ఇంటర్వ్యూ : రవితేజ – నేను కొత్తగా ఉండే సబ్జెక్ట్స్ చేస్తే ప్రేక్షకులు పెద్దగా చూడలేదు!

30th, January 2018 - 07:59:59 PM

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘టచ్ చేసి చూడు’. నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ సంగతులు మీకోసం…

ప్ర) మీరు ఇదివరకు చాలా పోలీస్ పాత్రలు చేశారు. వాటికి ఈ సినిమాలో పాత్రకు తేడా ఏంటి ?
జ) ఇంతకు ముందు నేను చేసిన పోలీస్ పాత్రలన్నీ చాలా సీరియస్ గా ఉంటాయి. కానీ ఇందులో మాత్రం సిన్సియారిటీతో పాటు కొంత నా స్టైల్లో ఫన్ కూడా ఉంటుంది.

ప్ర) దర్శకుడు కొత్త వ్యక్తి కదా చేయగలడో లేదో అనే సందేహం రాలేదా ?
జ) దర్శకత్వం అతనికి కొత్త కాదు. చాలా సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడు. మొదటి నుండి అతని మీద నాకు నమ్మకం ఉంది. అందుకే ఎలాంటి ఇబ్బందీ పడలేదు. అతను కూడా నా నమ్మకాన్ని నిలబెట్టాడు.

ప్ర) మీ హీరోయిన్ల గురించి చెప్పండి ?
జ) ఇందులో సీరత్ కపూర్ మాడరన్ అమ్మాయిలా ఉంటుంది. ఆమె పాత్ర నన్ను కొద్దిగా డామినేట్ చేస్తుంది. అలాగే రాశీఖన్నా క్యారెక్టర్లో మంచి ఫన్ ఉంటుంది.

ప్ర) మీ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ నడుస్తోంది. కొంచెం క్లారిటీ ఇస్తారు ?
జ) దీనికి ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అందించాడు. ఆయనకు జామ్8 అనే కంపెనీ ఉంది. దాని నుండి సంగీతాన్ని తీసుకున్నాం. పాటలన్నీ బాగా క్లిక్ అయ్యాయి. ఇక మణిశర్మగారి బ్యాక్ గ్రౌండ్ సంగీతం గురించి చెప్పాల్సిన పనేలేదు. చాలా బాగా కుదిరింది.

ప్ర) భవిష్యత్తులో కొత్త సబ్జెక్ట్స్ ఏమైనా చేస్తారా ?
జ) ఇదివరకు నేను చేసిన ‘నా ఆటోగ్రాఫ్, నేనింతే, శంభో శివ శంభో’ లాంటివి భిన్నమైన సినిమాలే. కానీ పెద్దగా చూడలేదు. అవి కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. అందుకే ప్రస్తుతం నా స్టైల్లోనే ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తున్నాను. కానీ ఇప్పుడు ప్రేక్షకులు మారారు. కొత్త సబ్జెక్ట్స్ తప్పకుండా చేస్తాను.

ప్ర) ఇతర భాషల్లో సినిమాలు చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా ?
జ) ఉంది. కానీ సరైన అవకాశం దొరకట్లేదు. దొరికితే చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.

ప్ర) పురిగారితో సినిమా అన్నారు. అదెప్పుడు ?
జ) ప్రస్తుతం నేను, ఆయన ఇద్దరం బిజీగా ఉన్నాం. ఈ సంవత్సరం ఉండకపోవచ్చు. వచ్చే ఏడాది తప్పకుండా చేస్తాం.

ప్ర) మీ తదుపరి సినిమాలేంటి ?
జ) కళ్యాణ్ కృష్ణతో ఒక సినిమా చేస్తున్నాను. ఇప్పటికే 25 శాతం పూర్తయింది. సినిమా చాలా బాగా వస్తోంది. శ్రీను వైట్లతో కూడా ఒక సినిమాకు సైన్ చేశాను.

ప్ర) మీకిష్టమైన డైరెక్షన్ ఎప్పుడు చేస్తారు ?
జ) ప్రస్తుతానికి లేదు. ఎప్పటికైనా తప్పకుండా చేస్తాను. కానీ నేను డైరెక్ట్ చేయబోయే సినిమాలో నేను మాత్రం నటించను. వేరే వాళ్ళతో చేస్తాను.

ప్ర) ఫైనల్ గా ఈ సినిమా గురించి ప్రేక్షకుల్లకి ఏం చెబుతారు ?
జ) ఇదొక పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. పెద్దలు, పిల్లలు కూర్చొని హాయిగా చూడచ్చు. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.