బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ ‘రామాయణ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విలక్షణ నటుడు యశ్.. రావణుడిగా కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి టీమ్ సిద్ధమవుతున్నారు. ఐతే, దసరా పండుగ సందర్భంగా, 2026 అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభం కానున్నాయి. అదే రోజున చిత్ర బృందం రెండో థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేయాలని యోచిస్తోందట.
ఈ కొత్త ట్రైలర్‌లో శ్రీరాముని శక్తి సామర్థ్యాలతో పాటు, రావణుని యొక్క మరింత భయంకరమైన ఉగ్ర కోణాన్ని కూడా చూపించనున్నట్లు సమాచారం. ఐతే, ట్రైలర్ విడుదల తేదీపై నిర్మాణ సంస్థ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. మొత్తానికి సినీప్రియులందరి దృష్టి ప్రస్తుతం ‘రామాయణ’ మీదే ఉంది. బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గకుండా విదేశీ నిపుణులు పని చేస్తున్నారు.
పైగా సరికొత్త టెక్నాలజీ, భారీ సెట్స్‌తో ఇండియా మరియు విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఇక ఈ సినిమాలో సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


