సమీక్ష : కిల్లర్ – థ్రిల్లింగ్ గా సాగే క్రైమ్ డ్రామా !

సమీక్ష : కిల్లర్ – థ్రిల్లింగ్ గా సాగే క్రైమ్ డ్రామా !

Published on Jun 8, 2019 4:00 AM IST
Idi Naa Love Story movie review

విడుదల తేదీ : జూన్ 07, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 3 /5

నటీనటులు :  అర్జున్, విజయ్ ఆంటోనీ, ఆశిమా నార్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్ తదితరులు

దర్శకత్వం : ఆండ్రూ లూయిస్

నిర్మాతలు : టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్

సంగీతం : సైమన్ కె.కింగ్

సినిమాటోగ్రఫర్ : మాక్స్

ఎడిటర్ : రిచర్డ్ కెవిన్

ఆండ్రూ లూయిస్‌ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం ‘కొలైగారన్‌’. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై టి.నరేష్‌ కుమార్‌ – టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులోకి అనువదించారు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

విజయ్ ఆంటోని (ప్రభాకర్) ఏసిపిగా వర్క్ చేసి కొన్ని కారణాల వల్ల పోలీస్ జాబ్ వదిలేసి.. వేరే జాబ్ చేసుకుంటూ ఉంటాడు. అయితే తన ప్లాట్ కి ఎదురుగా ఉంటున్న ఆషిమా న‌ర్వాల్ (జయంత)ను ఫాలో అవుతుంటాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఆషిమా న‌ర్వాల్ ను ఆమె తల్లిని పోలీస్ ఆఫీసర్ కార్తికేయ (అర్జున్) మినిస్టర్ తమ్ముడు వంశీ అనే వ్యక్తి హత్య కేసులో అనుమానిస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల తరువాత ఆ అనుమానమే నిజం అనిపిస్తోంది. కానీ అంతలో ఆ హత్య చేసింది నేనే అంటూ విజయ్ ఆంటోని పోలీస్ లకు లొంగిపోతాడు. అసలు వంశీని హత్య చేసింది ఎవరు ? విజయ్ ఆంటోని ఎందుకు పోలిస్ లకు లొంగిపోయాడు ? ఇంతకీ విజయ్ ఆంటోని కి ఆషిమా న‌ర్వాల్ కి ఉన్న సంబంధం ఏమిటి ? చివరికీ వంశీని హత్య చేసిన వ్యక్తిని అర్జున్ పట్టుకున్నాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండి తెర పై ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

క్రైౖమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో ఓ మర్డర్‌ మిస్టరీ చుట్టూ ఈ సినిమా సప్సెన్స్ తో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు అలరిస్తాయి. ప్రధానంగా సినిమాలో వంశీ పాత్ర హత్య జరగడం. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన ప్రధాన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్ లో వచ్చే ప్లాష్ బ్యాక్.. అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే విచారణ సన్నివేశాలు వంటి అంశాలు సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఇక కార్తికేయ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. ప్రధాన పాత్రలో నటించిన విజయ్ ఆంటోని తన పాత్రకు అనుగుణంగా తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ మెప్పిస్తాడు. ముఖ్యంగా తన ఎక్స్ ప్రెషన్స్ తోనే సినిమాలో సీరియస్ నెస్ ను మరియు ఇంట్రస్ట్ ను మెయింటైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాలో హీరోయిన్ నటించిన ఆషిమా న‌ర్వాల్ తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆమెకు తల్లిగా నటించిన సీత కూడా చాలా బాగా నటించింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు ఆండ్రూ లూయిస్‌ రాసుకున్న కాన్సెప్ట్ మరియు స్క్రీన్ ప్లే.. అలాగే కొన్ని క్రైమ్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ సీరియస్ గా సాగడం.. దానికి తోడూ కొన్ని సన్నివేశాల్లో ప్లో మిస్ అవ్వడంతో అక్కడక్కడ సినిమా బోర్ కొడుతోంది.

పైగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం కొంతమేరకు లోపించినట్లు అనిపిస్తోంది. ఇంటర్వెల్ సీన్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలను దర్శకుడు చాలా సినిమాటిక్ గా చెప్పాడు. ఆలాగే సినిమాలో బి.సి ఆడియన్స్ ఆశించే కమర్షియల్ అంశాలు లేకపోవడం కూడా సినిమాకి మైనస్ అవుతుంది.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. కెమెరామెన్ గా చేసిన మాక్స్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని క్రైమ్ సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. సంగీత దర్శకుడు సైమ‌న్.కె.కింగ్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘చంపొద్దే చంపొద్దే’ అనే పాట, ఆ పాటను చిత్రీకరించిన విధానం మెప్పిస్తోంది. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు ఆండ్రూ లూయిస్‌ మంచి కథాంశంతో పాటు ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకున్నాడు. అయితే కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఆయన కాస్త తడబడ్డాడు.

 

తీర్పు :

ఆండ్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సప్సెన్స్ తో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో, ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లేతో ఆసక్తికరంగా సాగుతూ ఆకట్టుకుంటుంది. మెయిన్ గా క్రైమ్ సన్నివేశాలు, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు అర్జున్ – విజయ్ అంటోనిల నటన బాగా అలరిస్తాయి. అయితే దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే మరీ సీరియస్ గా సాగడం, పైగా కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించడం వంటి అంశాలు సినిమాకి బలహీనతగా నిలుస్తాయి. మొత్తం మీద ఈ ‘చిత్రం’ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి మరియు కొత్తధనం కోరుకునే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. మరి, మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

 

 

123telugu.com Rating :  3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు