ఇంటర్వ్యూ : వెంకీ అట్లూరి – పవన్ కళ్యాణ్ గారి ‘తొలిప్రేమ’ గౌరవాన్ని కాపాడాననే అనుకుంటున్నాను

వరుణ్ తేజ్, రాశీఖన్నాలు జంటగా నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం నిన్ననే విడుదలై మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకుని విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి మీడియాతో మాట్లాడారు. ఆ సంగతులు మీకోసం…

ప్ర) మీ సినిమాను కళ్యాణ్ గారి ‘తొలిప్రేమ’తో పోలుస్తున్నారు. మీకెలా అనిపిస్తోంది ?
జ) భీమవరంలో ప్రీ రిలీజ్ వేడుక చేసినప్పుడు కళ్యాణ్ గారి ‘తొలిప్రేమ’ గౌరవాన్ని కాపాడతానని అభిమానులకు ప్రామిస్ చేశాను. నిలబెట్టాననే అనుకుంటున్నాను.

ప్ర) ఈ భారీ స్పందనను మీరు ముందుగానే ఊహించారా ?
జ) మంచి స్పందన రావాలని కోరుకున్నాం. కానీ అంతకంటే ఎక్కువే వచ్చింది. నిన్న దేవి థియేటర్లో రెస్పాన్స్ చూస్తే చాలా ఆనందమేసింది. ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ప్రేక్షకులు కూడా ఎమోషనల్ గా ఫీలవడం వంటి సందర్భాలు కొత్తగా అనిపించాయి.

ప్ర) రాశీఖన్నాను తీసుకోవడం ఎవరి డెసిషన్ ?
జ) అది పూర్తిగా వరుణ్, నిర్మాతల డెసిషన్. నేనైతే కొత్త వాళ్ళైతే బాగుంటుందని అనుకున్నాను. కానీ ప్రేక్షకులకు బాగా తెలిసిన నటి అయితే బాగుంటుందని రాశీఖన్నాను స్క్రీన్ టెస్ట్ చేశాం. అందులో ఆమె నిజంగానే చాలా అందంగా కనబడింది. అందుకే ఆమెను ఫైనల్ చేశాం.

ప్ర) మాస్ సినిమాల స్పెషలిస్ట్ థమన్ నుండి ఇంత మంచి మ్యూజిక్ ఎలా రాబట్టుకోగలిగారు ?
జ) అంటే థమన్ ఇంతకు ముందు చేసినవన్నీ మాస్ సినిమాలే. పైగా ఆయన నేను కథ చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యారు. ప్రతి ట్యూన్ మొదటి సిట్టింగ్లోనే ఓకే అయిపోయేది. నేనైతే ఎలాంటి కరెక్షన్స్ చెప్పలేదు. తన సొంత కథకి ఇచ్చినట్టే ఇచ్చారు. ‘నిన్నిలా’ సాంగ్ ట్యూన్ అయితే ఆయన 14 ఏళ్ల క్రితం కంపోజ్ చేసుకున్న ట్యూన్. అదే ఇప్పుడు పెద్ద హిట్టైంది.

ప్ర) ‘ఫిదా’ ముందు నుండి వరుణ్ కోసం ఎదురుచూశారు. ఎలా అనిపించింది ?
జ) కొంచెం ఎదురుచూశాను. తప్పదు. ‘ఫిదా’ సమయంలో వరుణ్ కి కాలు విరిగింది. అప్పుడు 5 నెలల పాటు అన్ని షూట్స్ వాయిదాపడ్డాయి. అలా జరక్కుండా ఉండి ఉంటే ఇంకా ముందుగానే సినిమా మొదలయ్యేది. ఆ ఖాళీ సమయంలో నేను, వరుణ్ కూర్చొని స్టోరీ డిస్కస్ చేసే వాళ్ళం.

ప్ర) ఈ కథకి ముందు వరుణ్ నే హీరోగా అనుకున్నారా ?
జ) నేను కథ రాసుకునేప్పుడు ‘ముకుంద’ కూడా రిలీజే కాలేదు. కేవలం ట్రైలర్ మాత్రమే వచ్చింది. దాన్ని చూసి ఇలాంటి హీరో నా కథలో ఉంటే బాగుంటుందేమో అనిపించింది. కానీ లవ్ స్టోరీలు చేస్తాడో లేదో అనే సందేహం ఉండేది. అయితే ‘కంచె’ చూసిన తర్వాత నమ్మకమొచ్చి వెళ్లి కథ చెప్పాను. వరుణ్ కూడా చెప్పగానే ఒప్పుకుని చేస్తానని మాటిచ్చాడు.

ప్ర) మొదట కథను దిల్ రాజుగారికి చెప్పారా, ప్రసాద్ గారికి చెప్పారా ?
జ) ముందు దిల్ రాజుగారికే చెప్పాను. కానీ ఆయనకు వరుస ప్రాజెక్ట్స్ ఉండటం వలన కథ ప్రసాద్ గారి దగ్గరకు వెళ్ళింది. ఆయన కొడుకు బాపినీడు నాకు మంచి ఫ్రెండ్. కథ వినగానే నచ్చి చేస్తానన్నారు.

ప్ర) ఈ కథకు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా ?
జ) పర్టిక్యులర్ ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు. ఒక రెండు క్యారెక్టర్స్ పెట్టి వాళ్ల జర్నీ చూపించాలని అనుకుని ఈ కథ రాశాను.

ప్ర) నటుడిగా మొదలై దర్శకత్వంలోకి వచ్చారు ఎందుకు ?
జ) మొదటి నుండి సినిమాల్లోకి రావాలని ఉండేది. కానీ ఎలా రావాలి అనే ఆలోచన లేదు. ‘స్నేహ గీతం’ సిని డైలాగ్స్ రాశాక అర్థమైంది. అప్పటి నుండి నటన మీద ఆసక్తి తగ్గిపోతూ వచ్చింది. చివరికి నటనా, దర్శకత్వమా అనే ప్రశ్న వచ్చాక దర్శకత్వాన్ని తీసుకున్నాను.

ప్ర) మీరు ఏయే సినిమాల్లో నటించారు ?
జ) మొదట ‘జ్ఞాపకం’ తర్వాత ‘స్నేహ గీతం’ చేశాను. రచయితగా ‘స్నేహ గీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ, కేరింత’ సినిమాలకు పనిచేశాను.

ప్ర) మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరిచ్చారు ?
జ) రాఘవేంద్రరావుగారు ఈరోజు పొద్దున్న కాల్ చేసి మెచ్చుకున్నారు. ఆర్.నారాయణమూర్తిగారు కూడ ఫోన్ చేసి అభినందించారు. ఇలా అందరూ సినిమాకి కనెక్టవ్వడం సంతోషంగా అనిపించింది.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) ప్రసాద్ గారితోనే ఒక సినిమా కమిటయ్యాను. దిల్ రాజుగారితో కూడ త్వరలో ఒక సినిమా చేస్తాను.