘర్షణ, వారి భావోద్వేగాలు కొత్తగా ఉంటాయి.

 

మీ నేపథ్యం గురించి చెప్పండి ?

నేను కర్నూల్ లో పుట్టాను, అయితే పెరిగింది మాత్రం గుంటూరు జిల్లా నరసరావుపేటలో. నా గ్రాడ్యుయేషన్ తర్వాత, నేను సినిమాల్లోకి రావాలనుకుని వచ్చాను. మొదట్లో తేజ గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఆ తర్వాత క్రిష్, శేఖర్ కమ్ముల వంటి దర్శకుల దగ్గర కూడా పని చేశాను. ఇప్పుడు నా తొలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను.

 

సినిమా టీజర్స్, ట్రైలర్స్ లో రీతూ వర్మకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చినట్టు ఉన్నారు ?

అలాంటిదేమీ లేదు అండి. ఆమె పాత్రకి అనుగుణంగానే ఆమెను చూపించాను. అలాగే శౌర్య పాత్ర కూడా చిత్రంలో చాలా కీలకమైనది. ఈ సినిమాలో హీరోహీరోయిన్ల పాత్రలను అందరూ ఇష్టపడతారు.

 

చివరగా, ‘వరుడు కావలెను’ సినిమాలో ముఖ్యాంశాలు ఏమిటి?

అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ ఈ సినిమాతో బాగా కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో యూత్ కి నచ్చే అంశాలే కాదు, మెచ్చే అంశాలు కూడా ఉన్నాయి. ఇక రొమాన్స్, ఎమోషన్స్, లవ్, అండ్ డ్రామా ఇలా అన్ని అంశాలు సినిమాలో చాలా చక్కగా కుదిరాయి. అందుకే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు.

 

మీ భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి ?

ఈ సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నాను. అయితే నా తర్వాత సినిమా కథను కూడా రాశాను. ఒక ఆధార్ కార్డు నేపథ్యంలో కథ ఉంటుంది. అంటే గుర్తింపు కోసం ప్రయత్నం చేసే ఓ వ్యక్తి కథ. ఇక ఈ వరుడు కావలెను సినిమాను దయచేసి అందరూ ఆదరించండి’ అని లక్ష్మి సౌజన్య ఇంటర్వ్యూ ముగించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు