ఇంటర్వ్యూ : రాజశేఖర్ – ‘కల్కి’ ఒక్కొక్కరూ ఐదేసి సార్లు చూస్తున్నారు

ఇంటర్వ్యూ : రాజశేఖర్ – ‘కల్కి’ ఒక్కొక్కరూ ఐదేసి సార్లు చూస్తున్నారు

Published on Jul 2, 2019 5:24 PM IST

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘కల్కి’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 28న శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకం పై నిర్మాత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ తో ఇంటర్వ్యూ…

ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తోంది ?

నా నటనకు మంచి పేరు వచ్చింది. నా లుక్స్, నా మేనరిజమ్స్ బాగున్నాయని ప్రేక్షకులందరూ ప్రశంసిస్తున్నారు. ఇక కథ, నా క్యారెక్టర్, ప్రశాంత్ వర్మ టేకింగ్… అన్ని బాగున్నాయని అంటున్నారు.

మీ సినిమాలలో మీ క్యారెక్టర్ డామినేటింగ్ గా ఉంటుంది. ఇందులో అండర్ ప్లే చేసినట్టున్నారు ?

క్యారెక్టర్ పరంగా నేను డామినేట్ చేశానా? అండర్ ప్లే చేశానా? అనేది పక్కన పెడితే… ఈ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్, క్లైమాక్స్ లో ఫైట్ బాగున్నాయని అందరూ చెబుతున్నారు. ముఖ్యంగా నా అభిమానులకు సినిమా చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కరూ ఐదేసి సార్లు సినిమా చూస్తున్నారు.

సినిమాలో మీకు నచ్చిన సన్నివేశం?

నేను ఉన్న ప్రతి సన్నివేశం నాకు బాగా నచ్చింది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశా.

‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ డైలాగ్‌ గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ వివరించినప్పుడు మీరు ఏమన్నారు ?

సినిమాలో రెండుసార్లు ‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ అనే డైలాగ్ చెప్తాను. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక రోజు వచ్చి సన్నివేశాన్ని వివరించారు. ‘ప్రశాంత్! సన్నివేశాన్ని భలే రాశారే’ అన్నాను. ఆ రోజు షూటింగ్ చేసేశాం. రెండోసారి డైలాగ్ చెప్పే సన్నివేశాన్ని తీస్తున్నప్పుడు జీవిత సెట్‌ కి వచ్చింది. తనతో ఆ డైలాగ్ గురించి చెప్పాను. ‘ఇది మీ డైలాగే కదా!’ అంది. (నవ్వుతూ) అప్పటివరకు నాకు అది నా డైలాగే అనే సంగతి కూడా నాకు గుర్తు లేదు. కమర్షియల్ ట్రైలర్ విడుదల తర్వాత ఆ డైలాగ్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

సినిమా చూసి మీ పిల్లలు ఏమన్నారు?

వాళ్లకు సినిమా బాగా నచ్చింది. పిల్లలు ఇద్దరూ మెచ్చుకున్నారు. అంతే కాదు, వాళ్ల స్నేహితులు సినిమా చూసి… ‘మీ నాన్నగారు యంగ్ హీరోలకు ధీటుగా ఫైట్స్ చేశారు’ అని చెప్పారట. దాంతో మరింత సంతోషపడుతున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ లవ్ ట్రాక్‌ను కూడా చాలా బాగా డీల్ చేశారు. మీరు చూస్తే అందులో ఎక్కడా హీరో హీరోయిన్ మధ్య టచింగ్స్ ఉండవు. అదా శర్మతో నా పెయిర్ సూపర్ ఉందని మా అమ్మాయిలు చెప్పారు.

మీరు, బాలకృష్ణగారు కలిసి సినిమా చేస్తారనే వార్త వినిపిస్తోంది ?

చాలా వినిపిస్తున్నాయి. చిరంజీవిగారు, నేను చేస్తామని కొందరు రాశారు. ఈ పుకార్లు ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారనేది తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా. (నవ్వులు)

విల‌న్‌గా చేయ‌డానికి సిద్ధ‌మేనా?

నేను రెడీ. (నవ్వుతూ) నేను విలన్ అయితే తట్టుకోలేరు. అందుకని, భయపడుతున్నారేమో. ఉదాహరణకు… ‘ధృవ’లో అరవింద్ స్వామి చేసిన విలన్ క్యారెక్టర్ అయితే చేస్తా. రెగ్యులర్ విలన్ రోల్స్ చేయను. ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘శ్రీమంతుడు’ చిత్రాల్లో జగపతిబాబు చేసిన పాత్రలు కూడా నచ్చాయి. అటువంటివి వచ్చినా చేస్తా.

దొరసాని’తో శివాత్మిక ఇంట్రడ్యూస్ అవుతున్నారు. తండ్రి, కుమార్తె కలిసి సినిమా చేసే ఆలోచన ఉందా ?

ఉంది. అయితే… ఇప్పుడు కాదు. పెద్దమ్మాయి శివాని కూడా కథానాయికగా పరిచయమైన తర్వాత చేస్తాం. నిజానికి, ‘దొరసాని’ కంటే ముందు శివాని కథానాయికగా సినిమా మొదలైంది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగింది. అమ్మాయిలు ఇద్దరూ రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత మేం కలిసి సినిమా చేస్తాం. అందులో జీవిత కూడా నటిస్తుంది. మా పిల్లలు ఇద్దరూ నాకో కథ చెప్పారు. చాలా బాగుంది. సి. కళ్యాణ్ కి చెప్తే నేనే ప్రొడ్యూస్ చేస్తానన్నారు. కుటుంబకథా చిత్రమది. నిన్న విడుదలైన ‘దొరసాని’ ట్రైలర్ చూసి సావిత్రిగారితో కొందరు పోలుస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది.

మీరు చేయబోయే నెక్స్ట్ సినిమా ?

ఇంకా ఏదీ అనుకోలేదు. కథలు వింటున్నాం. ప్రవీణ్ సత్తారు గారు ‘గరుడవేగ 2’ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. నెక్స్ట్ లెవల్‌ లో ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు