ఇంటర్వ్యూ : వివి. వినాయక్ – ఒక పాటలో తేజ్ ను చూస్తే చిరంజీవిగారు కనిపించేస్తారు !

స్టార్ డైరెక్టర్ వివి.వినాయక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇంటిలిజెంట్’. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా వినాయక్ మీడియాతో ముచ్చటించారు. ఆ సంగతులు మీకోసం…

ప్ర) సినిమా ఎలా వచ్చింది ?
జ) నిన్ననే కాపీ చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాదిస్తుంది.

ప్ర) చిత్రం ఎలా ఉండబోతోంది ?
జ) ఇందులో యాక్షన్ తో పాటు మంచి హ్యూమర్, ఎమోషన్స్, ఫైట్స్, డాన్స్ అన్నీ ఉంటాయి. 100 శాతం కమర్షియల్ ప్యాకేజ్ అనుకోండి.

ప్ర) ధరమ్ తేజ్ ఎలా చేశాడు ?
జ) తేజ్ కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి. తన స్టైల్లో చాలా బాగా చేశాడు. నటన చాలా బాగుంటుంది. ముఖ్యంగా డ్యాన్సులు అద్దిరిపోయేలా చేశాడు. ఒక పాటలో అయితే చిరంజీవిగారు కనిపించేస్తారు.

ప్ర) సినిమా కథ ఎలా ఉండబోతోంది ?
జ) చిన్నప్పటికి నుండి తన ఎదుగుదలకు కారణమైన ఒక వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని హీరో ఎదిరించి పోరాడుతూ, తన మైండ్ గేమ్ తో స్నేహితులతో కలిసి ప్రతినాయకుడిని ఎలా ఎదుర్కున్నాడు అనేదే సినిమా కథ. చాలా రేసీగా ఉంటుంది.

ప్ర) ఈ సినిమాటి తేజ్ కు ఎలాంటి ఇమేజ్ వస్తుందో చెప్పగలరా ?
జ) ఈ సినిమా తర్వాత తేజ్ పట్ల ఇతను ఎంత పెద్ద కథనైనా మోయగలడు అనే నమ్మకం ఏర్పడుతుంది.

ప్ర) థమన్ సంగీతం గురించి చెప్పండి ?
జ) ఇంతకు ముందు ‘నాయక్’ సినిమా కోసం థమన్ తో వర్క్ చేశాను. ఇప్పుడు ఈ సినిమా కోసం చేశాను. ఆయన సంగీతం చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా మెప్పిస్తుంది. ఉన్న నాలుగు పాటలు సందర్భానుసారంగా వస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి.

ప్ర) చిరంజీవిగారితో వర్క్ చేయడానికి, తేజ్ తో చేయడానికి తేడా ఏంటి ?
జ) చిరంజీవిగారితో వర్క్ చేసేప్పుడు సెట్స్ లో ఒక ఫోర్స్ ఉంటుంది. నాలో కొంత టెంక్షన్ ఉంటుంది. అదే తేజ్ తో చేసేప్పుడు చాలా రిలాక్స్డ్ గా చేశాను. అంటే తేడా. కానీ ఒక దర్శకుడిగా సినిమా అంటే ఉండే టెంక్షన్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.

ప్ర) ఈ మధ్య బయటివాళల్ కథలతోనే ఎక్కువ చేస్తున్నారు. కారణం ?
జ) అన్ని కథలూ చేయాలి. ఎప్పుడూ నా కథలే చేస్తే పెద్దగా తేడా అనిపించదు. రాఘవేంద్రరావుగారు చెప్పేవారు అప్పుడప్పుడు బయటి కథలు కూడా చేయాలని. అప్పుడే మనలోని కొత్త కోణాలు బయటికొస్తాయని.

ప్ర) ఈ మధ్య మీరు రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలొచ్చాయి. వాటిపై మీ కామెంట్ ?
జ) నాకైతే ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దశ్యం లేదు. కొడాలి నాని ఒక సందర్భంలో సరదాగా అన్న మాట రకరకాల రూపాల్లో బయటికొచ్చింది.