తెలుగు పరిశ్రమకు మద్దతుగా సినిమాల్ని నిలిపివేయనున్న కోలీవుడ్ !

డిజిటల్ ప్రొవైడర్ల విధి విధానాలపై విసిగిపోయిన దక్షిణాది సినీ పరిశ్రమలు గత నెల 31న తెలుగు నిర్మాతలు సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు పి. కిరణ్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కె. మురళీ మోహన్, తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు విశాల్, కేరళ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సియాద్ కొక్కర్ తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో సమావేశమైన సంగతి తెలిసిందే.

ఈ సమావేశంలో తెలుగు నిర్మాతల మండలి ఇంకో వారంలోగా డిజిటల్ ప్రొవైడర్లు చర్చలకు సహకరించి, ఆమోదయోగ్యమైన ధరలను అవలంబించకపోతే మార్చి 1నుండి థియేటర్లు మూసివేస్తామని ప్రకటించారు. దీనిపై నిర్ణయం తీసుకున్న తమిళ చిత్ర నిర్మాతలు మండలి కూడా తెలుగు పరిశ్రమతో పాటే డిజిటల్ ప్రొవైడర్ల ఆగడాలను అడ్డుకునేందుకు మార్చి 1 నుండి థియేటర్లు మూసివేయాలని అధికారికంగా ప్రకటించారు.

ఈ నిరసనలో కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలు సైతం పాలుపంచుకోనున్నాయి. దీంతో సమస్య పరిష్కారం కాకపొతే మార్చి 1 నుండి దక్షిణాదిలో అన్ని సినిమా హాళ్లు మూతబడనున్నాయి.