ఇంటర్వ్యూ : నాగ శౌర్య – రామ్ చరణ్ సినిమా పాట విని నా సినిమాకి ‘ఛలో’ అనే టైటిల్ పెట్టాను !

యంగ్ హీరో నాగ శౌర్య తన సొంత బ్యానర్ ‘ఐరా క్రియేషన్స్’లో నూతన దర్శకుడు వెంకీ కుడుములు దర్శకత్వంలో చేసిన సినిమా ‘ఛలో’. ఫిబ్రవరి 2వ తేదీన సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) మీ సొంత బ్యానర్లో మొదటి సినిమా మీరే చేశారు.. ఎలా ఉందీ అనుభవం ?
జ) చాలా బాగుంది. ఇన్నాళ్లు ఐరా క్రియేషన్స్ అంటే పెద్దగా ఎవరికీ తెలీదు. ఈ సినిమాతో తెలుస్తుంది. మొదటి సినిమానే అయినా చాలా బాగా వచ్చింది. ఇదొక మర్చిపోలేని అనుభవం.

ప్ర) కొత్త దర్శకుడిని నమ్మి మీ బ్యానర్లో మొదటి సినిమా అదీ మీ సినిమా ఎలా ఇచ్చారు ?
జ) వెంకీ నాకు మంచి స్నేహితుడు. ‘జాదుగాడు’ సినిమా నుండి నాకు తెలుసు. అతనిపై నాకు నమ్మకం ఉంది. అతను చెప్పిన కథ నచ్చడంతో నమ్మకంగా చేసేశాను. నాతో సినిమా చేయాలని అతని మనసులో ఉన్నా బాగోదని నన్ను అడగలేదు. నేనే వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుని మంచి కథ తీసుకురా చేద్దాం అన్నాను.

ప్ర) కథలో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారని విన్నాం నిజమేనా ?
జ) అవును నిజమే. ఇంతకు ముందు సినిమాల్లో దర్శకులు ఏం చెబితే అదే చేసేవాడిని. పెద్దగా ఇన్వాల్వ్ అయ్యేవాడ్ని కాదు. వాటి ఫలితంగా దెబ్బలు కూడా తిన్నాను. అందుకే కొంచెం ఎక్కువ భాద్యత తీసుకుని ఈ కథ కోసం వెంకీతో కలిసి 8 నెలల పాటు కష్టపడ్డాం. నాకు ఏదైనా నచ్చకపోతే వెంకీకి చెప్పి మార్పించుకునేవాడిని.

ప్ర) ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ?
జ) నిజ జీవితంలో నేనె ఎలా అయితే రఫ్ గా, ఫన్నీగా ఉంటానో సినిమాలో కూడా అలానే ఉంటాను. డైరెక్టర్ వెంకీ కావాలనే నా పాత్రను అలా డిజైన్ చేశాడు.

ప్ర) అసలు సినిమా కథేంటి ?
జ) ఒక ఊరు కొన్ని కారణాల వలన తెలుగు, తమిళం అని రెండుగా విడిపోతుంది. రెండు ఊళ్లకు మధ్యన కంచె ఉంటుంది. ఎవరైన కంచె దాటితే సాంప్రదాయం ప్రకారం చంపేస్తారు. అలాంటి ఊళ్లో నాకు పనేంటి అనేదే సినిమా.

ప్ర) వేరే భాషల్లో రిలీజ్ చేస్తున్నారా ?
జ) అంటే ఇతర భాషల్లోకి డబ్ చేయలేదు. కానీ తమిళనాడులో రిలీజ్ చేస్తున్నాం.

ప్ర) సినిమాకి మార్కెట్ బాగా జరిగిందంటున్నారు ?
జ) అవును. ఒక్క నైజాం మాత్రమే ఉంచుకుని మిగతా అన్ని ఏరియాలు అమ్మేశాం. హిందీ రైట్స్ కూడా అమ్ముడైపోయాయి.

ప్ర) మొదటిసారి సినిమాను నిర్మించారు. ఎలా ఉంది అనుభవం ?
జ) నిర్మాణ భాధ్యతలన్నీ అమ్మే దగ్గరుండి చూసుకుంది. కొత్త సినిమా కాబట్టి మొదట్లో ఏవీ తెలీక కొంత ఇబ్బందిపడినా తర్వాత తర్వాత తెలుసుకుని చేసుకున్నాం.

ప్ర) అంటే క్రెడిట్ అంతా మీ అమ్మగారిదేనా ?
జ) అవును. షూటింగ్ మొదటి మూడు సీన్లు గుంటూరులో చేశాం. అవి చూశాక అమ్మకి ఫోన్ చేసి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని అన్నాను. అప్పటి నుండి అమ్మ అన్నింటినీ స్వయంగా దగ్గరుండి చూసుకుని సినిమా బ్రహ్మాండంగా వచ్చేలా చేశారు.

ప్ర) సినిమాకు ‘ఛలో’ అనే టైటిల్ ఎలా పెట్టారు ?
జ) ముందు ఎలాంటి టైటిల్ పెట్టాలో అస్సలు తోచలేదు. మా నాన్నేమో తొందరపెట్టేవారు. అలా ఒకరోజు కారులో వెళుతూ రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ సినిమాలోని లే ఛలో పాట వింటున్నప్పుడు ‘లే ఛలో’ అయితే బాగుంటుందని వెంకీకి చెప్పా. ఆలా డిస్కస్ చేసుకుని ‘ఛలో’ ని ఫైనల్ చేశాం.

ప్ర) నెక్స్ట్ సినిమాలేంటి ?
జ) సాయి శ్రీరామ్ తో సినిమాను ఫిబ్రవరి నెలాఖరులో స్టార్ట్ చేస్తాను. అదొక లవ్ స్టోరీ. రెండున్నర ఏళ్ల క్రితమే ఆ సినిమా చేయాల్సింది. కానీ ఇప్పటికి కుదిరింది. దాని తర్వాత శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడితో ‘నర్తనశాల’ సినిమాను చేస్తాను.