‘ఖైదీ’ చిత్రాన్ని కోరి మరీ వీక్షించిన గవర్నర్ !
Published on Jan 21, 2017 6:12 pm IST

Narasimhan
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం 150’ చిత్రం అభిమానులను ఎంతగా ఊపేస్తుందో చెప్పనక్కర్లేదు. అందుకు బదులుగా ప్రేక్షకులు కూడా రికార్డ్ కలెక్షన్లని అందించారు. సినిమా విడుదలై పది రోజులు కావొస్తున్నా ఈ ఖైదీ ఫీవర్ ఇంకా తగ్గలేదు. మెగా మేనియా ఎంతలా ఉందంటే స్వయంగా రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సైతం ఈ చిత్రాన్ని వీక్షించారు.

కొన్ని రోజులుగా సినిమా గురించి పాజిటివ్ టాక్ వినిపిస్తుండటం, 9 ఏళ్ల తర్వాత చిరు రీ ఎంట్రీ ఇస్తుండటం వంటి కారణాల వలన గవర్నర్ నరసింహన్ కోరి మరీ నిన్న సాయంత్రం కుటుంబ సమేతంగా ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమాను ప్రత్యేకంగా చూశారు.

చిరంజీవే స్వయంగా ఈ షోను ఏర్పాటు చేశారని తెలుస్తోంది. సినిమా చూసిన గవర్నర్ చాలా బాగుందని మెచ్చుకున్నట్టు సమాచారం. చిరు తనయుడు రామ్ చరణ్ మొదటిసారి నిర్మాతగా వ్యవహరిస్తూ నిర్మించిన ఈ సినిమా మొదటి వారంలోనే రూ. 108 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని అల్లు అరవింద్ అధికారికంగా తెలిపారు.

 
Like us on Facebook