సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కరుణాకరన్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గతంలో ఈ చిత్రానికి ‘తేజ్ ది కూడ ఓ మంచి ప్రేమకథ’ అనే టైటిల్ ను నిర్ణయించారనే వార్త బయటకు రాగా చిత్ర టీమ్ మాత్రం టైటిల్ అది కాదు అంటూ ఇన్నిరోజులు సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చింది.
దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా టైటిల్ పట్ల ఉత్సుకత నెలకొనగా కొద్దిసేపటి క్రితమే యూనిట్ సభ్యులు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి ‘తేజ్ ఐ లవ్ యు’ అనే సినిమా టైటిల్ ను రివీల్ చేశారు. దర్శకుడు కరుణాకరన్ గతంలో పవన్ కళ్యాణ్ తో ‘తొలిప్రేమ’ లాంటి క్లాసిక్ రూపొందించి ఉండటంతో ఈ ప్రాజెక్ట్ మెగా అభిమానుల్లో ఒక రకమైన ప్రత్యేకతను సంతరించుకుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు.


