తన విలక్షణమైన గొంతుతో అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ మంచి పేరు సంపాదించుకున్న సింగర్.. కైలాష్ ఖేర్. ఆయన తెలుగులో పాడిన పాటలన్నీ హిట్‌గా నిలిచి ఇప్పటికీ శ్రోతల నోళ్ళలో నానుతూ ఉన్నాయి. తాజాగా బాహుబలి చిత్రంలో ఆయన పాటను మరోసారి వినే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కింది. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చారిత్రక చిత్రం బాహుబలిలో ఓ కీలక పాటకు కైలాష్ గొంతు కలిపారు. చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి ఆధ్వర్యంలో ఈ పాటకు సంబంధించిన రికార్డింగ్ కూడా ఇప్పటికే పూర్తైంది.
ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న బాహుబలి షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ప్రభాస్, అనుష్కలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రానా విలన్‌గా నటించారు. గతంలో ప్రభాస్ నటించిన మిర్చి చిత్రంలో ‘పండగలా దిగివచ్చాడు..’ పాట ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఆ పాట కైలాష్ ఖేర్ గొంతు ద్వారా వినిపించిందే. ఇప్పుడు ప్రభాస్‌కి మళ్ళీ కైలాష్ ఓ పాట పాడుతుండడం, అదీ బాహుబలి సినిమాకి కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ వీలైనంత త్వరలో పూర్తి చేసి మే 15న బాహుబలి మొదటి భాగాన్ని విడుదల చేసేందుకు సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది.


