ఇంటర్వ్యూ : గోపీచంద్ – నాకు కూడ కొత్త రకం సినిమాల్ని చేయాలని ఉంది !

Published on Jul 4, 2018 2:50 pm IST

ఇటీవల పరాజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న హీరో గోపీచంద్ తన తాజా చిత్రం’పంతం’తో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ చిత్రం రేపు విడుదలవుతున్న సందర్బంగా అయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ఈప్రాజెక్టు ఎలా పట్టాలెక్కింది ?

చిత్ర డైరెక్టర్ చక్రి నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను వినడానికి అంత ఆసక్తిని చుపించలేదు. ఎప్పుడైతే ఈ చిత్రం యొక్క చివరి నరేషన్ ను వినిపించాడో అప్పుడు నేను చాలా ఇంప్రెస్స్ అయ్యాను. కథ విన్నాక నువ్వు చెప్పిన విజువల్స్ అన్నీ తెర మీద చూపెడతావా అని చక్రిని అడిగాను. చిత్ర షూటింగ్ మొదలైన కొన్ని రోజుల తరువాత ఆయన విజువల్స్ చూసి ఇంప్రెస్స్ అయ్యాను. ఇక అక్కడి నుండి ఈ చిత్రం ఫై ఎలాంటి సందేహాలు రాలేదు.

ఈ చిత్రం దేని గురించి ఉండనుంది ?

ప్రస్తుతం సమాజంలో ఉండే సోషల్ ప్రాబ్లమ్ ను డీల్ చేస్తు తెరకెక్కింది ఈ చిత్రం. అందరి సంతోషాన్ని కోరుకొనే హీరో ఆ ప్రయత్నంలో భాగంగా ఒక కేసులో దూరి ఆ సమస్యను ఎలా పరిష్కరించాడనేది ఈ స్టోరీ.

ఒక నూతన దర్శకుడు ఈ కథకు న్యాయం చేయగలడని అనిపించిందా ?

చాలా సినిమాల్లో కథ బాగుంటుంది కానీ దాన్ని సరిగ్గా తెరకెక్కించలేక పోతారు. చక్రి విషయంలో కూడా నాకు మొదట్లో ఆ భయం ఉండేది. కానీ ఆయన ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. చక్రి బాగా హోమ్ వర్క్ చేసి ఈ కథను రాసుకున్నాడు. దాంతో ఈ చిత్రం చాలా బాగా వచ్చింది .

నూతన దర్శకుల తో మీరు చేసిన సినిమాలు చాలా వరకు పరాజయం చెందాయి. మళ్ళీ ఇంకో కొత్త దర్శకుడికిఅవకాశం ఇవ్వడానికి కారణం ?

నేను ఇప్పటివరకు చెత్త సినిమాలు చేయలేదు. నేను చేసిన సినిమాల్లో కథ పేపర్ మీద రాయడానికి బాగుంటుంది. తీరా దాన్ని తెర మీద సరిగ్గా చూపెట్టలేకపోవడంతో నా సినిమాలు పరాజయం చెందాయి. ఈసారి అలా జరగకుండా ఉండాలనే ప్రయత్నించా.

ఈ చిత్ర నిర్మాత రాధామోహన్ గురించి ?

రాధామోహన్ గారికి కూడా నాకు వచ్చిన సందేహమే వచ్చింది. ఎందుకు నేను కొత్త డైరెక్టర్ తో సినిమా చేయాలి అన్నారు కానీ స్టోరీ విన్నాక కన్విన్స్ అయ్యి ఈ చిత్రానికి అవసరమైనంత ఖర్చు పెట్టారు .

ఇన్నేళ్ళ కెరీర్లో నటన పరంగా ఏమైనా చేంజ్ అయ్యారా ?

ఒక నటుడిగా చాలా మారాను. నా చిత్ర దర్శకులు నుండి కొత్త విషయాలు నేర్చుకున్నాను. అవి నాకు చాలా ఉపయోగపడ్డాయి. మొన్న జరిగిన ‘పంతం’ వేడుకకి నా చిత్ర దర్శకులను అందరిని పిలవడానికి ఇది కూడా ఒక కారణం.

మళ్ళీ మళ్ళీ ఒకే స్టైల్ లో సినిమాలు చేసి మీరు అలిసిపోవడం లేదా ?

ఈ ప్రశ్న ఈ మధ్య కాలంలో చాలా మంది నన్ను అడుగుతున్నారు. నాకు కొత్త రకం సినిమాలు చేయాలని వుంది. కాని ముందుగా డైరెక్టర్స్ మంచి కథలను తీసుకరావాలి. ఒక నటుడిగా నేను అన్ని చిత్రాలను ఎంచుకోలేను. ఏదైతే నా కెరీర్ ను మరో లెవెల్ కు తీసుకెళ్తుందో అలాంటి చిత్రం కోసం ఎదురుచూస్తున్నా.

సంబంధిత సమాచారం :