దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం.. ‘బాహుబలి’. ఈ సినిమా మే 15న విడుదలవుతుందన్న విషయాన్ని రాజమౌళి ఇంతకుముందే తెలియజేశారు. తాజా సమాచారం మేరకు బాహుబలిని హిందీలో విడుదల చేసే హక్కులను ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాహుబలి పట్ల తెలుగుతో పాటు తమిళంలో కూడా భారీ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో హిందీలో కూడా బాహుబలికి ఉన్న క్రేజ్ ఏంటన్నది బయటకు వచ్చింది. కరణ్ జోహర్ ఎంత మేరకు చెల్లించి ఈ హక్కులను సొంతం చేసుకున్నారన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
కాగా రాజమౌళికి బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్, బాహుబలి పట్ల దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఉన్న ఆసక్తి లాంటివి బాహుబలి రేంజ్‌ను అమాంతం పెంచేశాయని ట్రేడ్ వర్గాల టాక్. కరణ్ జోహర్ నిజంగానే హిందీ రైట్స్ తీసుకొని ఉంటే, బాహుబలికి అదొక మంచి ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పాలి. కరణ్ జోహర్‍కి హిందీ మార్కెట్‍పై ఉన్న పట్టు సినిమాను ఎక్కువమందికి చేర్చడంలో దోహదపడుతుంది.
గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సూపర్‍హిట్ చిత్రాలైన ‘విక్రమార్కుడు’, ‘మర్యాదరామన్న’ సినిమాలు హిందీలో రీమేక్ అయి మంచి విజయాన్ని సాధించాయి. రాజమౌళి గత చిత్రమైన ఈగను హిందీలో విడుదల చేసేందుకు రిలయన్స్ సంస్థ అప్పట్లోనే భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు బాహుబలి అయితే ఇంకా ఎక్కువే పలికిందని తెలుస్తోంది. ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు.


