ఇంటర్వ్యూ : శ్రీకాంత్ – నా సినిమాకి దర్శకుడు లేడు !
Published on Feb 22, 2018 2:33 pm IST

సీనియర్ హీరో శ్రీకాంత్ నటించిన ‘రా..రా..’ చిత్రం అన్ని పనులు పూర్తిచేసుకుని రేపు విడుదలకానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఈ సినిమా గురించి చెప్పండి ?
జ) ఇది నా 125వ సినిమా అనుకుంటా. మొదటిసారి నా కెరీర్లో హర్రర్ సినిమా చేశాను. సినిమా కూడ బాగా వచ్చింది.

ప్ర) హార్రర్ సినిమాలు చాలా వచ్చాయ్ కదా. మీ చిత్రం ఎలా ఉండబోతోంది ?
జ) ఇది కొంచెం డిఫరెంట్. ఇందులో దెయ్యాలు మనుషులకి భయపడతాయ్. అలాగే వాటికి మనుషులకి మధ్యన సెంటిమెంట్ కూడ ఉంటుంది.

ప్ర) ఇందులో మీ క్యారెక్టర్ ఏంటి ?
జ) ఇందులో నేను మూవీ డైరెక్టర్. హిట్ కోసం హర్రర్ సినిమా చేయాలనుకుని చివరికి దెయ్యాలతోనే సినిమా చేస్తాను. దెయ్యంతో ప్రేమలో కూడ పడతాను.

ప్ర) అవును.. ఈ సినిమా దర్శకుడి పేరు బయటకురాలేదు ఎందుకని ?
జ) మా సినిమాకి దర్శకుడు లేడు. సినిమా మధ్యలో నిర్మాతకు, దర్శకుడికి పడలేదు. చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేశా. కానీ కుదర్లేదు. దాంతో అతను తప్పుకున్నాడు. కథ అతనిది కాకపోవడంతో వేరే పెద్ద దర్శకుడు డైరెక్ట్ చేశారు. అతని పేరు బయటపెట్ట దలుచుకోలేదు.

ప్ర) ఆ మధ్య ప్రతినాయకుడిగా చేశారు. మళ్ళీ ఆఫర్ రాలేదా ?
జ) ఆ మధ్య చాలా ఆఫర్లే వచ్చాయి. కానీ చేయలేదు. ప్రస్తుతం హీరోగా మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి. అప్పుడే ఎందుకని ఆగాను.

ప్ర) మీ నెక్స్ట్ సినిమా ‘ఆపరేషన్ 2019’ ఎలా ఉండబోతోంది ?
జ) ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు మీద ఆ సినిమా ఉండబోతోంది. నాయకులు ప్రజల్ని మోసం చేస్తున్నారా లేకపోతే ప్రజలే నాయకుల్ని మోసగిస్తున్నారా అనేది అందులో చూపిస్తాం. కొత్తగా ఉంటుంది.

ప్ర) ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలో చేస్తున్నారని విన్నాం ?
జ) లేదు. చేయడం లేదు. ప్రస్తుతానికి ఉన్న సినిమాలతోనే బిజీగా ఉన్నాం.

ప్ర ) మీ చిన్నబ్బాయి రోహన్ కూడా సినిమా చేస్తున్నాడని విన్నాం ?
జ) అవును చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ షూటింగ్లోనే ఉన్నాడు. అది కూడ హర్రర్ సినిమానే. ప్రభుదేవాతో కలిసి చేస్తున్నాడు. ఆ సినిమా హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఉండనుంది.

ప్ర) మరి మీ పెద్దబ్బాయి రోషన్ కొత్త సినిమా ఎప్పుడు ?
జ) ఇంకో మూడేళ్ళ తర్వాత పూర్తిస్థాయి హీరోగా వస్తాడు. ఇప్పుడు లాస్ ఏంజిల్స్ లో యాక్టింగ్ డిప్లొమా చేస్తున్నాడు. మొదటి సినిమా ‘నిర్మల కాన్వెంట్’ అతనిలో కాన్ఫిడెన్స్ నింపింది.

 
Like us on Facebook