ఇంటర్వ్యూ : ప్రశాంత్ వర్మ – నేను క్లైమాక్స్ రాశాకే.. మిగిలిన కథ రాస్తాను !

ఇంటర్వ్యూ : ప్రశాంత్ వర్మ – నేను క్లైమాక్స్ రాశాకే.. మిగిలిన కథ రాస్తాను !

Published on Jun 30, 2019 4:09 PM IST

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జూన్ 28న రిలీజ్ అయిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘కల్కి’. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకం పై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఈ సినిమాను నిర్మించారు. కాగా తాజాగా ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం..

 

మీరు కథ ఎలా రాస్తారు. ముందుగా క్లైమాక్స్ రాసుకుంటారా ?

 

అవునండి. నేను ముందు క్లైమాక్స్ రాసుకున్నాకే మిగిలిన కథ రాయడం మొదలుపెడతాను. చాలమంది కథ రాస్తారు.. ఇలా క్లైమాక్స్ రాయాలని చెప్తూంటారు. ఇది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. నాకు తెలిసి క్లైమాక్స్ రాసుకున్నాకే.. పూర్తి కథ రాయడం బెస్ట్ అని నేను నమ్ముతాను.

 

అంటే ముందు ముగింపు రాసుకోని.. ఆ తరువాత కథ స్టార్టింగ్ నుంచి రాసుకోవడం అంటే కష్టం కదా ?

 

కష్టమే అయినా అదే కరెక్ట్ అండి. క్లైమాక్స్ బలంగా ఉండాలంటే.. ముందు మనం ప్రధానంగా దాన్నే రాసుకోవాలి. అప్పుడే సినిమాకు ముగింపు బలంగా ఉంటుంది.

 

మీ మొదటి సినిమా కూడా క్లైమాక్సే మెయిన్ గా వచ్చింది. ఇది మీ శైలి అనుకోవచ్చా ?

 

లేదండి నా తరువాత సినిమాలో ఇంటర్వెల్ హైలెట్ అవుతుంది. ఇంటర్వెల్ ఉన్నంత రేంజ్ లో క్లైమాక్స్ ఉండకపోవచ్చు. నేను అయితే.. ఒకే శైలి సినిమాలు చెయ్యను.

 

మీరు కథ రాయడానికి ఎంత టైం తీసుకుంటారు ?

 

దాదాపు సంవత్సరం తీసుకుంటానండి. అంటే చాలా వెర్షన్స్ రాస్తాను. అందుకే అంత టైం పడుతుంది.

 

మీకు ‘అ’ సినిమా తరువాత మీకు చాల పెద్ద ఆఫర్స్ వచ్చాయని రూమర్స్ వచ్చాయి ?

 

లేదండి. అవి ఒట్టి రూమర్సే. కానీ ప్రతి హీరోకి ఒక ఇమేజి ఉంటుంది. ఆ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని నేను సినిమా తియ్యగలనా లేదా అని వాళ్ళకు అనుమానం ఉంటుంది. అది తప్పు కాదు.

 

కల్కి సినిమాకి రెస్పాన్స్ ఎలా ఉంది ?

 

మంచి రెస్పాన్స్ ఉందండి. మేము కొన్ని థియేటర్స్ కి వెళ్లి ఎలా ఉందని అంటే.. అందరూ పాజిటివ్ గానే చెప్పారు.

 

కానీ సినిమాకు రివ్యూస్ బాగా రాలేదు కదా ?

 

ఈ సినిమాకు నేను రివ్యూ రాసినా.. తక్కువ రేటింగే ఇస్తానేమో. ఎందుకంటే.. ఇది ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే టార్గెట్ చేసుకుని చేసింది. సినిమా అయితే ఎవరికైతే చేరాలో వాళ్లకు బాగా రీచ్ అవుతుంది.

 

రాజశేఖర్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

 

ఆయనతో పని చేయడం చాలా హ్యాపీ అండి. చాల అనుభవం ఉన్న ఆయన్నుంచి ఎంతో నేర్చుకోవచ్చు.

 

ఏ దర్శకుల ప్రభావం మీ పై ఎక్కువగా ఉంది ?

 

ఫలానా దర్శకుడి అని చెప్పలేను. చేసే సినిమాని బట్టి.. గతంలో అలాంటి సినిమాలు చేసిన దర్శకుల ప్రభావం ఉంటుంది. ఇప్పుడు కల్కి చేసినప్పుడు మాస్ మసాలా సినిమాలన్నీ చూసాను. అలా ఈ సినిమా చేయడానికి.. గతంలో అలాంటి సినిమాల డైరెక్టర్స్ ప్రభావం నా పై కొంతవరకూ ఉంటుంది.

 

మీ తదుపరి సినిమా గురించి చెప్పండి ?

 

ప్రస్తుతం కల్కి సినిమాకి వచ్చే ఫుల్ కలెక్షన్స్ ను బట్టే నా మూడో సినిమా ఉంటుంది. అయితే ఇప్పటీకే రెండు కథలను ఇద్దరు హీరోలతో చెప్పాను. చూడాలి వాటిల్లో ఏ సినిమా మొదలవుతుందో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు