ఇంటర్వ్యూ : నితిన్ – హీరోగా నాకో గౌరవం తెచ్చిపెట్టే సినిమా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’!

ఇంటర్వ్యూ : నితిన్ – హీరోగా నాకో గౌరవం తెచ్చిపెట్టే సినిమా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’!

Published on Sep 15, 2015 4:14 PM IST

nithin
వరుస హిట్స్‌తో జోరు మీదున్న నితిన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మాణంలో రూపొందిన సినిమా అంటేనే ఆ సినిమాపై ఉండే క్రేజ్ ఎలాంటిదో చెప్పాల్సిన పనిలేదు. ఆ క్రేజ్‌తోనే వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రేమ్ సాయి దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 17న పెద్ద ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నితిన్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’.. చాలా కాలంగా ఎదురుచూపులకే పరిమితం చేసిన సినిమా ఇప్పటికి విడుదలవుతోంది. ఎలా ఉంది?

స) కెరీర్లో నేను ట్రై చేసిన డిఫరెంట్ సినిమా అంటే అది ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. తెలుగులో డిఫరెంట్ సినిమాలు రావని అందరూ అంటూ ఉంటారు. ఇది కచ్చితంగా డిఫరెంట్ సినిమా అనే చెబ్తా. ఇందులో కమర్షియల్ అంశాలు అన్నీ ఉన్నా కూడా ఓ సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నా. సినిమా చాలా లేట్ అయింది. అయితే ఎంత లేటైనా కూడా డిఫరెంట్ కథాంశంతో వచ్చిన సినిమా కావడంతో సినిమా సక్సెస్‌పై నమ్మకంగా ఉన్నా.

ప్రశ్న) సినిమా లేట్ అవ్వడం పట్ల ఎలా ఫీలవుతున్నారు?

స) లేట్ అయిందంటే దానికి మనమేమీ చెయ్యలేం. ఇదందా దేవుడి స్క్రీన్‌ప్లే. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తీసిన సినిమా కావడంతో ప్రాబ్లమ్స్ అక్కడ వచ్చినా, ఇక్కడ ఈ సినిమా కూడా ఆగిపోయింది. నన్నడిగితే ఈ సినిమా లేట్ అవ్వడం మంచికే అనిపిస్తోంది. సరైన టైమ్‌కి రిలీజ్ అయి ఉంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాన్సెప్ట్ ఎలా కనెక్ట్ అయ్యేదో! ఇప్పుడు ఆడియన్స్ టేస్ట్ మారింది. డిఫరెంట్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి స్కోప్ ఉన్న టైమ్‌లో వస్తోంది. ఈ రకంగా ఆలోచిస్తే లేట్ అయినా అది మన మంచికే అనిపిస్తోంది.

ప్రశ్న) ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?

స) ఈ సినిమాలో నేను కళ్యాణ్ అనే ఓ కొరియర్ బాయ్‌గా కనిపించనున్నా. సినిమాలో అన్నీ సహజ సిద్ధమైన పాత్రలే ఉంటాయి. అంతా నార్మల్‌గా ఉండాలనుకునే జీవితంలో వచ్చిన ఊహించని మలుపులేంటి? అతడి జీవితం ఎటుపోతుంది? అన్న అంశాల చుట్టూ కథ తిరుగుతూంటుంది. కచ్చితంగా ఈ క్యారెక్టర్‌‌ను నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే పాత్రగా చెప్పుకోవచ్చు.

ప్రశ్న) దర్శకుడు ప్రేమ్ సాయి గురించి చెప్పండి?

స) ప్రేమ్ సాయి ఈ కథ చెప్పగానే విపరీతంగా కనెక్ట్ అయ్యా. అప్పటివరకూ లవ్, యాక్షన్ ఇలా కమర్షియల్ జోన్‌, ఫార్మాట్స్‌లోనే సినిమాలు చేసిన నేను, ఈ సినిమా చేస్తే కొత్తగా ఉంటుందని ఆలోచించా. నాకు చెప్పిన కథను అంతే సమర్ధవంతంగా తెరకెక్కించడంలో చాలా సక్సెస్ అయ్యారు. ఈ సినిమా మేజర్ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది.

ప్రశ్న) గౌతమ్ మీనన్ నిర్మాణంలో సినిమా అనగానే ముందు ఏమనిపించింది? ఈ సినిమాలో ఆయన స్టైల్ ఉంటుందా?

స) గౌతమ్ మీనన్ గారి సినిమాలంటే అందరికీ ఇష్టమే. ఇక ఆయన ప్రొడక్షన్‌లో వచ్చే సినిమా అన్నా కూడా మనం కొత్తదనాన్ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆయన మొదట్నుంచీ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇక ఈ సినిమాకు, గౌతమ్ మీనన్ స్టైల్‌కు సంబంధం ఉండదు. ఇది కంప్లీట్‌గా ప్రేమ్ సాయి సినిమా. అయితే గౌతమ్ మీనన్ సినిమాల్లో ఉండే సహజత్వం, సహజమైన పాత్రలు ఈ సినిమాలోనూ కనిపిస్తాయి. గౌతమ్ మీనన్ స్టైల్ లేకున్నా ఆయన సినిమాల్లో ఉండే సెన్సిబిలిటీ ఈ సినిమాలో ఉంది.

ప్రశ్న) ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ అనే సినిమా మీకు కొత్తగా ఏం గుర్తింపు తెస్తుందనుకుంటున్నారు?

స) కచ్చితంగా ఈ సినిమా నా కెరీర్లో ఓ డిఫరెంట్ సినిమాగా నిలుస్తుందని చెప్పవచ్చు. హీరోగా నాకు ఈ సినిమా ఓ రెస్పెక్ట్ తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది.

ప్రశ్న) నిర్మాతగా ప్రయాణం ఎలా ఉంది? ఫ్యూచర్‌లో మరిన్ని సినిమాలు చేస్తారా?

స) బాగుంది. అఖిల్ సినిమా గురించే గత కొన్ని నెలలుగా కష్టపడుతూ ఉన్నా. ఏదేమైనా సినీ నిర్మాణమనేది ఎంతో ఒత్తిడితో కూడుకున్న పని. అఖిల్ సినిమా తర్వాత నిర్మాతగా కొన్నాళ్ళ పాటు బ్రేక్ తీసుకుంటా. ఆ తర్వాత మళ్ళీ కొత్త సినిమాలు చేస్తా.

ప్రశ్న) అఖిల్ సినిమా ఎలా వచ్చింది?

స) చాలా బాగా వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా అని సాధారణంగా వింటూ ఉంటాం. అఖిల్ భారీ కథతో భారీగా తెరకెక్కిన సినిమా. వీవీ వినాయక్ గారి పకడ్బందీ ప్లాన్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈవారమే ఆడియో రిలీజ్ ఉంది. ఆ ఫంక్షన్‌కి స్పెషల్ గెస్ట్ ఎవరనే విషయమై ఇంకా ఏదీ డిసైడ్ చేయలేదు.

ప్రశ్న) త్రివిక్రమ్‌తో మీ సినిమా ఎలా ఉండబోతోంది?

స) త్రివిక్రమ్ గారి స్టైల్లోనే సాగే ఓ మంచి లవ్‌స్టోరీతో ఆ సినిమా ఉంటుంది. జనవరిలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం. కథ వినగానే ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ముందుకెళుతున్నా.

ప్రశ్న) తదుపరి ప్రాజెక్టులేంటి? సూర్య ’24’ను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు విశేషాలు తెలపండి?

స) త్రివిక్రమ్ గారి సినిమా తర్వాత గౌతమ్ మీనన్ గారి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేయనున్నా. అది వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళుతుంది. ఇక సూర్య ’24’ ఏపీ, తెలంగాణాల్లో మేమే విడుదల చేయనున్నాం. విక్రమ్ కుమార్ చాన్నాళ్ళ క్రితమే నాకు ఈ కథ చెప్పారు. ఆ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు