సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో రాబోతున్న ప్రతిష్టాత్మక సీక్వెల్ ‘జైలర్ 2’. దక్షిణాది మార్కెట్లలో ఇప్పటికే, ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతుండగా, ఉత్తరాదిలో మాత్రం ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కి ఇప్పుడు ఓ అడ్డంకి ఎదురైంది. పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్ వంటి మెయిన్ నేషనల్ మల్టీప్లెక్స్‌లలో ఈ హిందీ వెర్షన్ పూర్తిగా విడుదల కాదని వార్తలు వస్తున్నాయి. అందుకు మూల కారణం.. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకోవడమే.
ఐతే, హిందీ చిత్రాల డిజిటల్ విడుదలకు ఎనిమిది వారాల విరామం ఉండాలని జాతీయ సినిమా థియేటర్ల సంస్థలు పట్టుబట్టడంతో, ఉత్తరాది రాష్ట్రాల్లోని సింగిల్-స్క్రీన్ థియేటర్లలో మాత్రమే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. కేవలం నాలుగు వారాల తక్కువ వ్యవధిలోనే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ భారీ మొత్తాన్ని చెల్లించి దక్కించుకుంది. అందుకే. అక్కడ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లోనైనా సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, హృతిక్ రోషన్ అతిథి పాత్రల్లో కనిపించనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.


